27, మార్చి 2013, బుధవారం

పద్య రచన – 293 (హోళి)

కవిమిత్రులారా,
హోళీ పండుగ శుభాకాంక్షలు.
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:


 1. రంగుల జల్లుచును పలు తె
  రంగులనీ పండుగనల రారుదురయ్యా
  రంగులు మంచివి వాడుడు
  రంగుల "ఘోరంగు" లున్న 'రంగు పడుద్దీ!'
  ఘోరంగులు = ఘోరమైన , కల్తీ రంగులు ( సరదాగా
  పెట్టిన పదం )

  రంగుల జల్లుచును పలు తె
  రంగులనీ పండుగనల రారుదు రయ్యా
  రంగులు మంచివి వాడుడు
  రంగులు కల్తీవి వాడ రాదన వినుడీ !

  రిప్లయితొలగించండి
 2. హొళీ పండుగ రోజున
  పాళియ గాం డ్రం ద రచట భామల తోడన్
  వేళా కోళ ము లాడుచు
  హేళ ముగా రంగు పూ సి హీ హీ యనిరీ .

  రిప్లయితొలగించండి
 3. రంగులే పెక్కు తెరంగులై హంగులై
  .... ప్రకృతికి నెంతేని వన్నె గూర్చు
  నాహ్లాదమును గూర్చు నట్టి పూర్ణిమ రాత్రి
  ....వెన్నెలలో జేరి పెక్కు జనులు
  బృందావనమ్ములో శ్రీ రాధికా కృష్ణ
  ....మూర్తుల దలచుచు మోదమలర
  నా రాసలీలల నాత్మలో గాంచుచు
  ....జల్లుకొందురు మహోత్సాహమయులు
  పలు తెరంగుల రంగుల పండువనుచు
  నాటపాటలలో దేలి యమిత మోద
  మందు చుందురు విందు పసందులెసగ
  బళి! వసంతోత్సవములిట్లు పరిఢవిల్లు

  రిప్లయితొలగించండి
 4. వసంతునికోసం మత్తకోకిల స్వాగతం

  వచ్చెనోయి వసంతమిచ్చట బాలబాలకులెల్లరున్
  వచ్చిచేరి సరాగమాడుచు పాడియాడిరి ప్రేమతో
  పచ్చనాకుల రంగుపువ్వుల పల్లెసీమల అందమే
  మెచ్చి వారికి రంగులిచ్చుచు మేలమాడగ వేడుకే!

  రిప్లయితొలగించండి
 5. హరిఁగని మురియుచు తరుణులు
  పరవశమున మిన్నుమేను మరచుచునాడన్
  విరిసిన వన్నెల వెలుగుల
  మెరిసెడినీ జగములెల్ల మించెడు కళలన్

  రిప్లయితొలగించండి


 6. హోలి పండుగ కారణాల్ చాలగలవు
  పల్కెదరు దేశమందున బలువిధముల,
  నమితహర్షదాయక వసంతాగమనము
  వర్ణదీప్తమై తెలిపెడి పండు గదియె.

  రిప్లయితొలగించండి
 7. అనుష్టుప్ :

  కాళియ మర్దినం కృష్ణం
  గోపవధూ సమావృతం
  య: క్రీడతి వసంతోత్స
  వం తం వందే పరాత్పరం

  రిప్లయితొలగించండి
 8. శ్రీ నాగరాజు రవీందర్ గారు! శుభాశీస్సులు. మీరు అనుష్టుప్పు బాగుగ వ్రాసినారు. సంస్కృతములో ఏ పాదమునకు ఆ పాదము విడి విడిగానే ఉంటాయి. 3వ పాదము చివరలో ఒక అక్షరము 4వ పాదములో మరొక అక్షరముగా విడదీసి పదమును వేయకూడదని నా నమ్మకము. అందుచేత మీ శ్లోకములో 3, 4 పాదములను ఇలాగ మార్చుదాము:

  వసంతోత్సవ సంలగ్న
  చిత్తం వందే పరాత్పరం


  రిప్లయితొలగించండి
 9. నేమాని పండితార్యా! ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దర్శింపజేశారు.

  నా ప్రయత్నం:

  ప్రకృతి క్రొంజీరకై పలవరించుట జూచి
  ............శిశిరమ్ము సెలవని చెప్పు వేళ !
  తరువులన్నియు రాల్చి దళముల క్రొన్ననల్
  ...........ధరియింప సమకట్టి మురియు వేళ
  నిశలు కృశింపగా నిబ్బరమ్ముగ పవల్
  ...........వెచ్చదనమ్ము తా నిచ్చు వేళ
  గోపీ సమేతుడై గోవర్ధనోద్ధారి
  ..........యమునా తటిని క్రీడ లాడు వేళ

  మించ వేడుక లానంద మెల్ల ధాత్రి
  రంగు జలముల జల్లుక హంగు గాను
  కూర్మి జనములు ప్రకటించు గొప్ప వేళ
  స్వాగతమ్మన రారె వాసంతునకును.

  రిప్లయితొలగించండి
 10. గురుభ్యో నమ: ఇలా అనుష్టుప్ శ్లోకం వ్రాయడం నా తొలి ప్రయత్నం. సందేహ నివృత్తి గావించి పరిష్కరించి నందులకు మీకు నేను సదా కృతజ్ఞుడను.

  రిప్లయితొలగించండి
 11. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారు! శుభాశీస్సులు.
  ఒక విధమైన "అనుష్టుప్పు" లక్షణములను వ్రాయుచున్నాను.
  శ్లోకే షష్ఠం గురుం జ్ఞేయం
  సర్వత్ర లఘు పంచమం
  ద్వి చతుః పాదయోర్ హ్రస్వం
  సప్తమం దీర్ఘ మన్యధా

  ప్రతి పాదములోను -- 5వ అక్షరము లఘువు, 6వ అక్షరము గురువు ఉండవలెను.
  7వ అక్షరము - 1, 3 పాదములలో గురువును, 2, 4 పాదములలో లఘువును అయి ఉండవలెను.
  (శ్లోకములోని 4వ పాదము నాకు జ్ఞాపకము ఉన్నట్లు వ్రాసేను - అర్థములో తేడా లేదు.)
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ మిస్సన్న గారి పద్యములలో క్రొత్త భావములు క్రొంగ్రొత్త పోకడలునూ ఉట్టిపడుచుండును. శుభం భూయాత్.

  రిప్లయితొలగించండి
 13. రంగుల కోలా హలమున
  పొంగేనుత్సాహదీప్తి పులకలు రేపన్
  చెంగున దూకుచు తరుణుల
  కొంగుల రంగులు పులిమెను గోవిందుడటన్!

  రిప్లయితొలగించండి
 14. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  అంతరంగపుటన్నెము లంతరింప
  రంగరించుచు చల్లగ రంగురంగు
  లంత నొకరికొకరిమీద హాయిమీర
  గోపికాకృష్ణుల మదిని గొల్చుచుండి.

  రిప్లయితొలగించండి
 15. రంగుల పండుగ హోళీని పురస్కరించి కవులు ఉత్సాహంగా చక్కని పద్యాలను రచించి అలరింపజేసారు. అయితే చిత్రాన్ని ‘పరిశీలించి’ తగిన పద్యాలను వ్రాసిన వారు పండిత నేమాని వారు, ఫణిప్రసన్న కుమార్ గారు, నాగరాజు రవీందర్ గారు, సహదేవుడు గారు మాత్రమే. అయితే శీర్షికగా ‘హోళీ’ అని మాత్రమే ఇచ్చినందున మిగిలిన వారి పద్యాలూ గ్రాహ్యములే.
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  పండిత నేమాని వారికి,
  లక్ష్మీదేవి గారికి,
  ఫణి ప్రసన్న కుమార్ గారికి,
  కమనీయం గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  సహదేవుడు గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,

  సరస కవితను వ్రాసి వసంతశోభ
  కిదియె స్వాగత మని చెప్పి యెల్లరకును
  మోదమును గూర్చు మీ పద్యమును పఠించి
  సన్నుతించెద మయ్య మిస్సన్న గారు!

  రిప్లయితొలగించండి
 16. గురువర్యులకు ధన్యవాదములు.

  అనుష్టుప్ శ్లోక లక్షణాలు :

  ప్రతి పాదంలో ఎనిమిది అక్షరాలు :

  = ఐదవ అక్షరం అన్నీ లఘువులై యుండ వలెను
  = ఏడవ అక్షరం ఒకటి మూడు పాదాలలో గురువులు రెండు నాలుగు పాదాలలో లఘువులై యుండవలెను.
  = ఆరవ అక్షరం నాలుగు పాదాలలో గురువేయై యుండవలెను
  = ఎనిమిదవ అక్షరం లఘువు కాని గురువు యుండవలెను.


  మొదటి నాలుగు అక్షరాలు లఘువులు కాని గురువులు.
  రెండు కంటే ఎక్కువ లఘువులు వరుసగా ఉండరాదు.

  అనుష్టుప్ శ్లోకానికి ఉదాహరణలు :

  కూజంతం రామరామేతి
  మధురం మధురాక్షరం
  ఆరుహ్య కవితా శాఖాం
  వందే వాల్మీకి కోకిలం

  శుక్లాంబర ధరం విష్ణుం
  శశివర్ణం చతుర్భుజం
  ప్రసన్న వదనం ధ్యాయేత్
  సర్వ విఘ్నోప శాంతయే

  రిప్లయితొలగించండి
 17. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 19. రంగులన్నియు బాగుగా రంగరించి
  తారతమ్య భావమ్మును తరిమివైచి
  జల్లుకొందురు తనువున చక్కగాను
  అంగజుని రాకకానందమందు మునిగి.

  రిప్లయితొలగించండి
 20. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. నేమాని పండితార్యా ధన్యవాదములు.

  గురువుగారూ మరొకసారి మీ ప్రత్యెక ప్రశంసను పొందడం చాలా సంతోషంగా ఉంది.

  రిప్లయితొలగించండి