28, మార్చి 2013, గురువారం

సమస్యాపూరణం – 1008 (హర నీవే శరణమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హర నీవే శరణమ్ము నా కనియెఁ బ్రహ్లాదుండు సద్భక్తుఁడై.

20 కామెంట్‌లు:

  1. పరమానంద రస స్వరూప విభవా! బ్రహ్మేంద్ర ముఖ్య స్తుతా!
    హరి! నారాయణ! దేవ దేవ! శ్రిత చిత్తాంభోజ సంవాస! నీ
    చరణాంభోరుహ సీమ చేయుదు నమస్కారమ్ము, లక్ష్మీ మనో
    హర! నీవే శరణమ్ము నా కనియె బ్రహ్లాదుండు సద్భక్తుడై

    రిప్లయితొలగించండి
  2. హరి నీవే "కనలేవు" లేవనుచు నన్నయ్యయ్యొ దూషించునే
    స్మరణమ్మున్ మది సేయనీడు గనుమా మాతండ్రి నే గావుమా
    సరిగా నిప్పుడె కంబమందు నిలుమా సాదృశ్యమై శ్రీ మనో
    హర! నీవే శరణమ్ము నా కనియె బ్రహ్లాదుండు సద్భక్తుడై

    రిప్లయితొలగించండి
  3. పరిపాలించెదవంచు నమ్మితిని నీవాలింప రావైతివే,
    కరుణాసాగర! దేవదేవుడవు లోకాధీశ! నన్నేలవే,
    పరిశీలింపగ నెంచె తండ్రి నిను రావా స్వామి! హృద్పద్మ దే
    హర నీవే శరణమ్ము నా కనియెఁ బ్రహ్లాదుండు సద్భక్తుఁడై.

    రిప్లయితొలగించండి
  4. హర నీవే శరణమ్ము నాకనియె "ప్రహ్లాదుండు సద్భక్తుడై
    సిరియాళుండు " మహాప్రమోది గనుకే స్థేయాగ సంసిద్ధుడై
    హరవైశిష్ట్య కథా ప్రధానమున - ఆహారంబు తానౌటకున్
    దరలెన్ ! శంకర నీకృపల్ సులభ సాధ్యంబన్న బేరేలకో ?
    - పరాక్రి

    రిప్లయితొలగించండి
  5. హరి నా శత్రువు వాని నామ మెపుడున్నంకించు చున్నావు నా
    యరి సేవింపకు మంచు నాగ్రహముతో డబ్బాల కున్ గొట్టగా
    కరుణా సాగర కేశవా! వరదుడా ! కాపాడు లక్ష్మీ మనో
    హర! నీవే శరణమ్ము నా కనియె ప్రహ్లాదుండు సద్భక్తితో .

    రిప్లయితొలగించండి
  6. హరి సర్వేశ్వర శంఖచక్రధర పాపారణ్యదావానలా
    సురనాథప్రముఖామరార్చితపదా సూర్యేందునేత్రోజ్వలా
    మురవైరీ నిజభక్తలోకసులభా మోహాదిషడ్వర్గసం
    హర నీవే శరణమ్ము నా కనియెఁ బ్రహ్లాదుండు సద్భక్తుఁడై.

    రిప్లయితొలగించండి
  7. నరసింహమ్ముగ రూపు దాల్చె హరి తా నా భక్తుడే వేడగన్
    కరముల్ మోడ్చుచు మ్రొక్కె శ్రీపతికి భక్తాగ్రేసరు డత్తఱిన్
    పరమౌ జ్ఞాన మొసంగి మత్పితకు కాపాడంగ రావే ! తమో
    హర ! నీవే శరణమ్ము నా కనియె బ్రహ్లాదుండు సద్భక్తుడై

    రిప్లయితొలగించండి
  8. శ్రీ గురువులకు, మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    ఈనాటి సమస్య శ్రీమద్భాగవతం (7 – 10 – 15,16) లోని ప్రహ్లాదకృతమైన భగవత్స్తుతికి అనురూపంగా ఉన్నది:

    వరం వరయ ఏతత్తే వరదేశాన్మహేశ్వర!
    విద్ధామర్షాశయః సాక్షాత్సర్వలోకగురుం ప్రభుం
    భ్ర్రాతృహేతిమృషాదృష్టి స్త్వద్భక్తే మయి చాఘవాన్
    తస్మాత్ పితా మే పూయేత దురన్తా ద్దుస్తరాదఘాత్.

    ఈ శ్లోకానికి సమస్యానుగతంగా నా తెనుగుసేఁత:

    పరిమార్పం దొరకొంటి వన్న నని దుర్వైరంబునన్ వర్తిలెన్;
    మరణోపాంతమునం ద్వదీయనరసింహావేశరూపాద్భుతా
    క్షరతేజంబును జూడ నోఁచెఁ బిత భాగ్యం బొప్పఁ; దత్కర్మసం
    హర! నీవే శరణమ్ము నా కనియెఁ బ్రహ్లాదుండు సద్భక్తుఁడై.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  9. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    హరునిన్ గొల్చుచు శ్రీహరిన్ దెగడి మహాదోషముల్ సల్పుచున్
    పరిఘాతంబును దూసి మజ్జనకుడుత్పాటింప కంబాన శ్రీ
    కర! భక్తాశ్రయ కల్పనా చతుర శ్రీకాంతాంతరంగా! మనో
    హర! నీవే శరణమ్ము నా కనియెఁ బ్రహ్లాదుండు సద్భక్తుఁడై.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని వారూ,
    లక్ష్మీమనోహరుని శరణు కోరిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    శ్రీమనోహరుని శరణు కోరిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    కాని ‘హృత్పద్మదేహర’ ఇది నా కర్థం కాలేదు.
    *
    పరాక్రి గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు ఆనందంగా స్వాగతం పలుకుతున్నది.
    ప్రహ్లాద శబ్దానికి ఉన్న విశేషార్థాన్ని సిరియాళున కన్వయించి వైవిధ్యంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    లక్ష్మీమనోహరుని ఆశ్రయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శ్యామలరావు గారూ,
    అరిషడ్వర్గ సంహరుని సంబోధించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    తమోహరుడైన హరిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘భక్తాగ్రేసరు డత్తఱిన్’ అన్నప్పుడు గణదోషం.‘భక్తాగ్రేసరుం డత్తఱిన్’ అన్నదానికి టైపాటు కావచ్చు. అనుస్వారం తప్పిపోయినట్టుంది.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    అనువాదంగా కాక స్వతంత్ర రచనవలె భాసిస్తున్న శైలితో, శబ్దసంపత్తితో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    ‘మనోహర’మైన మీ పూరణకు అభినందనలు.
    ‘తెగడి మహాదోషముల్ సల్పుచున్’ అన్నచో గణదోషం. ‘తెగడుచున్ దోషంబులన్ సల్పుచున్’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  11. శ్రీశమ్కరార్యులకు నమస్సులు.హ కారమునకు దో కును యతి కుదరదెడుభావనతో నా గణ దోషమును సవరించుచూ
    హరునిన్ గొల్చుచు శ్రీహరిన్ దెగడి మాహాత్మ్యంబు దర్శింపకన్
    పరిఘాతంబును దూసి మజ్జనకుడుత్పాటింప కంబాన శ్రీ
    కర! భక్తాశ్రయ కల్పనా చతుర శ్రీకాంతాంతరంగా! మనో
    హర! నీవే శరణమ్ము నా కనియెఁ బ్రహ్లాదుండు సద్భక్తుఁడై.

    రిప్లయితొలగించండి
  12. సరిలేరెవ్వరు నీకుభక్తవరదా సాధ్యమ్ముకాదేరికిన్
    ధరకున్ వేగమెరమ్ము సత్యపథమున్ దర్శింపగాజేయుమా
    వరకుల్ బెట్టెడునాదుతండ్రి పనులన్వారింపుమా శ్రీమనో
    హరనీవెశరణమ్మునాకనియెబ్రహ్లాదుండుసద్భక్థుడై

    రిప్లయితొలగించండి



  13. వరగర్వమ్మున నాదు తండ్రి సురలెవ్వారైన చీ యంచు నే
    సరకుంజేయడు,సర్వలోకముల దా శాసింతు నంచయ్యొ నీ
    వరనామమ్ము జపించుచుండెడి ననున్ వారించు లక్ష్మీమనో
    హర,నీవే శరణమ్ము నాకనియె బ్రహ్లాదుండు సద్భక్తుడై.

    రిప్లయితొలగించండి
  14. అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారూ!
    శుభాశీస్సులు.
    సవరించిన మీ పద్యము బాగుగనున్నది. 1వ పాదము చివరలో "దర్శింపకన్" అని వ్రాసేరు. వ్యతిరేకార్థకము "కళ" యగును గాని ద్రుతము కాదు అని గ్రహించి ఆ పదమును మళ్ళీ సవరించగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. గురువుగారు,
    దేహరము అంటే నివాసము అని నిఘంటు అర్థమున్నది. అందుకే అట్లా ప్రయోగించాను.
    తప్పైతే ...మన్నించగలరు.

    రిప్లయితొలగించండి
  16. వందనములు గురువు గారికి - ధన్యవాదములు. నిజమే “భక్తాగ్రేసరుండత్తఱిని " అని ఉండాలి. టైపాటే.

    రిప్లయితొలగించండి
  17. తోపెల్ల వారూ,
    నిజమే! నేను యతిమైత్రిని గమనించలేదు. మన్నించండి. మీ సవరణ బాగుంది.
    నేమాని వ్యాఖ్యను గమనించారు కదా. అక్కడ ... దర్శింపకే/పరిఘాతంబును... అందాం.
    *
    డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    బాఉగంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీ దేవి గారూ,
    నిజమే... నేను నిఘంటువును శోధించకుండా తొందరపడ్డాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీశంకరార్యులకు,శ్రీనేమానివారికి నమస్సులు.మీరుచేప్పినట్లు సవరించుచూ

    హరునిన్ గొల్చుచు శ్రీహరిన్ దెగడి మాహాత్మ్యంబు దర్శింపకే
    పరిఘాతంబును దూసి మజ్జనకుడుత్పాటింప కంబాన శ్రీ
    కర! భక్తాశ్రయ కల్పనా చతుర శ్రీకాంతాంతరంగా! మనో
    హర! నీవే శరణమ్ము నా కనియెఁ బ్రహ్లాదుండు సద్భక్తుఁడై.

    రిప్లయితొలగించండి
  19. పరువుల్ బెట్టుచు వృత్త పూరణమునన్ బంగారు కొండన్ వలెన్
    సరియైనన్ పద జాలముల్ కనక నీ శాస్త్రుండు ఝాడించె భల్:👇
    "హరినే గాంచుచు సర్వ దేవతలనున్ హ్లాదంబునన్ మగ్నుడై
    హర నీవే శరణమ్ము నా కనియెఁ బ్రహ్లాదుండు సద్భక్తుఁడై"

    రిప్లయితొలగించండి