31, మార్చి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1010 (మరుని ముద్దులాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మరుని ముద్దులాడె గిరికుమారి.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

  1. ఏకదంతుడౌచు నినుమడించిన దీప్తి
    ఘనత జూపి పిదప గణపతియయి
    ముదముగూర్చువాని మోహనాంగుని యాకొ
    మరుని గని ముద్దులాడె గిరికుమారి.

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా!
    నమస్కారములు.
    నా పూరణలో సమస్య పొరపాటున "మరునిగని ముద్దులాడె గిరికుమారి” అని టైపు చేయడం జరిగింది. దయచేసి సరిచేయగలరు.

    రిప్లయితొలగించండి
  3. అన్ని కార్యములకు ఆరంభమున చేయు
    ఆది పూజ ఘనమునందుకొనుచు
    అమ్మ వద్ద చేరి యల్లరి చేయు-కొ
    మరుని ముద్దులాడె గిరికుమారి.

    రిప్లయితొలగించండి
  4. నలుగు తోడ బొమ్మ నగజాత మలచెను,
    ప్రాణమిచ్చి తాను పరవశించె.
    చిన్ని వాడు తనదు సృష్టి యయిన నా కొ
    మరుని ముద్దులాడె గిరికుమారి.

    రిప్లయితొలగించండి
  5. తలచి నంత సుతుని నలుగుతో జేసెను
    తలను ద్రుంచి వేసె తండ్రి , కడకు
    కరి ముఖమ్ము బెట్టి గణనాథు జేయ కొ
    మరుని ముద్దులాడె గిరికుమారి.

    రిప్లయితొలగించండి
  6. సంహ రించె శివుడు సారుణ నేత్రు డై
    మరుని , ముద్దు లాడె గిరి కుమారి
    తనదు చిన్ని గణప తయ్యను మఱి యును
    గజము యొక్క ముఖము గలుగు వాని .

    రిప్లయితొలగించండి
  7. శివుని యంక మందు చిందులు వేయుచు
    చందమామను గని యందు కొనగ
    కొప్పు పట్టి లాగి కోరాడు కొంటె కొ
    మరుని ముద్దులాడె గిరికుమారి

    రిప్లయితొలగించండి

  8. విన్నపమ్మును విని విశ్వేశుడు కృపను
    మరల ప్రాణ మిచ్చి మనుపనీయ
    మరుని! ముద్దులాడె గిరికుమారి పతిని
    పట్టలేని ముదము పైకొనంగ.

    రిప్లయితొలగించండి
  9. తారకాసురునికి తథ్యము చావిక
    భవుని దివ్య తేజ ప్రాభవమున
    తనయు డుద్భ వించె నని సంతసాన కొ-
    మరుని ముద్దులాడె గిరికుమారి

    రిప్లయితొలగించండి
  10. పూని బాల గణపతి తమ్ముని కరమును
    తొండమున పెనవైచి గంతులిడి యాడ
    ప్రమథ గణములు తోడుతో పరుగు లిడ కొ
    మరుని ముద్దులాడె గిరికుమారి తానె

    రిప్లయితొలగించండి
  11. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    (ఇదే కదా మీ పూర్తి పేరు.. నేను మరిచిపోలేదు కదా!)
    బహుకాల దర్శనం. సంతోషం.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘మోహనాంగుని నా కొమరుని...’ అనండి.
    *
    మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    అన్నట్టు దేవి పేరుతో నిఘంటువు టైప్ చేసింది మీరే అని నాకు తెలుసు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ఆటవెలదిలో మొదటి పూరణ, తేటగీతిలో రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,
    శ్రీమతి లక్ష్మీదేవి గారికి
    నమస్కారములు!

    మీ ఇరువురి పేర్లను "తెలుగు నిఘంటువు" ప్రకాశన కార్యకర్తల పట్టికలో చూసి సంతోషాన్ని పొందాను.

    నా సందేహం: పాఠకులకు ఏదైనా ఒక గ్రంథం విషయమై అవసరమైనప్పుడు - ఉదాహరణకు - భైరవుని "రత్నపరీక్ష" నుంచి ("చాల పొరలున్న జర్జర సంజ్ఞ" వలె) ఏయే పదాలను సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రమాణంగా తీసుకొని ఉదాహరణలను ఇచ్చింది? అని తెలుసుకోవటానికి ఈ బ్లాగులో అవకాశం ఉన్నదా? "శోధించు"లో వెతికినప్పుడు అటువంటి అవకాశం కనిపించలేదు. మీరు ఏతన్నిర్మాతలతో మాటాడి అటువంటి అవకాశాన్ని కల్పిస్తే పరిశోధకులకు ఎంతో మేలవుతుంది.

    మీ ఉభయులతోనూ ప్రసంగింపవచ్చునని "శంకరాభరణం" ప్రస్థలిని వినియోగించుకొని అప్రస్తుతాన్ని ప్రసంగించినందుకు మన్నింప ప్రార్థన.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  13. గురువుగారూ ధన్యవాదాలు.

    మరొక సరదా పూరణ:

    (శంకరాభరణం చలన చిత్రంలో బాల తులసి నటన)

    శంకర శాస్త్రికి ప్రియముగ
    నంకమునం జేరి తల్లి యాశయమునకున్
    పొంకము గూర్చిన నీలో
    వంకలు లేనట్టి నటన పండెను తులసీ!

    ******************

    శంకరాభరణం బను చలన చిత్ర
    మందు శంకర శాస్త్రికి ననుగు శిష్య
    పాత్రలో నీవు జీవించి బాల తులసి!
    నటన పండించి నావులే నాడు నిజము.

    రిప్లయితొలగించండి




  14. వసుధరాధినాథు,వలచెను గిరికయు,
    నాశ తీర బెండ్లి యాడె దుదకు,
    సుందరాంగి పిదప శోభనమ్మున దన
    మరుని ముద్దులాడె గిరికుమారి.

    గిరికాదేవి కూడా కోలాహలగిరికుమారే కదా !

    రిప్లయితొలగించండి
  15. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ఆ అవకాశం ఉంది.
    ముందుగా ‘బహుళ శోధనము’ ఎంచుకోండి.
    తరువాత ‘బహుళ శోధన కంట్రోల్స్ కనిపించుటకొఱకు ఇక్కడ నొక్కండి’ అనేది కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చెయ్యండి.
    తరువాత ఒక పట్టిక కనిపిస్తుంది. అందులో మూడవది ‘కావ్యములోని పదములు’ అన్నదానికి ఎదురుగా బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే నిఘంటువు ఏయే గ్రంధాలను ప్రామాణికంగా స్వీకరించిందో పట్టిక వస్తుంది. ఆ పట్టికలోనుండి మనకు కావలసిన గ్రంధాన్ని ఎంచుకొని దాని ఎదురుగా ఉన్న ‘శోధన’ అన్న దాన్ని క్లిక్ చేస్తే ఆ గ్రంధంలోనుండి ఏయే పదాలు ఏయే అర్థాలతో గ్రహింపబడ్డాయో,. ఆయా ఉదాహరణ పద్యాలతో మీకు కనిపిస్తాయి.
    ఒకసారి ప్రయత్నించి సఫలమయ్యారో లేదో తెలియజేయండి.

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ,
    శంకరాభరణం బ్లాగులో శంకరాభరణం చిత్ర ప్రస్తావన! చాలా బాగుంది. మంచి పద్యాలు... ఇప్పుడా తులసి తల్లి పాత్రలు ధరిస్తున్నది.
    *
    కమనీయం గారూ,
    ఎప్పటి కోలాహల, శుక్తిమతుల కథ. నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. శ్రీభాష్యం విజయసారథిగారు వసుచరిత్ర పాఠం గుర్తుకొచ్చింది. ధన్యవాదాలు.
    చక్కని పూరణ. అభినందనలు.
    అన్నట్టు కోలాహలుడూ హిమవంతుని పుత్రుడే.

    రిప్లయితొలగించండి
  17. సంతులేని నగజ చింతించి పిండితో
    జేసె బాలు బొమ్మ బోసె నావి
    అమ్మ! యనుచు బాలుడంబను జేర కొ
    మరుని ముద్దాడె గిరి కుమారి.

    రిప్లయితొలగించండి
  18. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,

    మీరు నిర్దేశించిన విధాన ప్రయత్నించి ప్రయోగసాకల్యసూచిని గుర్తించాను. ఇది చాలా సహకారకమైన నూత్నవిధానం. ఇందుకు ఏతన్నిర్మాతలకు, మీకు మఱొక్కసారి అభినందనలు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  19. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. గణముల కధి పతిగ గణ నాధు నెంచిన
    కుశల బుద్ధి చేత కోరి గెలువ
    పూజ లందు కొనుచు ముదము గూర్చుకొ
    మరుని ముద్దు లాడె గిరి కుమారి

    రిప్లయితొలగించండి
  21. వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే|
    జగతః పితరౌ వన్దే, పార్వతీపరమేశ్వరౌ||
    ప్రథమ ప్రయత్నంగా నేను వ్రాసిన నిన్నటి నా పద్యాన్ని మెచ్చుకొంటూ ఆశీఃపూర్వక అభినందనలు తెలియచేసిన మాన్యులు, గౌరవనీయులు పండిత నేమాని గురువర్యులకు,
    శంకరాభరణ నిర్మాణ సారథులు శంకర గురువులకు,
    భారతీ స్వరూపులగు :
    లక్ష్మీదేవి గారికి,
    రాజేశ్వరి నేదునూరి గారికి,
    పుంభావ సరస్వతులగు :
    నాగరాజు రవీందర్ గారికి,
    గోలి హనుమచ్చాస్త్రి గారికి,
    సుబ్బా రావు గారికి,
    మిస్సన్న గారికి
    మా పెదనాన్న గారు టి. బి. ఎస్. శర్మ గారికి
    ధన్యవాద పూర్వక వందనములు తెలియచేసుకుంటున్నాను.
    తోపెల్ల శ్రీతేజ.

    రిప్లయితొలగించండి
  22. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    భస్మ మైన పతియె బ్రతుక రతీదేవి
    మరుని ముద్దులాడె; గిరికుమారి
    మరుని బ్రతుక జేయ హరుని కోరనపుడు
    వరము నిచ్చి బ్రోవ భర్గు డంత.

    రిప్లయితొలగించండి
  23. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం ‘ముదమును గూర్చు...’ అంటే సరి.
    *
    చి. తోపెల్ల శ్రీతేజా,
    పెద్దల యెడ గౌరవాన్ని ప్రదర్శించడం నీ వినయాన్ని తెలుపుతున్నది. ‘విద్య యొసగును వినయమ్ము’ అన్న మాటను వాస్తవం చేస్తున్నావు. సంతోషం.... స్వస్తి!
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. పరమ పూరుషుండు, ప్రజ్ఞాన విభవుండు.
    నందివాహనుండు సుందరుండు
    మరువిరోధి లోకగురుడైన రక్షితా
    మరుని ముద్దులాడె గిరికుమారి

    రిప్లయితొలగించండి