2, మార్చి 2013, శనివారం

సమస్యాపూరణం – 982 (ఆత్మహత్య పుణ్య మగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఆత్మహత్య  పుణ్య మగును  భువిని.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

16 కామెంట్‌లు:

 1. ప్రాగ్భవార్జిత పుణ్యఫలముగా నరజన్మ
  ....మెల్లవారలకు లభించుచుండు
  ప్రారబ్ధ కర్మము ననుభవింపవలెను
  ....దేహమ్మును ధరించి దేహి కాని (దేహి = ఆత్మ)
  దుర్భరమని కాని దుర్దశయని కాని
  ....జాతికైయని కాని సాహసమున
  ఆత్మహత్యకు బూను టనుచిత మగును నీ
  ....చాతినీచ ఫలమ్ము ప్రాప్తమగును
  ఆత్మ నేను కాదటంచును తలచుటే
  ఆత్మహత్యకు సమమగును కాదె?
  ఆత్మహత్య పుణ్యమగును భువి ననుట
  సత్యదూరమగును చాలు చాలు

  రిప్లయితొలగించండి
 2. పరహితమ్ము వలన ఫలమగు జన్మంబు
  పరుల కెగ్గు జేయు బ్రతుకు బ్రతుకె
  పాప భీతి లేక పరుల జంపుట కంటె
  నాత్మహత్య పుణ్య మగును భువిని

  రిప్లయితొలగించండి
 3. మీదు మిక్కిలి గను మిగుల పాప మగును
  ఆత్మ హత్య , పుణ్య మగును భువిని
  పేద వాని కెపుడు పెను సాయముం జేయ
  మానవునకు సేవ మఱువ బోకు

  రిప్లయితొలగించండి
 4. ఈనాటి సమస్య అన్ని పాపములలోకి ఘోరమైన పాపము ఆత్మహత్య. ఆత్మ-పరమాత్మ లమధ్య భేదము లేదన్నది శ్రీశంకరాచార్య ప్రబోధిత అద్వైత సిద్ధాంతము. కావున ఆత్మ హత్య చేయు తలపే భగవంతుని హత్య చేయు సంకల్పముగా భావించి ఆభావన ఏఒక్కరికి రాకూడదని ఆభగవంతుని ప్రార్థించుచున్నాను. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగు చున్న రాక్షస క్రీడ ఎంత బాధాకరము? సమస్యగానైన సరే ఒక చెడు ఆలోచన కలిగే విధముగా ఉండకుండ ఉంటే మంచిదని నా అభిప్రాయము. “ సమస్య ఇచ్చుట తప్పు కాదు గాని దీనిని అక్షర మార్పుచే గని పదవిచ్ఛేదముతో గాని సమసింపజేయుట కుదురుట లేదు. కేవలం భావనా పరముగా తప్ప.

  “ఆత్మ హత్య పుణ్య మగును భువిని” యన్న
  బ్రహ్మ సృష్ఠి చేయ ఫలిత మేమి?
  జగతి యందు జనులు చావగ శూన్యమే
  ఆత్మ హత్య గొప్ప అఘము గాదె?

  రిప్లయితొలగించండి
 5. కోడలైన తమదు కూతురిగానెంచి
  కష్ట పెట్ట కుండ నిష్ట పడుచు
  నత్త మామ నామె నాదరించగఁదప్పి
  యాత్మహత్య , పుణ్యమగును భువిని

  రిప్లయితొలగించండి
 6. అన్నిప్రాణులందు నదియుండు నేమది?
  పరులఁ జంపుటనెడు పాపమెద్ది?
  జీవ హింస నెపుడు చేయకుండుట గొప్ప-
  ఆత్మ; హత్య; పుణ్య మగును భువిని.

  శర్మ గారు,
  నిజం చెప్పినారండి.
  సమస్యా పూరణమను పేర కొన్ని సార్లు మరీ ఘోరమయిన మాటలు (ఆ అర్థం తప్పించి మనము వ్రాసినా సరే) పలికినట్లయి బాధ కలుగుతున్నది. ఒక్కొక్క సారి నేనూ పూరణ చేయకుండా ఊరుకున్న రోజులూ ఉంటున్నాయి.

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని వారూ,
  అధ్యత్మరామాయణ కర్తగా మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
  ఒక్క ఈ పూరణలోనే కాదు, గతంలోనూ ఎన్నో పూరణలలో, పద్యరచనలో ఆ వాసనలు తగులుతూనే ఉన్నాయి. మాకు లౌకిక, పారమార్థిక జ్ఞానభిక్ష పెడుతున్న గురుదేవులైన మీకు పాదాభివందనాలు.
  *
  గన్నవరపు నరసింహమూర్తి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  లక్ష్మీదేవి గారూ,
  మీ అభిప్రాయాలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.
  అయితే సమస్య అనగానే అది అబద్ధమో, అసమంజసమో అయి ఉంటుంది. దానిని సమర్థమూ, సర్వజనామోదమూ అయిన భావంతో పూరించి మెప్పు పొందవలసి ఉంటుంది. అశ్లీలార్థద్యోతకాలైన సమస్యలు గతంలో పెక్కు అవధానాలలో పృచ్ఛ చేయబడి అవి గ్రంధస్థాలై ఉన్నాయి కూడా. నేను వాటి జోలికి పోవడం లేదు.
  మిత్రులు ఉత్సాహంతో తాము సిద్ధం చేసి పంపుతున్న సమస్యలను సాధ్యమైనంత వరకు వడపోసి, వారిని నిరుత్సాహపరచకుండా ఇవ్వడం జరుగుతున్నది. గమనించవలసిందిగా మనవి.
  *
  తోపెల్ల వారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  క్రమాలంకారంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురువుగారికి,శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
  "అన్ని పాపములలోకి ఘోరమైన పాపము ఆత్మహత్య". కావున భువిని ఆత్మ హత్యలు,హత్యలు జరుగవలదని భగవంతుని ప్రార్థిస్తూ, నేటి యువకుల, యువతుల మదినున్న బావమును
  =======*=======
  ఆత్మ హత్య పుణ్య మగును భువిని, కట్న
  కానుకలకు భర్త కత్తి గట్ట ,
  భారమనుచు బిడ్డ పరదేశములు బోవ,
  కాళ్ళు కడిగితిమన కన్న వారు .

  రిప్లయితొలగించండి
 9. ========*=========
  ఆత్మ హత్య పుణ్య మగును భువిని కష్ట
  ములు వరుసగ నిలిచి బలుకరించ,
  చెలిమి జేసిన సఖి చేయి నిచ్చిన నాడు,
  పెట్టుబడి సకలము పొట్టు కాగ।

  రిప్లయితొలగించండి
 10. పెద్దరాష్ట్రమైన విద్యుత్తు పథకాలు
  మరచి రైతు నడ్డి విరచి నారె!
  ముందు చూపు తోటి మొదలెట్టినఁ దప్పి
  యాత్మహత్య , పుణ్యమగును భువిన

  రిప్లయితొలగించండి
 11. పిల్ల వాని జూడ ప్రేతాత్మయే పట్టి
  బాధ వెట్టుచుండ బాగు సేయ
  మంత్రగాని జేరి మాన్ప బాధలనట్టి
  'యాత్మ' హత్య పుణ్యమగును భువిని.

  రిప్లయితొలగించండి

 12. అన్న దాత రైతు లప్పుల బాధచే
  దిక్కు లేక చావ తెగువ చూపు
  చున్న వారి నాపు మన్న నీ వెట్లైన
  నాత్మహత్య, పుణ్యమగును భువిని

  రిప్లయితొలగించండి
 13. నాటి దినములందు నాథుడు మృతినొంద
  సంప్రదాయ మొకటి జరుగుచుండె
  “ఆత్మహత్య పుణ్య మగును భువిని" యని
  ఆలి దుముకు చుండె నగ్ని యందు

  ఎంత హేయ మైన దిట్టి యాచారమ్ము
  సతుల పాలిట నొక చరమగీతి
  దీని పేరు గద ! సతీ సహగమనమ్ము
  రామ మోహనుండు రద్దు చేసె

  రిప్లయితొలగించండి
 14. జీవ హింస జేసి జీవన్మృతు డగుట
  పాప కర్మ లందు పాపి యనగ
  మనుజ జన్మ మందు మానవత్వము లేక
  నాత్మ హత్య పుణ్య మగును భువిని !

  రిప్లయితొలగించండి
 15. చక్కని పూరణలు చెప్పిన ఇతర కవిమిత్రులు....
  వరప్రసాద్ గారికి,
  సహదేవుడు గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. ఆత్మహత్య పుణ్యమగును భువిని ఎట్టు
  లగును కర్మ ఫలమునంత పొందు
  నాడు గాదె జీవి ధన్యుడగును ధర
  నిట్టి వైపరీత్య మెందుకలదె !

  రిప్లయితొలగించండి