20, మార్చి 2013, బుధవారం

సమస్యాపూరణం – 1000 (వేయి సమస్యలు కవులకు)

కవిమిత్రులారా,
నమస్కృతులు.
"శంకరాభరణం" బ్లాగు వేయి సమస్యాపూరణలకు వేదిక అయింది.
దీనికి మీ అందరి భాగస్వామ్యమూ, సహకారం, సౌజన్యాలే మూలకారణాలు.
అందరికీ పేరుపేరునా అభినందలు, ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వేయి సమస్యలు కవులకు వేడుకఁ గూర్చెన్.

39 కామెంట్‌లు:

 1. గురువర్యులు శ్రీ శంకరార్యుల వారికి హృదయపూర్వక అభివందనములు. అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని రామజోగిసన్యాసి రావు గారికి ప్రణతులు. మిత్రులు కవి వర్యులందఱికీ, కవయిత్రులు సోదరీమణులకు అభినందనలు.

  రేయిం బవళ్ళు కాచుచు
  హాయిగ పూరింతు రిచట నాస్వాదింపన్
  సాయము బట్టగ గురువులు
  వేయి సమస్యలు కవులకు వేడుకఁ గూర్చెన్

  రిప్లయితొలగించండి
 2. శంకరాభరణ నిర్వహణాధురీణులు శ్రీ కంది శంకరయ్యగారికి కవిమిత్రులకు నమస్సులు.1000 సమస్యలు వెలయించిన ఎందరో కవిమిత్రులను సృష్ఠించు కొన్నశంకరాభణ బ్లాగుకు అభినందనలు.

  శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  రాయికి రాపిడినిచ్చుచు
  చేయగ కవికులముననొక ఛేదియనంగన్
  పూయగ కవితా సుమములు
  వేయి సమస్యలు కవులకు వేడుక గూర్చెన్.

  రిప్లయితొలగించండి
 3. మధురకందము:
  వేయి సమస్యలు కవులకు వేడుక గూర్చున్
  హాయిగ కైతల కవివరు లల్లుడటంచున్
  శ్రీయుత శంకర గురులిడ చిక్కని భాషన్
  చేయుడి సత్కృతి సుజనులు జేయని పల్కన్

  రిప్లయితొలగించండి
 4. తమ్ముడు చి.డా. నరసింహమూర్తి మరియు శ్రీ తోపెల్ల శర్మ గారు వ్రాసిన పద్యములు భావ గర్భితముగా నలరారుచున్నవి. అభినందనలు. శుభాశీస్సులు.

  రిప్లయితొలగించండి
 5. వ్యక్తి గత సమస్యలు ఎన్ని యున్నను ప్రతిరోజూ పలురకముల సమస్యల నిచ్చి మాలాటి ఔత్సాహిక కవులకు ఉత్సాహాన్నిచ్చి ప్రోత్స హించుచుచున్న " శ్రీ కంది శంకర గురువరేణ్యులకు "
  వేయి వందనములు.

  వేయి సమస్యలు దినమును
  వేయించుచు నుదయమునను వేడిగ మాకున్
  హాయిగ విందును గూర్చిరి
  వేయి సమస్యలును మీకు వెతలెన్నున్నన్.

  వేయి సమస్యల విందును
  వేయి సమస్యలును మీకు వెతలెన్నున్నన్
  చేయగ మాకాతిథ్యము
  వేయి సమస్యలు కవులకు వేడుక గూర్చెన్

  రిప్లయితొలగించండి
 6. వేయి దళమ్ముల విరిసిన
  తోయజమై కవి మనమ్ముఁ దోచగ, రచనన్
  ధ్యేయంబుగ నెంచ, నివే
  వేయి సమస్యలు కవులకు వేడుకఁ గూర్చెన్.

  రిప్లయితొలగించండి 7. వేయి దళముల సరోజము
  హాయిగ ఘ్రాణమును సేయు యలిపమ్ము లిటన్
  చేయగ హృత్పర్వము యీ
  వేయి సమస్యలు కవులకు వేడుక గూర్చెన్

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. వేయి సమస్యలను మాకందించిన శ్రీ శంకరయ్య గురువర్యులకు వినమ్ర వందనములు
  ఎందరో కవిమిత్రులను పామరులతో కలుపుచున్న శంకరాభణ బ్లాగుకు అభినందనలు. కలకాలము సాగిపోవాలిల అని భగవంతుని ప్రార్థిస్తూ
  =======*========
  హాయిగ పూరణలు జదివి నందరు భక్తిన్
  వ్రాయగ పద్యము,గురువులు వారికి జేయున్
  సాయము,పూయును సుమములు "శంకర"బ్లాగున్
  వేయి సమస్యలు కవులకు వేడుక గూర్చెన్
  "శంకర" =శంకరాభణం


  రిప్లయితొలగించండి
 10. శ్రీ కందుల వరప్రసాదు గారికి శుభాశీస్సులు.
  మీ మధురకందము చాల బాగుగ నున్నది. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి

 11. హాయిగ బూ రణ లాయెను
  వేయి సమస్యలు, కవులకు వేడుక గూర్చెన్
  శ్రేయులు శంకరు సేవలు
  వ్రాయించిరి కవుల జేత పద్యము లెన్నో .

  రిప్లయితొలగించండి
 12. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ పండిత నేమాని గురువర్యులకు వినమ్ర వందనములు
  అది హడావిడిలో (క్లాసుకు వెళ్లితిని ) వ్రాసిన పద్యము, గురువుగారు క్షమించాలి "శంకరాభణం"పేరు పూర్తిగా రాకుండెను.
  ============*=============
  మాన్యుల వేయి సమస్యలు కవులకు
  వేడుక గూర్చును విమల మతిని
  పూరణ జేయ నిస్సారపు పదముల
  తోడ సాయము జేయు తాండవమున
  పండిత వర్యులు నిండగు మనమున
  నభినందనలు దెల్పు నాదరమున
  కడు సమస్యల కడలి నందు జనులు
  శంకరార్యుల సమస్యలను గనును
  పండితుల వారి కొంగ్రొత్త పద్యములను
  గోలి వారు విసరు మందు గోళ ములను
  సత్కవులచె సంధించెడి సరిగమలను
  ముదము నొందగా రారండి ముందుగాను


  రిప్లయితొలగించండి
 13. శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి


 14. హాయిగ వేయి దినంబులు
  సోయగముగ గడచి పోయె సుజ్ఞాన నిధుల్
  చేయగ పూరణములు ఈ
  వేయి సమస్యలు కవులకువేడుకఁ గూర్చెన్

  రిప్లయితొలగించండి
 15. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. అ, ఆ , లు రాని నేను ఇందరి పాండితీ స్రష్టల మధ్య నా పేరుని చూసుకోగలగడం నా పూర్వ జన్మ సుకృతం. గురువులు శ్రీ పండితుల వారికీ , గురు తుల్యులు శ్రీ శంకరయ్య గారికి ,శిరసాభి వందనములు. నాకంటె చిన్న గనుక సోదరుని , వేవేల పూరణలు వ్రాయించి ఆయురారోగ్యములతో వేయేండ్లు సుఖముగా వర్ధిల్లా లని దీవించి . అక్క

  తోయజముల పూజించిన
  మాయము గానట్టి వెతలు మైమర పింపన్ !
  వ్రాయించగ గురు వర్యులు
  వేయి సమస్యలు కవులకు వేడుకఁ కూర్చెన్ 1

  రిప్లయితొలగించండి
 16. మాస్టారూ, శోభస్కరంగా అందరం కలిసి సహస్రం పూర్తిచేసుకొన్నాము. శతసహస్రం వైపు పయనిద్దాం. శుభమస్తు!
  ఆయుర్దాయము నిచ్చుత
  వేయుపడగ విభుడు మమ్ము వేడ్కగ కావన్
  శ్రీయుత శంకరు లిచ్చిన
  వేయి సమస్యలు కవులకు వేడుకఁ గూర్చెన్.

  రిప్లయితొలగించండి
 17. శ్రీయుతశంకరవర్యులు
  ధీయుతులీ బ్లాగు నడపు తీరును కనగా
  తీయని బహుపూరణలన్
  వేయి సమస్యలు కవులకు వేడుకఁ గూర్చెన్.

  రిప్లయితొలగించండి
 18. వేయి సమస్యలిచ్చి, తగ వేడ్కను పూరణ లంది, చేయగా
  వేయి నుతుల్ కవుల్, బుధులు, పెద్దలు పొంగక, పిన్న వారలున్
  వేయిగ వేయ ప్రశ్నలు వివేకము జూపుచు, సర్ది చెప్పుచున్
  వేయి విధాల శంకరులు పేరు గడించిన వైన మెన్నుదున్.

  రిప్లయితొలగించండి
 19. శంకరాచార్య మీ శంకరా భరణంబు
  సాహితీ ప్రియుల సుజ్ఞాన మాయె
  కవుల మేధా శక్తి గగన సీమకు పెంచ
  నరుదైన సోపాన మౌచు వెలిగె
  పండిత నేమాని ప్రథమ తాంభూలంబు
  పూరించు కవులకు స్ఫూర్తి నిచ్చె
  పలువిధ ప్రక్రియలు పరిచయమునుజేసి
  నవ పద్య రచనల నడక నేర్పె

  శంకరా భరణ మధిక సంప్రతీతి
  తోడ తలకొత్తు బుధులు సంతోష మొంద
  తెలుగు భాషామ తల్లికి తిలకమటుల
  నిండుగానుండు మా కవుల గుండెలోన.  రిప్లయితొలగించండి
 20. వేయి సమస్యల నీయగ
  వేయింటికి పూరణములు వెల్వడి విబుధుల్
  వేయి విధమ్ముల నెన్నిరి
  వేయి సమస్యలు కవులకు వేడుకఁ గూర్చెన్.

  రిప్లయితొలగించండి
 21. శీత కాలం వెళ్లి పోతోంది. మన తెలుగు వారు శీత కన్ను వేయడం మానేయాలి.

  రిప్లయితొలగించండి
 22. వేయి సమస్యలు పడగలు
  హాయగు మాపూరణముల హాహా మణులే
  ఓ యాదిశేష నిన్నే
  శ్రేయంబుగ మించు శంకరాభరణమ్మే.

  రిప్లయితొలగించండి

 23. వేయి సమస్యలు కవులకు వేడుకఁ గూర్చెన్
  ఇరవై వేల పై పూరణములు వేడుక గూర్చెన్
  వే వే ళా అవి మాకు శుభోదయ టీ కాఫీ ఆయెన్ !
  ఈ 'బ్రేకు' ఫాస్టు & ఈ-లోకపు చమక్కు ఆయెన్ !!

  శుభాకాంక్షల తో

  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 24. శంకరార్య ! మీ బ్లాగ్ వేయి పూరణలు పూర్తి చేసుకొన్న సందర్భంగా నా అభినందనలు. ఈ సందర్భంగా ఒక చిన్న కోరిక కోరుతున్నా, అనుమతించగలరు. అదేమిటంటే " అప్రస్తుత ప్రసంగం".

  రిప్లయితొలగించండి
 25. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  మధుర కందముః
  వేయి వెలుంగులు సతతము వెల్గెడి బ్లాగున్
  ఆయతి పండిత, గురువుల, వ్యంజిత మయ్యున్
  మోయగ పల్లకి కవులకు మోదము గూర్పన్
  వేయి సమస్యలు కవులకు వేడుక గూర్చెన్.

  రిప్లయితొలగించండి
 26. కవిశేఖరుల శ్లేష అర్థమయింది. "మిస్" అన్న మాట రాకూడదనే ప్రయత్నం. అయితే ఈ మధ్యన వేడి చేసి శీతాంశురసం కొంచెం పుచ్చుకొన్నాను, అంతే :-)

  రిప్లయితొలగించండి
 27. పూజ్యగురువరులకు, తోటి కవి మిత్రులకు కవితాకుసుమం
  సహస్రదళ పద్మమై వికసించిన వేళ శుభాభినందనలతో...
  అందుకు వేదికైన శంకరాభరణ నిర్మాత శ్రీ శంకరయ్య
  గురువుగారికి వినమ్ర నమస్కారాలతో..
  -------------------
  తీయని తెనుగున పద్యము
  వ్రాయుటనేర్పించినారు ఒజ్జలు మీరై
  శ్రేయము గురువరశ్రేణికి
  వేయి సమస్యలు కవులకు వేడుకఁ గూర్చెన్

  రిప్లయితొలగించండి
 28. “కలియుగ మంజరీ” గగ, నగ, భ,జ,స,ర.
  పై గణములలో 4 గణములు పాదమునకు ఉండవలెను.
  రెండు పాదాల ప్రాసము ఉండాలి.
  2 గణం తరువాత యతి (3వ గణాధ్యక్షరము)

  వేయి సమస్యాపూరణములకు స్థానమైన “శంకరాభణము” తెలుగు బ్లాగులకే తలమానికము ముఖ్యతః తగ్గిపోతున్న చందోబద్ధ కవిత్వమునకు. నాలాంటి నిరక్షరకుక్షులకు అక్షరములు నేర్పుచున్నదీ శంకరాభరణము. మాన్యశ్రీ కంది శంకరయ్య గారికి తెనుగు జాతి ఋణపడి ఉంటుంది.

  సహస్ర సమస్యల పరిస్కార సంపూర్తి సందర్భముగ చిన్న ప్రయత్నము

  “కలియుగ మంజరీ” గగ, నగ, భ,జ,స,ర.
  పై గణములలో 4 గణములు పాదమునకు ఉండవలెను.
  రెండు పాదాల ప్రాసము ఉండాలి.
  2 గణం తరువాత యతి (3వ గణాధ్యక్షరము)

  “కలియుగ మంజరీ”
  శంకరార్య బ్లాగు శంకరాభరణమై
  జంకులేకుండగ జంకకుండగాను

  పద్యముల్ వ్రాయగ పట్టుకొని తప్పు
  పద్యవిద్య నేర్పు పాఠశాల గాదె

  వేయి దినంబులు వేగంబుతోడ
  హాయిని గూర్చుచు నాటలాడ కవితల్

  నిత్యము నేమా నిశంక రార్యులు
  నత్యంతోత్సాహమిచ్చు చుండగ

  సహస్ర ప్రణతుల్ సరస్వతికిచ్చె
  సహస్ర కవితా చంపువుల్ ముదమునన్

  శంకరా! నిను నిశ్శంకగ గానకా
  వంక ప్రొద్దు పోదు పద్యము వ్రాయకన్.

  రిప్లయితొలగించండి
 29. కాయలు కాచెను కన్నులు
  సాయము లేదనుచు రచన సాగుట కొరకున్
  రా యని పిలిచెను నన్నీ
  వేయి సమస్యలు కవులకు వేడుక గూర్చెన్

  రిప్లయితొలగించండి


 30. శంకరార్యులకు,తోటి కవిమిత్రులకు ఈ సందర్భంగా సహస్రాభినందనలు.శ్రీ శంకరయ్య గారు నేనడిగిన అంశాలు రెండిటికి ఇంతవరకు స్పందించలేదు.1.ఏ రోజు సమస్యలని ఆరోజే కాక,మరుసటి రోజు సమీక్షిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది.2.వెయ్యి సమస్యలు,రెండు వందలు పైగా పద్యరచనలు అందరి సహకారంతో (పూరణలతో సహా ) పుస్తక రూపంలో ప్రచురిస్తే బాగింటుంది .ఏమంటారు ?

  రిప్లయితొలగించండి
 31. కవిమిత్రులకు నమస్కృతులు.
  వేయి సమస్యాపూరణల మైలురాయి దాటిన సందర్భంగా అభినందించిన, శుభాకాంక్షలు, ఆశీస్సులు పలుకుతూ పూరణలు చేసిన కవిమిత్రులు....
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  వరప్రసాద్ గారికి,
  సుబ్బారావు గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  ’మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
  శ్యామల రావు గారికి,
  మిస్సన్న గారికి,
  జిలేబీ గారికి,
  సాహిత్యాభిమాని గారికి,
  పింగళి శశిధర్ గారికి,
  డా. ప్రభల రామలక్ష్మి గారికి,
  డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
  కమనీయం గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  వరప్రసాద్ గారూ,
  "చదివి యందరు" అనండి.
  మీ సీసపద్యం నాల్గవ పాదం పూర్వార్ధంలో గణదోషం. "కఠిన సమస్యల కడలి యందు జనులు"
  విసరు - విసురు; సత్కవులచె సంధించెడి - సత్కవులచే సంధించు; రాయండి - వ్రాయండి.... అని నా సవరణలు.
  *
  గండూరి వారూ,
  సీసపద్యం నాలుగవ పాదం పూర్వార్ధంలో గణదోషం. ‘పలువిధ ప్రక్రియల్’ అన్నదానికి ‘పలువిధ ప్రక్రియలు’ టైపాటు అనుకుంటున్నాను.
  అలాగే తేటగీతి చివరి పాదంలో గణదోషం. "నిండుగా కవుల కుండును గుండెలోన" అందామా?
  *
  గోలి వారూ,
  మీ పద్యం చివరి పాదంలో యతి తప్పింది.
  *
  సాహిత్యాభిమాని గారూ,
  మీ సూచన గమనించాను. ధన్యవాదాలు. ఆ మధ్య ’అజ్ఞాత’లు కొందరు ఆ ముచ్చటా తీర్చారు. ఆ ప్రసంగాలు వ్యక్తిగత విమర్శలకు దారి తీయడం, కొందరికి మనస్సులు నొచ్చుకొనడం (ఒకరిద్దరు బ్లాగుకు దూరమవడం) జరిగింది. అందువల్ల ఆ శీర్షికకు ఇప్పట్లో అవకాశం లేదు. మన్నించండి.
  *
  పింగళి శశిధర్ గారూ,
  రెండవ పాదంలో యతి తప్పింది. ‘ఒజ్జలు’ అన్నచోట ‘పంతులు లేదా ప్రాజ్ఞులు’ అంటే సరి!
  *
  తోపెల్ల వారూ,
  మంచి ప్రయత్నం. మీ ‘కలియుగ మంజరి’ని గురించి చర్చించవలసి ఉంది. కాని సమయాభావం. తరువాత వీలుచూసుకొని తెలియజేస్తాను.
  *
  కమనీయం గారూ,
  మీ సూచనలకు ధన్యవాదాలు.
  1. రిటైరైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏదో ఒకటి చేసి ఎంతో కొంత డబ్బు సంపాదించవలసిన పరిస్థితి నాది. అందువల్ల ఉదయం బ్లాగులో సమస్యను, పద్యరచనా శీర్షికను పోస్ట్ చేసి ఆదరా బాదరా పనిమీద వెళ్ళిపోతున్నాను. రాత్రి వరకు బ్లాగు చూసే అవకాశాలు తక్కువ. రాత్రి బ్లాగు తెరిచే సమయానికి పూర్తిగా అలసి, ఉత్సాహం లేని పరిస్థితి. అందుకే మిత్రులను మాటమాటికి పరస్పర గుణదోషాల విమర్శ చేసికొనవలసిందిగా మనవి చేస్తూ వున్నాను. అప్పటికీ పండిత నేమాని వారూ, ఇతరు మిత్రులు ఆ కార్యభారాన్ని వహిస్తూనే వున్నారు.
  2. సమస్యాపూరణలను పుస్తకరూపంలో తెచ్చే ఆలోచన చాలా రోజులుగా ఉంది. కాని అది ప్రింటు రూపంలో కాదు. ఇ-బుక్ గా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాను. కాని సమయం, ఓపిక చిక్కక ఆలస్యమౌతున్నది.

  రిప్లయితొలగించండి
 32. ఆర్యా ! ధన్యవాదములు..
  సవరణ తో..

  వేయి సమస్యలు పడగలు
  హాయగు మాపూరణముల హాహా మణులే
  ఓ యాదిశేష పన్నగ
  రాయా నిన్ మించు శంకరాభరణమ్మే.

  రిప్లయితొలగించండి
 33. శ్రీ శంకరయ్య గారికినమస్కారం , ఈ బ్లాగు నిర్విరామంగా ,నిరాటంకంగా వేయిసమస్యా పూరణలను పూర్తిచేసుకొన్న ఈ శుభసందర్భాన మీకు, కవిమిత్రులకు సహస్రాభినందనలు. నాకూ ఈబ్లాగులో అవకాశమిచ్చిన మీకు ధన్యవాదాలు .

  హాయిని గూర్చెడు వెన్నెల
  రేయిన, కలువలు విరిసిన రీతిన్ మదిలో
  తీయని ఊహలుపూయగ
  వేయి సమస్యలు కవులకు వేడుక గూర్చెన్

  రిప్లయితొలగించండి
 34. శంకరార్యా,నేనడిగినవాటికి మీ సమాధానాలు సమంజసంగా,సంతృప్తికరం గా ఉన్నవి.నెనర్లు.మరల ఈ సంగతులు ప్రస్తావించను.

  రిప్లయితొలగించండి