17, మార్చి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 997 (మృత్పిండమె స్వర్ణ మగుచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మృత్పిండమె స్వర్ణ మగుచు మే లొనగూర్చున్.

27 కామెంట్‌లు:

 1. సత్పుత్రులు హాలికులై
  యుత్పాదన పెంచుటందు నుత్సాహముతో
  తత్పరత ధరణి మ్రొక్కిన
  మృత్పిండమె స్వర్ణ మగుచు మే లొనగూర్చున్.

  రిప్లయితొలగించండి
 2. సత్పు రుషులు భగ వంతుని
  తత్ప రతను గొలిచి నంత తధ్యము పుణ్యం !
  బుత్పత్తి యైన వరమగు
  మృత్పిండమె స్వర్ణ మగుచు మేలొన గూర్చున్ !

  రిప్లయితొలగించండి
 3. సత్పథచరుండు సేవా
  తత్పరుడగు సిద్ధయోగి ధర్మనిరతితో
  తత్పరము దలచి తాకిన
  మృత్పిండము స్వర్ణమగుచు మేలొనగూర్చున్

  రిప్లయితొలగించండి
 4. మృత్పిండము రైతులకే
  మృత్పిండము కుమ్మరులకు, మేదిని "ప్లాట్లే "
  సత్పథము నమ్ము వారికి
  మృత్పిండము స్వర్ణమగుచు మేలొనగూర్చున్.

  రిప్లయితొలగించండి

 5. సత్పురుషు డైన మనుజుడు
  సత్పథమున్నెంచు కొనుచు సవిమల బుద్ధిన్
  దత్పరత విత్తు నాటిన
  మృ త్పిండ మె స్వర్ణ మగుచు మేలొన గూ ర్చున్

  రిప్లయితొలగించండి
 6. మిత్రులందరి పూరణలు చక్కగా అలరించుచున్నవి. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. ఉత్పాటింపకు మ్రానుల
  నుత్పాతంబులను మాన్ప నుత్పాదిల్లున్
  సత్పథసేద్యము సలుప
  మృత్పిండము స్వర్ణమగుచు మేలొనగూర్చున్

  రిప్లయితొలగించండి
 8. ఉత్పత్తులు తగ్గగ వి
  ద్యుత్పత్తి కరువయి పడక తొలకరి వానల్
  సత్పథికుడు రైతు కెటుల
  మృత్పిండమె స్వర్ణ మగుచు మేలొన గూర్చున్?!

  రిప్లయితొలగించండి
 9. రవీందర్ గారూ ప్రస్తుతము జరుగుచున్న విషయముపై మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.
  విద్యుత్+ఉత్పత్తి= విద్యుదుత్పత్తి. విద్యుత్ శబ్దము గనుక ఒక సారి పరిశీలింప మనవి.

  రిప్లయితొలగించండి
 10. శర్మ గారూ ! మీ పరిష్కార సూచనకు ధన్యవాదములు. నా పద్యాన్ని యిలా మార్చు తున్నాను

  ఉత్పత్తులు తగ్గగ వి
  ద్యుత్పతనము తోడ పడక తొలకరి వానల్ -
  సత్పథికుడు రైతు కెటుల
  మృత్పిండమె స్వర్ణ మగుచు మేలొన గూర్చున్?!

  రిప్లయితొలగించండి
 11. ఈ త్పా ప్రాసను పద్యము
  సత్పురుషులె జేయగలరు శారద సేవా
  తత్పరత గల్గు వారికి
  మృత్పిండమె స్వర్ణ మగుచు మే లొనగూర్చున్.

  రిప్లయితొలగించండి
 12. అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. 3వ పాదములో 1 మాత్ర తక్కువగా నున్నది. చూడండి. స్వస్తి

  రిప్లయితొలగించండి
 13. శ్రీపండితులవారికి ధన్యవాదములతో సవరించుచూ

  ఉత్పాటింపకు మ్రానుల
  నుత్పాతంబులను మాన్ప నుత్పాదిల్లున్
  సత్పథసేద్యము సల్పగ
  మృత్పిండము స్వర్ణమగుచు మేలొనగూర్చున్

  రిప్లయితొలగించండి
 14. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  నూతన ఛందస్సుల గురించి మీ ప్రశంసను చూచేను. నూతన వృత్తములను సృజించుటలో నా ప్రమేయము ఏమియునూ లేదు. అన్ని పాదములలో సమానమైన గణముల క్రమమునుంచి వ్రాయగలిగితే చాలును అని మన ఛందశ్శాస్త్రమే పేర్కొను చున్నది. మన కవి మిత్రులందరూ మంచి ఉత్సాహము మీద నున్న వారే అనుటకు ప్రమాణము వేరుగా నక్కరలేదు. ఇప్పటికే పలు రకముల ఛందస్సులలో వారు అలవోకగా వ్రాయగలుగు చున్నారు. ఉత్సాహలు, మధ్యాక్కరలు మొ.వి. ఈ మధ్య మన బ్లాగులో విరివిగా కనిపించుచున్నవి కదా - అందుచేత అందరికీ మరొక్క మారు అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. ఆగమశాస్త్రానుసారము ఈశ్వరుడు తనకు చెప్పినట్లు పార్వతీ దేవి అంటున్నట్లుగా.... ( వినాయకవ్రతము ).....

  ఉత్పతన వారణమునకు
  మత్పతిసెలవిచ్చినట్టి మార్గంబిదియే
  సత్ఫల మొసఁగు వినాయక
  మృత్పిండమె స్వర్ణమగుచు మేలొనగూర్చున్.

  స్వర్ణ = శుభప్రద అనే అర్థములో......

  రిప్లయితొలగించండి
 16. మిస్సన్న గారూ ! మీతోపాటు మమ్మల్నీ సత్పురుషుల్లో చేర్చారు ... ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 17. ఉత్పలములు మెండు దెచ్చి
  సత్పదముల మ్రోల నుంచి సద్భక్తి మదిన్ !
  ఉత్పాతములు తొలగి
  మృత్పిండమె స్వర్ణ మగుచు మేలొన గూర్చున్ !

  రిప్లయితొలగించండి
 18. ఉత్పలములు మెండు దెచ్చి
  సత్పదముల మ్రోల నుంచి సద్భక్తి మదిన్ !
  ఉత్పాతములు తొలగి
  మృత్పిండమె స్వర్ణ మగుచు మేలొన గూర్చున్ !

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులకు నమస్కృతులు.
  దుష్కర ప్రాసతో సమస్యనిచ్చినా తడబడకుండా ఒకరిని మించి ఒకరుగా ప్రశస్తమైన పూరణలు చెప్పి మెప్పించారు.
  గన్నవరపు నరసింహమూర్తి గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  మిస్సన్న గారూ,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  సుబ్బారావు గారూ,
  ’సత్పథమున్ + ఎంచుకొనిన’ అన్నప్పుడు ద్విత్వము వచ్చుట కొందరు ఇష్టపడరు. అక్కడ ‘సత్పథముల నెంచుకొనిన/ సత్పథమునె యెంచుకొనిన’ అందాం.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీరు వేసిన ప-ఫ ప్రాస లక్షణ సమ్మతం కాదు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండో పూరణ మూడవ పాదంలో గణదోషం.
  ’ఉత్పాతమ్ములు తొలగును’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 20. సత్పురుషుల సేవించుచు
  సత్పథముల ననుసరిస్తు సత్కార్యములున్
  సాత్పూజల నొనరించిన
  మృ త్పిండమె స్వర్ణ మగుచు మేలొనరించున్.

  రిప్లయితొలగించండి
 21. సుబ్బారావుగారూ!నమస్తే. టైపాటున స కు దీర్ఘం పడినది. అది సత్పూజల గాచూడదగును. అయితే అనుసరిస్తు అన్నది వ్యావహారికమగునని అనుకొనుచున్నాను. పెద్దలు చెప్పాలి.

  రిప్లయితొలగించండి

 22. సత్పురుషులు బహుదీక్షా
  తత్పరతను జేసినట్టి ధర్మాచరణం
  బుత్పాతరహిత ఫలమగు
  మృత్పిండమె స్వర్ణమగుచు మేలొనగూర్చున్.

  రిప్లయితొలగించండి
 23. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘అనుసరిస్తు’ అనే వ్యావహారిక పదానికి బదులుగా ‘అనుసరించి’ అనండి.
  *
  కమనీయం గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. ఉత్పలములు చంపకములు
  సత్పురుషులు వ్రాయగలరు; శార్దూ లముల
  న్నుత్పత్తి నేను జేయగ...
  మృత్పిండమె స్వర్ణ మగుచు మే లొనగూర్చున్

  రిప్లయితొలగించండి