8, మార్చి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 988 (బుద్ధి నిడని గురుఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బుద్ధి నిడని గురుఁడె పూజ్యుఁ డగును.
ఈ సమస్యకు మంద పీతాంబర్ గారి 'సరదాకి చిరుకవిత' ఆధారం. వారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

 1. విపుల వేద విద్య విజ్ఞాన శాస్త్రముల్
  ప్రజ్ఞ పరిఢవిల్ల ప్రతిభఁ గఱపి
  షట్క వర్గ శరధిఁ జాపల్యమున దేలు
  బుద్ధి నిడని గురుఁడె పూజ్యుఁ డగును.

  రిప్లయితొలగించండి
 2. తమ్ముడు చి. డా. నరసింహ మూర్తి పూరణ జ్ఞానస్ఫోరకముగా నున్నది. శుభాశీస్సులు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. ఉద్ధరించువాడె యొజ్జ శిష్యునికి తా
  బుద్ధి గఱపి మందబుద్ధి వీడ
  విద్య బోధ జేసి విద్యార్థులకు పెడ
  బుద్ధి నిడని గురుడె పూజ్యు డగును

  రిప్లయితొలగించండి
 4. సత్య ధర్మ విధుల చక్కగా నేర్పుచు
  బ్రహ్మ విద్య గరపు పరమ గురుడు
  అధిక లాభదముల నక్రమ గతుల దుర్
  బుద్ధి నిడని గురుడె పూజ్యుడగును

  రిప్లయితొలగించండి
 5. గన్నవరపు నరసింహమూర్తి గారూ,
  ఈనాటి ప్రథమ తాంబూలమే కాదు, పూరణలో అగ్ర తాంబూలమూ మీదే. నేమాని వారి ప్రశంసను పొందిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. నిరత మరయ యవని నింద్యు డగును గద
  బుధ్ధి నిడని గురుడె , పూజ్యు డగును
  శిష్యు జేర దీసి శిష్ఠ గు ణంబులు
  బోధ సేయ గురుడు భువిని మిగుల .

  రిప్లయితొలగించండి
 7. అస్త్ర శస్త్ర విద్య లనురాగమున నేర్పి
  క్రతువుఁ గాయఁ బనిచె గాధి సుతుఁడు
  రామలక్ష్మణులను రంజిల్ల తద్గ్రోధ
  బుధ్ధి నిడని గురుఁడె పూజ్యుఁడగును

  రిప్లయితొలగించండి
 8. సుబ్బారావు గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  "అరయ నవని", "శిష్టగుణంబులు" అనవలసింది.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
  "తత్ + క్రోధ" అన్నప్పుడు జస్త్వసంధి రాదు కదా.. "తత్క్రోధ" అంటే సరి!

  రిప్లయితొలగించండి
 9. భావ మందుఁ దల్చి పల్కులందున బల్కి
  చేత లందు వాటిఁ జేయు నటుల
  త్రికరణంపు శుద్ది తెలియబరచి వక్ర
  బుద్ధి నిడని గురుడె పూజ్యుడగును

  రిప్లయితొలగించండి
 10. గురువు శ్రీ శంకరయ్య గారికి నమస్కారములతో ,

  ప్రజలసుఖముగోరు ప్రభువుదైవమగును
  భుక్తినొసగురైతు పుణ్యుడగును
  పాడుపనులజేసికీడొనర్చెడు వక్ర
  బుద్ధి నిడని గురుడె పూజ్యుడగును

  రిప్లయితొలగించండి
 11. విద్య నేర్పు గురువు విజ్ఞాన వం తుడు
  పంచు ప్రేమ తోడ మంచి విద్య
  కాసులు గడియింప గడ్డి మేయుమను దు
  ర్బుద్ధి నిడని గురుఁడె పూజ్యుఁ డగును.

  రిప్లయితొలగించండి
 12. ఉత్సుకతన వత్స యొక్క డుత్స హించి నేర్వగా
  వత్సరముల పాటు శాస్త్ర వర్త నంబు లెల్ల నే
  మత్సరంబు సోక కుండ మహిని మెలగు రీతినే
  కుత్సితమగు” బుద్ధి నిడని గురుడె పూజ్యుడగును”గా!.

  రిప్లయితొలగించండి
 13. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  ఆటవెలదిని "ఉత్సాహం"తో ఆటాడించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. ఆటపాటలందు మునిగి ఆశయమ్ములేకనే
  తోటలందు తిరుగు బాలుతోటి పల్కెగురువు "నా
  బాటలోకి అడుగులిడుము బాగుపడుదువ"న్న ఆ
  కుటిలపు పెడ”బుద్ధి నిడని గురుడె పూజ్యుడగును”గా!.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి ధన్యవాదములు
  =======*========
  యుద్ద విద్య నెల్ల హద్దులు లేకనే
  పద్దతిగను నేర్పు పండితుడును
  యుద్దము వలదనెడి యువతకెల్లను దుష్ట
  బుద్ది నిడని గురుడె పుజ్యు డగును

  రిప్లయితొలగించండి
 16. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
  "బాలు తోటి" అన్నదానిని "బాలుఁ జూచి" అంటే బాగుంటుందని నా సలహా.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. శంకరార్యులకు వందనములు,
  నాదొక చిన్న సందేహం. " తో ", " జూ " లకు యతి కుదరదేమోనని. సందేహ నివారణ చేయగలరు.
  ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 18. తల్లి దండ్రి పిదప పిల్లల కే నాడు
  మార్గ దర్శి తాను మంచి తెలిపి
  దురల వాట్లు లేక తోడుండి మరి వక్ర
  బుద్ధి నిడని గురుడె పూజ్యు డగును

  రిప్లయితొలగించండి
 19. నిజమే నండి గురువు గారూ, జశ్త్వ సంధి సూత్రము ;

  పరుషములకు అచ్చులు గాని, సరళములు గాని , య వ ర లు గాని పరమైనచో సరళము లాదేశ మగును.

  ఉ : వాక్ + ఈశ = వాగీశ

  అచ్ + అంతము = అజంతము

  భగవత్ + భక్తి = భగవద్భక్తి

  చిత్ + రూపము = చిద్రూపము

  తత్ + క్రోధము ఇక్కడ పరుషమునకు పరుషమే పరమయింది కాభట్టి జశ్త్వసంధి లేదు. ప్రయత్నించా నంతే !

  రిప్లయితొలగించండి
 20. రామలక్ష్మి గారూ,
  నిజమే. యతిస్థానాన్ని నేను గమనించలేదు. మన్నించండి.
  తోటి.. సాధుప్రయోగం కాదు. బాలుతోడ అనండి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ’దురలవాట్లు’ ప్రయోగం సాధువు కాదు.

  రిప్లయితొలగించండి
 21. శంకరార్యులకు వందనములు,
  ఆటపాటలందు మునిగి ఆశయమ్ములేకనే
  తోటలందు తిరుగు బాలుతోడ పల్కెగురువు "నా
  బాటలోకి అడుగులిడుము బాగుపడుదువ"న్న ఆ
  కుటిలపు పెడ”బుద్ధి నిడని గురుడె పూజ్యుడగును”గా!
  ధన్యవాదములు.
  TBS Sarma garu,
  ఉ'త్సా'హ రచన ఎడల మీ ఉత్సాహం అభినందనీయం.

  రిప్లయితొలగించండి