12, మార్చి 2013, మంగళవారం

పద్య రచన – 278 (త్రిజటా స్వప్నము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"త్రిజటా స్వప్నము"

13 కామెంట్‌లు:

  1. త్రిజటా స్వప్న వృత్తాంతము (మా అధ్యాత్మ రామాయణము నుండి)

    లంకా పట్టణములో - అశోక వనములో - శింశుపా వృక్షము నీడలో సీత కలదు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా ఉంటున్నారు. వారు సీతను భయపెట్టుచూ ఆమెపై ఒత్తిడి తెచ్చుచున్నారు - అట్టి పరిస్థితులలో త్రిజట (విభీషణుని కుమార్తె) అక్కడి రాక్షస స్త్రీలతో తన స్వప్న వృత్తాంతమును ఈ విధముగా తెలిపెను:

    వనితారత్నములార! చోద్యమగు స్వప్నంబొండు నే గాంచితిన్
    మనమారన్ వినిపింతు సత్యములగున్ నా స్వప్నముల్ సర్వదా
    జనకేశాత్మజయైన యీ సుముఖియే సాక్షాద్రమాదేవి కా
    వున నే దుష్కృతమైన పూన వలదీ పూబోడి పై నెన్నడున్

    రాజీవ నేత్రుడౌ రాముడు సహజుతో
    ....నైరావతము నెక్కి యరుగుదెంచి
    లంకాపురిని గాల్చి రావణాసురు గూల్చి
    ....సీతతో గిరిపైని చేరినట్లు
    దశకంఠు డొడలికి తైలంపు బూతతో
    ....బట్టలు విడనాడి పట్టణమున
    పుత్ర పౌత్రుల గూడి పుర్రెల చేబూని
    ....కొలనిలో దిగినట్లు గోచరించె
    వినయమున రాముజేరె విభీషణుండు
    కనుడు రావణ వంశ నాశనమొనర్చి
    రాముడు విభీషణునకు నీ రాజ్యమునిడి
    సీతతో తన నగరికిన్ జేరగలడు

    త్రిజట మాటలు వినినట్టి స్త్రీలు మనము
    లందు మిక్కిలి భయమొంది యవనిజాత
    యందుదాసీనలై వ్రాలి యందు నందు
    చింతనల మాని నిద్దుర జెంది రంత

    రిప్లయితొలగించండి
  2. త్రిజట యనునామె రాక్షస స్త్రీ ల తోడ
    వినుడు మీ రలు నొకమాట వీ ను లలర
    (కల ను గంటిని రాతిరి కమ్మ గాను )
    రాముడిప్పుడ యేతెంచి రావణా సు
    ర యసువుల బాపి గొంపోవ రయము వచ్చు .


    రిప్లయితొలగించండి
  3. రామ చంద్రుండు వచ్చు కలలిక గంటి
    ననుచు విలపించు తల్లికి యాశ జూపి
    త్రిజట చేకూర్చ ధైర్యము తెప్పఱిల్లె
    సీత,పెనుమూక బెదిరింపు చేయునపుడు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గారికి, శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు

    ఓ సితా మా మాట వినక పోతివా నిన్ను ముక్కలు జేసి తినెదము అన్న రాక్షస స్ర్తీ లతో త్రిజట తన స్వప్న వృత్తాంతము
    =======*=======
    కలగంటి గత రాత్రి పూట కలనందు లంకా నగరము
    జలమునందు మునుగు చుండె,జలచరములు రాక్షసులను
    బలువిధముల దినుచుండె, భయ భీతులైన రాక్షసులు
    కులదేవతకు మ్రొక్కు చుండె,కుజను వీడు కుజము గ్రింద
    (కుజను= సీతను, కుజము= చెట్టు )

    రామభక్తుల నేకులు మన లంకా పురిని జేర, ముందు
    రామ చంద్రుడు సీత భర్త లంకేశ్వరుని జంపె, మాత
    కై మన లంకా పురమున గపివరుండు దిరుగు చుండ
    చీమల వలె జచ్చు చుండె, జిక్కు రాక్షస వీరు లెల్ల

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    రామాయణంలో అత్యంత ప్రాధాన్యతను పొందింది త్రిజటా స్వప్న వృత్తాంతం. మీ అధ్యాత్మ రామాయణంలో ఇంతకు ముందే చదివి ఆనందించిన ఘట్టాన్ని గుర్తు చేసారు. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    "మీరంద రొకమాట" అనండి బాగుంటుంది.
    "రావణా సు/ర యసువుల బాపి" అన్నది
    "రావణా సు/రుని వధించి సీతను గొని వెనుదిరుగును" అందాం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    "కలయందు" అనండి.

    రిప్లయితొలగించండి
  6. ఆకాశ గమనంబు హంస సహస్రంబు,
    .................................గజదంత మయమైన కలికి పల్ల
    కీలోనఁ దెల్లని మాలికల్ చేలముల్,
    .................................దాల్చి సుమిత్రాగ్ర తనయుతోడ
    రామచంద్రుఁడు వచ్చె రమణీయ శుక్లాంబ,
    .................................రావృత యగుచు నీ దేవి పాల
    వెల్లి లోపల నున్న వెల్లని గట్టుపై,
    ................................భానునితోఁ బ్రభ పరఁగునట్లు
    రామచంద్రుతోడ రంజిల్లఁ గంటిని
    ధరముఁబోలి నాల్గు దంతములను
    మీఱుచున్న గజము మీద సలక్ష్మణుఁ
    గౌసలేయు నరుఁ గంటిఁ గలను

    రిప్లయితొలగించండి
  7. TBS Sarma garu,

    ఈ తెలుగు పద్యము శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు రచించిన శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం నుండి సేకరింపబడింది. కవి మిత్రులు ఆశ్వాదింతురు గాక!

    రిప్లయితొలగించండి
  8. సాహిత్యాభిమాని గారూ,
    ధన్యవాదాలు.
    చివరి పాదంలో ఒక అక్షరం తప్పిపోయింది.
    అది....
    గౌసలేయుని నరుఁ గంటిఁ గలను
    లేదా...
    గౌసలేయు నరునిఁ గంటిఁ గలను
    .... అయి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ పండిత నేమాని వారికి, శ్రీ శంకరార్యులకు నమస్సులతో చిన్న ప్రయత్నము

    త్రిజగాధిపతికి సతియె సీత యనుచు
    త్రిజట యట శుభ రాతిరిగన్న కలలు

    కడుభయ మొప్ప రక్కస కాంతలు విన
    నుడువుచు శ్రీరామ నుతిచేయు చుండె

    కువలాయికసహస్ర కూర్పున మెరయు
    ధవళకాంతుల జీవదంత పల్లకిని

    దశరథ తనయులు ధర్మమూర్తులన
    దశకంఠు లంకనంతర్భవించుదరు

    శ్వేతనగాగ్రాన సీత వసించి
    ఆ తపనాంశుని,యజతుని తాకె.

    సైత్యచతుర్దంత శైలాటమెక్కి
    సత్యుని యొడినుండె జానకి యంత

    మైథిలీ రామలక్ష్మణుల నులచె
    నాధిక్యతన కరి యా లంక పైన

    ఒదవెను పుష్పకంబుత్తర దిశకు
    ముదమంది పయనించె పుడమి వదలుచు

    రావణుండంతట రహిచెడి పడెను
    రావము బెట్టుచు రక్తసిక్తుడయి

    సాగరావృత లంక సంద్రాన కలసె
    రేగామినులు పిచ్చి రేగి తిరుగగ

    చూచితి; సీతను చూచుచు క్షమను
    యాచించుడిట మీర లహమును వీడి.

    రిప్లయితొలగించండి





  10. సీతాదేవి తో త్రిజట ఇలా చెప్తున్నది.

    '' లంకాపట్టణమెల్ల ధ్వంసమగు,,బ్రోలన్ దిర్గు ప్రేతమ్ములున్,
    లంకేశుండును మృత్యుఘాతమున నేలన్ వ్రాలు శ్రీరాముచే
    నింకన్ దుశ్శకునాలు కన్ పడె నవెన్నెన్నో భయోత్పాతముల్,
    శంకన్ వీడుము జానకీ,వినుమ నా స్వప్నమ్మునన్ గాంచితిన్. ''

    రిప్లయితొలగించండి
  11. శ్రీ తోపెల్ల శర్మ గారికి శుభాశీస్సులు.
    త్రిజటా స్వప్నము గురించి మీ మధ్యాక్కరలను చదివేను. బాగుగ నున్నవి. కొన్ని సవరణలు కావలెను:

    1. శుభ రాతిరి
    2. సహస్ర కూర్పు
    మొదలగునవి.

    మైథిలీ రామ ... .. అని మొదలిడిన పాదములో ఒక లఘువు తక్కువగా నున్నది.
    అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. త్రిజట తనతోటి రాక్షస కాంతలతో....
    స.కా॥
    కలయని దెల్సి యొక మారు గిల్లి గాంచితి సత్యం
    బిల మన రావణు వధించి సీతఁ వేడుక తోడన్
    బిలుచుకు పోవు రఘు రాముడే విభీషణు లంకా
    నిలయఁపు రాజుగను జేయు మాట నిక్కము నుర్విన్!
    (గురువు గారూ పరిశీలించ ప్రార్థన)

    రిప్లయితొలగించండి