10, మార్చి 2013, ఆదివారం

శ్రీ శివ స్తుతి (దండకము)


 శ్రీమన్మహాదేవ! శంభో మహాదేవ! శంభో మహాదేవ! దేవా! దయాపూర్ణభావా! నగేంద్రాత్మజా హృన్నివాసా! మహా దివ్య కైలాసవాసా! సదానంద! విశ్వేశ్వరా! సర్వలోకేశ్వరా! సర్వయోగేశ్వరా! సర్వభూతేశ్వరా! నందివాహా! భుజంగేశభూషా! త్రిశూలాయుధా! చంద్రచూడాన్వితా! పంచవక్త్రా! జటాజూట సంస్థాభ్రగంగాపగా! దేవదేవా! మహా భక్తి భావంబుతో నీదు తత్త్వంబు ధ్యానింతు నీశా!
సహస్రార్కకోటి ప్రభా భాసురంబై  యనాద్యంత వైశిష్ట్యమున్ బొల్చు లింగాకృతిన్ దాల్చి లోకంబులన్నింట వ్యాపించి యున్నట్టి నీ దివ్య తత్త్వంబు లోకైక రక్షాకరంబై  మహానందధామంబునై జ్ఞానసారంబునై సర్వదా శాంతమై వేదసంస్తుత్యమై యోగి సంసేవ్యమై యొప్పు నో దేవ!దేవా! అచింత్యప్రభావా!
సురల్ రాక్షసుల్ గూడి క్షీరాంబుధిన్ ద్రచ్చుచుండంగ నందుండి ఘోరాగ్ని కీలాన్వితంబైన హాలాహలాభీల మొక్కుమ్మడిన్ బుట్టి లోకంబులన్నింట వ్యాపించుచున్ ఘోర నాశంబు గావించుచుండంగ నా యాపదన్ బాపి లోకంబులన్నింటికిన్ రక్షవై నీవె యా ఘోర కాకోల హాలాహలంబంతయున్ నీదు కంఠంబునన్ నిల్పుకొన్నాడవో దేవదేవా!  త్రిలోకైక రక్షాకరా! దుఃఖనాశంకరా! శంకరా! 
ఆదిదేవుండవై, జ్ఞానసారంబవై, భద్రరూపుండవై, కాలకాలుండవై, త్రాతవై, నేతవై, దేశికస్వామివై, దక్షిణామూర్తివై, యొప్పు సర్వజ్ఞ! సర్వేశ! సత్యప్రకాశా! చిదాకార! నీ తత్త్వ వైశిష్ట్యమున్ నేను ధ్యానించెదన్ నీదు పాదమ్ములన్ గొల్చెదన్, నిన్ను కీర్తించుచున్ నీదు సేవానురక్తుండనై జన్మవారాశినిం దాటి యానంద సాంద్రాకృతిన్ గాంతు నో దేవదేవా! మహాదేవ శంభో! మహాదేవ శంభో! మహాదేవ శంభో! నమస్తే నమస్తే నమః  

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

8 కామెంట్‌లు:

  1. శివరాత్రి రోజు శివ దండక పఠన భాగ్యమును ప్రసాదించిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. శివ రాత్రి శుభా కాం క్షలు
    శివ శివ యని బలుక మీ రు సేమము గలుగున్
    శివునే మది ధ్యానిం చుడు
    శివ రూపుడ ! రామ జోగి ! సేతును నతులన్ .

    రిప్లయితొలగించండి

  3. శివరాత్రి పర్వ దినమున శివ దండకమును ప్రసాదించిన శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. నేమాని పండితార్యా! ధన్యులము. శివ కటాక్షమును మాపై కురిపింప జేశారు.

    రిప్లయితొలగించండి
  5. శంకరాభరణ బ్లాగాభరణులైన శ్రీనేమాని పండితార్యులు మహాశివరాత్రి పర్వదినాన సమర్పించిన శివస్తుతి “దండకము” పండితమ్మన్యుల ప్రశంసాంచితమైనది. చదువగనే నా హృదయస్పందన.

    పండెను దెందము నిండగ
    దండక మందున కపర్ది తాండవ ప్రియునిన్
    పండుగయౌ శివరాత్రికి
    “పండిత” పద్యసుమ దండ పఠియింపగనే.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సుబ్బారావు గారూ,
    వరప్రసాద్ గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మిస్సన్న గారూ,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. మిత్రులారా!
    శుభాశీస్సులు.
    మహాశివరాత్రి పర్వము సందర్భముగా పరమశివుడు అనుగ్రహించిన దండకమును మీ ముందు నుంచితిని. ఇందులో నా ప్రతిభ ఏమియును లేదు. మీ అందరు చదువుకొని సంతోషించి నందులకు చాలా ఆనందముగా నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి