11, మార్చి 2013, సోమవారం

సమస్యాపూరణం – 991 (ఓడిపోవుట వీరునకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఓడిపోవుట వీరున కొక వరంబు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. తనదు విద్యలు సుతునకు ధార వోసి
    ప్రజ్ఞ జూచుట కొకనాడు పందెమొడ్డి
    జూడ తనయుండు గెలిచె నాజోదు చేత
    నోడిపోవుట వీరున కొక వరంబు.

    రిప్లయితొలగించండి
  2. ద్వంద్వ యుద్ధాన ప్రత్యర్థి తనదు నెదుట
    నోడిపోవుట వీరున కొక వరంబు
    పదము పదమున విక్రమప్రభలు మెరయ
    సుకరముగ జయమొందుట యొక వరమ్ము

    రిప్లయితొలగించండి
  3. శాస్త్రి గారూ! ఎంతటీ వానికైనా సుతుని చేత ఓడింపబడుట గర్వకారణమేగదా!. చాల అందంగా పూరించారు. మిక్కిలి అభినందనలు౤

    రిప్లయితొలగించండి
  4. శ్రీపండిత గురువులకు నమస్సులు. ఓడిపొవుటనే గెలుపుగా మలచి చెప్పుట అద్భుతము. మీసద్యస్పురణకు జోహార్లు.

    రిప్లయితొలగించండి
  5. అస్త్ర శస్త్రాది విద్యల నారి తేరి
    మూడు లోకములందున లేడు సాటి
    యన్న దశకంఠుడు దశరథాత్మజునికి
    ఓడిపోవుట వీరుని కొక వరంబు.

    రిప్లయితొలగించండి
  6. తండ్రి యానతి విష్ణుని దర్శనంబు
    కలుగ జేసిన ప్రహ్లాదు డెలమి ఘనుడు
    అతని మూలాన యా తండ్రి హత మయ్యి
    ఓడి పోవుట వీ రున కొక వరంబు

    రిప్లయితొలగించండి
  7. దైవమును తూలనాడెడు దానవుడుగఁ
    బుట్టి శత్రువై, రణమందు పోరుచుండ,
    శాపము విమోచనమ్మగు సమయమందు
    నోడిపోవుట వీరున కొక వరంబు.

    రిప్లయితొలగించండి
  8. చక్రి శాపమ్ము మేరకు జయ విజయులు
    దైత్యులై బుట్టి హరి తోడ దగవు బెంచి
    పోరి శాప విముక్తులై చేరి రజుని
    ఓడి పోవుట వీరుని కోక వరంబు

    రిప్లయితొలగించండి
  9. సాము గరిడీల బరియందు శస్త్రవిద్య
    లందు గెలువంగ వచ్చుబో యందమైన
    రమణి యలుకదీర్చను ప్రియరాలి యెదుట
    ఓడిపోవుట వీరున కొక వరంబు!

    రిప్లయితొలగించండి
  10. జయ విజయులకు శాపమిచ్చినది భ్రుగుమహర్షి కదా అందుకే మార్చాను

    జటిలు శాపమ్ము మేరకు జయ విజయులు
    దైత్యులై బుట్టి హరి తోడ దగవు బెంచి
    పోరి శాప విముక్తులై చేరి రజుని
    ఓడి పోవుట వీరుని కోక వరంబు

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గారికి, శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు
    =======*=======
    వాలి సుగ్రీవు లందున వాలి యెవరు ?
    వాని దమ్ముడెవరుయన? వానర తతి
    రాముని బలుకు విని,బల్కె రణము నందు
    నోడి పోవుట వీరునకొక వరంబు।

    రిప్లయితొలగించండి
  12. వీరుడైనట్టి గురువు తా వీరుడైన
    శిష్యునకు విద్య నేర్పి యా చేవచూడ
    శిష్యు నెదిరించి తానోడ శ్రీకరమది.
    ఓడిపోవుట వీరున కొక వరంబు.

    రిప్లయితొలగించండి
  13. వైరి చిక్కిన క్షణమున వాని సఖియ
    మాట చొప్పున వధియింపమాని దొరకె
    వైరికి పురుషోత్తముడదే! బాస కొరకు
    నోడిపోవుట వీరున కొక వరంబు.

    రిప్లయితొలగించండి
  14. 'స్పర్ధయావర్ధతే విద్య' శాస్త్ర సూక్తి
    విఫల మదియె సోపానమ్ము విజయమునకు
    అస్త్ర శస్త్ర విద్యల నేర్చు యంశ మందు
    నోడి పోవుటే వీరునకొక వరంబు!

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న మహోదయా! నోటులే (నోటీసులే) చెల్లని ఈకాలంలో ఆకాలంనాటి నోటి మాట విలువను ఏంత అందంగ మీ పూరణకు వాడుకున్నారు.చాల బాగున్నది. అధినందనలు.

    రిప్లయితొలగించండి





  16. తనను మించిన శిష్యుండు ,దనయుడేని
    వానితో సమరమ్మున,వాదమందు,
    నోడిపోవుట వీరున కొక వరంబు,
    గురువునకు దలవంపు గా దరసి చూడ.

    రిప్లయితొలగించండి
  17. కమనీయంగారూ! నమస్సులు. మిక్కిలి యథార్థము. చక్కగా చెప్పినారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. సమస్యకు చక్కని పూరణలు చేసిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    చంద్రశేఖర్ గారికి,
    వరప్రసాద్ గారికి,
    చింతా రామకృష్ణారావు గారికి,
    మిస్సన్న గారికి,
    సహదేవుడు గారికి,
    కమనీయం గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. సుబ్బారావు గారూ,
    మూడవ పాదంలో గణదోషం. "మూలాన + ఆ" అన్నప్పుడు యడాగమం రాదు.
    అతని మూలాన తండ్రి నిహతు డగుచు
    నోడి పోవుట .... అందాం.
    *
    వరప్రసాద్ గారూ,
    "ఎవరు + అన’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ "ఎవ రనంగ" అందాం.
    *
    సహదేవుడు గారూ,
    అది సంస్కృత వాక్యం కనుక ’విద్యా’ అనవలసి ఉంటుంది. అలా అంటే గణదోషం వస్తుంది.
    "స్పర్థచే వర్ధిలును విద్య" అందాం.

    రిప్లయితొలగించండి
  20. వీరు డెంతటి వాడైన - విజయ మింక
    తథ్య మనలేము! అట్టిది - దాని మించి,
    యనిని తనకన్నను బలాఢ్యు డయిన శత్రు
    వోడిపోవుట వీరున కొక వరంబు!

    రిప్లయితొలగించండి
  21. శర్మ గార్కి ధన్యవాదాలు.
    ఆచార్య ఫణీంద్ర గారి పూరణ అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి





  22. TBS శర్మగారికి,శంకరయ్య గారికి నా ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి