29, మార్చి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1009 (ప్రాఙ్ముఖుఁడై పరుగుదీసె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ప్రాఙ్ముఖుఁడై పరుగుదీసె భానుఁడు వేగన్.

28 కామెంట్‌లు:

  1. ఈ ఙ్మా ప్రాస సుకరమా?
    దిఙ్మాతంగనిభ కవితతికి నేని బళా!
    వాఙ్మానసముల కందక
    ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్

    రిప్లయితొలగించండి
  2. వాఙ్మయములు చదివిన హరి
    సఙ్మా యను వాడొకండు సరసున దిగి తా
    ప్రాఙ్ముఖ వందన మిడ తన
    ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్

    రిప్లయితొలగించండి
  3. సఙ్మా భానుని నడిగెను
    వా ఙ్మ యమగు తెలుగు నందు "పరుగుల పోటీ "
    ది ఙ్మాత్రము జేయుద మన
    ప్రాఙ్ముఖుడై పరుగు దీ సె భాను డు వేగన్ .

    రిప్లయితొలగించండి
  4. వాఙ్మయములు దా నేర్వగ
    దిఙ్మోహముఁ బశ్చిమమ్ము దినపతి యరిగెన్
    ప్రాఙ్ముఖమె మినుకు లుండగ
    ప్రాఙ్ముఖుఁడై పరుగుదీసె భానుఁడు వేగన్.


    దిఙ్మోహము = దిక్కులు తెలియకపోవుట. మినుకులు = వేదములు.

    రిప్లయితొలగించండి
  5. పెద్దచదువులు కొఱకు పశ్చిమ దేశాలు దారి తప్పి వెళ్ళిన సూర్యుడు వేదవిద్యలు భారతదేశములోనే ఉండటముచే తిరిగి త్వరగా ప్రాఙ్ముఖుడయ్యాడనే భావనతో

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    ఎందుకో గాని ఈ రోజు సమస్యను దుష్కర ప్రాసతో ఇచ్చి మిత్రుల స్పందన ఎలా ఉంటుందో చూడాలన్న కోరిక గలిగింది.
    ఇలాంటి దుష్కర ప్రాసతో సమస్య ఇచ్చినప్పుడు అవధానులు తరచుగా స్పందిచినట్లుగానే మీ పూరణ ఉంది. ఇటువంటి సందర్భాలలో పాపం పృచ్ఛకులు తిట్లు తిన్న సందర్భాలూ ఉన్నాయి. "గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్" అన్న సమస్య ఇచ్చినప్పుడు ఒక అవధాని పూరణ అందరికీ తెలిసిందే....
    ఉండ్రా యోరి దురాత్మక!
    యిండ్రా ప్రాసమ్ము కవుల కియ్యఁ దగున? కో
    దండ్రాము పదము సోకిన
    గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్.
    చక్కని పూరణ చెప్పిన మీకు అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ హరి "సఙ్మా" పూరణ చాలా బాగుంది.అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీరూ "సఙ్మా"నే ఆశ్రయించినా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    కవిమిత్రులారా,
    ఫరవా లేదు. స్పందన ఆనందకరంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  7. వాఙ్మయమునకధిదేవత
    దిఙ్మండలమున నగుపడ తేజముదోడన్
    వాఙ్మనమును, కాయముతో
    ప్రాఙ్ముఖుఁడై పరుగుదీసె భానుఁడు వేగన్.

    దీపముగా నిల్చి ప్రభల
    జూపుచు నారతి సలుపగ శోభిల్లుచు నా
    తాపనుడు వెలిగె నభమున
    నా పరమాత్ముని గొలుచుచు నానందముతో.

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    దిఙ్మండల వెలుగులు గని
    ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్
    ప్రాఙ్మందిరమును జేరెన్
    ప్రాఙ్ముఖము దేవళమున ప్రవచించుటకై.
    (ప్రాఙ్ముఖము= ఉపన్యాసము)

    రిప్లయితొలగించండి
  10. శ్రీ తోపెల్ల శర్మ గారి పద్యము - చిన్న సవరణలతో:

    దిఙ్మండల కాంతుల గని
    ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్
    ప్రాఙ్మందిరమును జేరెను
    ప్రాఙ్ముఖమును దేవళమున ప్రవచించుటకై

    రిప్లయితొలగించండి

  11. ఒక ఊహ:

    దిఙ్మోహమునన్ తన ప్ర-
    త్యఙ్ముఖ గమనమ్ము మఱచె తనకై రాగా
    దిఙ్మండలమున కపి గని
    ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్.

    రిప్లయితొలగించండి
  12. ప్రాఙ్మండలమున కమలిని *
    దృఙ్మాత్రము గోచరించ దిక్కును మరవన్
    దిఙ్మహితుడు చెలియ కొఱకు
    ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్ *

    *కమలములతో నిండిన సరస్సు

    తూర్పు దిక్కున నొక్క కమలము లున్న సరస్సు కనబడగానే , దిక్కులను మరచి సూర్యుడు తన కమల మనే చెలియ కోసం ఆ వైపు పరుగు తీశాడు అని భావం.

    రిప్లయితొలగించండి

  13. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    కర్ణుఁడు యుద్ధరంగంలో విగతజీవుఁడై పడి ఉండఁగా ఆ దృశ్యాన్ని చూడలేక పుత్త్రశోకంతో సచేలస్నానం చేయటానికి అస్తమించిన సూర్యుని ద్రోణపర్వంలో తిక్కన గారు వర్ణించిన తీరు:

    నిర్గతప్రాణు రాధేయు నిజకరములఁ
    గరుణ పెంపున నంటుట కారణముగఁ
    బావనస్నాన మొనరింపఁ బోవునట్టు
    లపరజలనిధి లోనికి నరిగె నినుఁడు.

    అది నిమిత్తంగా నేఁటి సమస్యకు పూరణ:

    స్త్రుఙ్మహితుఁ డర్జును హతి న
    సృఙ్మయతనుఁడై యొరఁగిన స్వీయాత్మజునిన్
    దిఙ్మానితుఁ గని వెత న
    ప్రాఙ్ముఖుఁడై పరుగుఁదీసె భానుఁడు వేగన్.

    స్త్రుక్ = యుద్ధము "జటాయాం ప్రాప్తరణే స్త్రీ స్త్రుక్" అని ఇరుగప దండేశుని నానార్థరత్నమాల లోని ఏకాక్షర కాండము (శ్లో. 63)

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి

  14. ధిఙ్మయ దక్షాధ్వరమున
    దిఙ్మోహముఁ జెందినట్టి దేవత లెల్లన్
    రుఙ్మయులై చెదరినపుడు
    ప్రాఙ్ముఖుఁడై పరుగుదీసె భానుఁడు వేగన్.

    (ధిఙ్మయ = ధిక్+మయ = ధిక్కారములతో కూడిన;
    దిఙ్మోహము = దిక్+మోహము = దిక్కులు తెలియని అజ్ఞానము;
    రుఙ్మయులు = రుక్ +మయులు = భయము నిండినవారు)

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ‘అప్రాఙ్ముఖుడై’ సూర్యుడు పరుగిడుట... అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. దుష్కర ప్రాస లెన్ని వచ్చినా/ఇచ్చినా పెద్దలు శ్రీనేమాని పండితులు, శ్రీశంకరయ్య మాష్టారు, శ్రీ ఏల్చూరి వారి పర్యవేక్షణలో శంకరాభరణ విద్యార్థులు పూరించగలరని నిరూపితమైనది. అందరి పూరణలు బాగున్నవి. శంకరార్యులవారి,ఏల్చూరి వారి నేమానివారి పూరణలు వారి ప్రత్యేకతను చాటుచున్నవి. అభినందన పూర్వక ప్రణామములు.

    రిప్లయితొలగించండి
  17. దిఙ్మండలమున తిరుగుచు
    వాఙ్మయమున వాసికెక్కె భానుండెంతో
    ప్రాఙ్ముఖమున రవి రాకనె
    ప్రాఙ్ముఖుడై పరుగు దీసె భానుడు వేగన్.

    రిప్లయితొలగించండి
  18. దిజ్మండల మేలి యలసి
    ప్రాజ్ముఖుఁ డై పరుగు దీసె భానుడు వేగన్ !
    ప్రాజ్మండలమున ప్రేయసి
    ప్రాజ్ముఖుడగు పతిని దలచి పాశము వేయన్ ! ! !

    రిప్లయితొలగించండి
  19. డా.ఏల్చూరి మురళీధర్ గారికి శుభాశీస్సులు.
    మీ ప్రతిభ అనన్య సామాన్యము. మీరు వీలు చేసుకొని పాల్గొనుచూ ఉంటే ఔత్సాహికులగు కవి మిత్రులకు ఎంతో ఉపయోగకరముగా ఉంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి




  20. ప్రాజ్ముండయి వెలుగుచు మన
    దృజ్మండలమున పడమట దిస గ్రుంకుచు బ్రా
    గ్దిజ్మండలమును జేరగ
    ప్రాజ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్

    రిప్లయితొలగించండి
  21. డా. ఏల్చూరి వారు ' ఙ్మా ' ప్రాసతో చెప్పిన క్రొత్త పదాలు,
    సూర్యభగవానుని అప్రాజ్ముఖుని గా చెప్పిన తీరు అద్భుతంగా ఉన్నాయి.

    గురువుగారూ! మీ పూరణ సందర్భో చితంగా శ్లాఘనీయమై ఒప్పుతోంది.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ నేమాని గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    శారదాహృదయాస్థానకవి, సహృదయశిరోమణి, శ్రీ మిస్సన్నార్యులకు,
    భావుకప్రియంభావుకులు, మధురకవి శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారికి
    ధన్యవాద పురస్కృత నమస్కృతులు!


    ఇది శ్రీ మద్గురుదేవుల
    సదమల మగు దీవెన సవి సంఘటిలిన శా
    రద పాదారాధనసం
    పద; కృశధిషణుని నన్ను మనిచె ననయమున్.

    శ్రీ శంకరార్య సౌహృ
    ద్యాశీర్మంగళవచోనిధాన మెలర్చున్
    శ్రీ శంకరాభరణము క
    వీశ గవీశాద్యపద్యవిద్యకు నెలవై.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరిమురళీధరరావు

    రిప్లయితొలగించండి
  23. గురువు గారూ, మీ పూరణ ఎంతో బాగుంది. శ్రీ ఏల్చూరి వారి దర్శన ప్రత్యేకత ఎప్పుడూ ఆహ్లాదకరముగానే ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  24. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల వారూ,
    మిస్సన్న గారూ,
    ఏల్చూరి వారూ,
    గన్నవరపు వారూ,
    ........... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి