29, సెప్టెంబర్ 2013, ఆదివారం

పద్య రచన – 479 (శివ కుటుంబము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“శివ కుటుంబము”
ఈ అంశమును సూచించిన మిస్సన్న గారికి ధన్యవాదములు.

33 కామెంట్‌లు:

  1. సతిని సగభాగ మందున నొదుగు మనుచు
    తనయు లిద్దరి జతగొని తరలె నెటకొ
    యెద్దు వాహన మెక్కుచు ప్రొద్దు దిరుగ
    శివ కుటుంబపు పయనమ్ము జిలుగు వెలుగు

    రిప్లయితొలగించండి
  2. శ్రీగురుభ్యోనమ:

    విశ్వమంతయు నీవెగా విశ్వనాథ
    పరవశించిన పార్వతి ప్రకృతి మాత
    కార్తికేయుండు గణపతి గన్నులనగ
    ధర్మ కామార్థ మోక్షమై దర్శనంబు
    నొసగు చున్నావు జగతెల్ల యొక్కటనగ

    రిప్లయితొలగించండి
  3. అకట! శంకర! దేహార్థమందు జూడ
    సుందరాంగిని హిమశైల సుతను మరియు
    సుతుల నిర్వుర ప్రేమతో శుభకరముల
    గూడి యుంటివి జేజేలు కొనుము దేవ!

    రిప్లయితొలగించండి
  4. శ్రీకంథరా! శివ! శీతాద్రివరవాస!
    ....శ్రితలోక రక్షక! చిత్స్వరూప!
    పర్వత నందినీ! పరమ దయామయీ!
    ....పరమార్థ దాయినీ! భవ్య గాత్రి!
    సామజ వరవక్త్ర! సర్వ విఘ్నాపహ!
    ....సరస వాగ్వైభవ! సాధుపోష!
    మదన మనోహర! మంగళ దాయక!
    ....సురదళ నాయక! శుభ విలాస!
    ప్రణవమయులగు మిము గని భక్తి మెరయ
    భవ్య యోగమ్ము నొందితి పరవశమున
    వందన శతమ్ము లర్పించి స్వాంతమలర
    ప్రార్థనమ్ము నొనర్తు మీ పదముల కడ

    రిప్లయితొలగించండి
  5. మేనసగము దాల్చి మేనకా పుత్రిని
    ఏన్గుముఖము వానినెత్తుకొనుచు
    శక్తి హస్తు పొదివి చక్కగా పట్టిన
    శివకుటుంబము గన శ్రీలు గలుగు.

    రిప్లయితొలగించండి
  6. నేమాని పండితార్యా! మధురంగా సీసంలో శివకుటుంబాన్ని నుతించారు. నమోవాకములు. నా ప్రయత్నం:

    చంద్రశేఖరుడవు చంద్రాస్య యామెయౌ
    ..........చిరునవ్వు వెన్నెలల్ చిందుచుండు!
    అగ్నిలోచనుడవు నగ్నివర్ణయు నామె
    ..........కన్నుల కురియును కరుణ వృష్టి!
    నాగభూషణుడవు నాగగామిని యామె
    ..........భక్తార్తి భంజన వ్రతము మీది!
    చిన్మయుండవు నీవు చిన్మయి యామెయౌ
    ..........తల్లిదండ్రులు జగత్త్రయమునకును!

    ఏకదంతుడు విఘ్నాల నేలు స్వామి!
    కార్తికేయుడు తారక కంటకుండు!
    బిడ్డలను గూడి భూమిపై బిడ్డలఁ గన
    వచ్చినట్టి యుమాపతీ! వందనములు.

    రిప్లయితొలగించండి
  7. అరుణ సగమై తనువొదగ
    శిరసున గంగయు, గణేశ, శిఖివాహనులే
    సరి శివ కుటుంబ మౌనా?
    చరాచర జగత్తుఁ దల్ప శంభుని దవదే?

    రిప్లయితొలగించండి
  8. సతిని మేనున దాల్చియు శంకరుండు
    ప్రమద మలరగ గౌరితో పయన మాయె
    జగము లేలెడి కొమరులు జతగ రాగ
    శివకుటుంబమునకిదియె వందనమ్ము


    ధరణిని నేలెడి నీశుడు
    తరలెను సతితో ముదమున తన్మయ మొప్పన్
    హరునివెనువెంట కొమరులు
    వరుసగ షణ్ముఖ గణపతి వరముగ వచ్చెన్

    రిప్లయితొలగించండి
  9. అర్ధనారీశ్వరుండయి యచట శివుడు
    కొమరు లిద్దరు నిరువైపు లిమ్ము గాను
    తల్లి దండ్రుల ముద్దుల తనయ్తు లగుచు
    శివకుటుంబమునొప్పెను చిత్రమందు

    రిప్లయితొలగించండి
  10. శ్రీ మిస్సన్న మహశయా! శుభాశీస్సులు.
    రచనలలో కవిత్వమును రంగరించుటలో మీరు సిద్ధ హస్తులు కదా. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారికి నమస్సులు.

    ఎక్కడో చాటువులలో చదివినట్లు గుర్తు. దాని ఆధారంగా వ్రాసినాను. తప్పులుంటే మీరూ, పరమేశ్వరుడు కూడా క్షమింతురు గాక.

    పరమేశు మెడలోన ఫణిరాజు దిగజారు
    విగ్నేశు వాహన వేటఁగోరి
    పన్నగంబును నోట పట్టించుకొనుటకై
    కాలకంఠము సాగె క్రౌర్యమంది
    దంష్ట్రావిజృంభిత దర్పోద్ధతినిజూపు
    హేమాంగమునుగాంచి వృషభమడసె
    పార్వతి కనులార పరమేశు తలపైని
    యలకనందను గాంచి యలకనొందె

    నిట్టి వైరుధ్యభావంబులెసగుచుండ
    చిద్విలాసుండుగా నిల్చు శివుఁడు నఖిల
    లోకులకు పూజ్యనీయుండు మాకు సర్వ
    శుభములందించ వేడుదస్తోకముగను


    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు నేమానివారికి, పండిత కవి మిత్రులందఱికి నమస్కారములు.

    నేఁడందఱి పద్య రచన లలరించుచున్నవి. ఇట్టి శివకుటుంబ వర్ణనాంచిత పద్యముల నందించిన...

    శ్రీమతి నేదునూరి రాజేశ్వరిగారికి,
    శ్రీపతిశాస్త్రిగారికి,
    హరివేంకటసత్యనారాయణమూర్తిగారికి,
    పండిత నేమానివారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రిగారికి,
    మిస్సన్నగారికి,
    గుండా సహదేవుడుగారికి,
    శ్రీమతి శైలజగారికి,
    సుబ్బారావుగారికి

    మనః పూర్వక అభినందనములు!

    రిప్లయితొలగించండి
  13. సర్వేశ! శంకరా! చంద్రశేఖర! దేవ!
    ..........సర్పభూషణ! శివా! జయము నీకు,
    మృత్యుంజయా! శర్వ! నిత్యసౌఖ్యద! హరా!
    ..........సత్యస్వరూపోగ్ర! జయము నీకు,
    ప్రమథాధిపా! స్వామి! ఫాలలోచన! విభూ!
    ..........సకలాగమస్తుత్య! జయము నీకు,
    శ్రీకంఠ! భూతేశ! చిద్రూప! యీశ్వరా!
    ..........సర్వసిద్ధిప్రదా! జయము నీకు,
    శక్తి! జగదంబ! శైలజా! జయము నీకు,
    శంకరాత్మజ! గజవక్త్ర! జయము నీకు
    షణ్ముఖాతులవిక్రమ! జయము నీకు
    సకల శివకుటుంబమునకు జయము జయము.

    రిప్లయితొలగించండి
  14. సీ.
    నీలకంఠా! నిన్ను నిత్యమ్ము స్మరియింతు;
    …..నిత్య సమ్ముద మిమ్ము, నిష్ఠ నిమ్ము;
    శైలాత్మజా! నిన్నుఁ జేరి, పూజింతును;
    …..శక్తి యుక్తుల నిమ్ము, శౌర్య మిమ్ము;
    వక్రతుండా! నిన్నుఁ బత్త్రితో నర్చింతు;
    …..సిద్ధి బుద్ధుల నిమ్ము, స్థిరత నిమ్ము;
    కార్తికేయా! నిన్నుఁ గైమోడ్చి కొలుతును;
    …..సద్గుణమ్ముల నిమ్ము, శాంతి నిమ్ము;
    గీ.
    నిరతమును నిన్ను మనమున నిల్పి, పరిచ
    రింతుఁ! జల్లంగఁ జూచియు, శ్రేష్ఠత నిడి,
    కావఁగా రమ్ము! స్కంధ విఘ్నహర సహిత
    సాంబ! శివ! గిరిజేశ! గజరిపు! శర్వ!

    రిప్లయితొలగించండి
  15. ఈ నాడు మిత్రు లందరి పద్యములు భక్తి రసముతో పరిపుష్టిని గాంచి యలరు చున్నవి. అందరికి శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. నేమాని పండితార్యులకు, మధుసూదనులకు ధన్యవాదములు.



    ఏమి మహానుభావమిది యీశ్వర! నీదగు వామభాగమౌ
    నామె ప్రియాత్మజున్ పొదువ నంకమునన్, భవదీయ పుత్రుడున్
    ప్రేమగ పట్టి మీ మొలను వ్రేలెడు నూలును, వెంట నంటెడున్!
    గోముగ పెద్దవాడచట, కుఱ్ఱడు క్రిందన! యేమి చోద్యమో!

    యే తిరునాళ్ళ కీ పయన మేగుచు నుండిరి పిల్ల వాళ్ళతో?
    రాతిరి యేడ మీకు బస? రమ్య వనాంతర సీమ లందునా?
    మాత! జగత్పితా! తలప, మాయెడ మాలిమి పొంగ మీ యెదన్
    భూతల మేగుదెంచిరని పోలెడు, మా యెదలన్ వసింపరే.

    రిప్లయితొలగించండి
  17. ఆదిదంపతులదీ యాదికుటుంబమ్ము
    అర్చనలందంగ నవని నౌర!
    మాళవీ సహితుడై మల్లేశుడేతెంచి
    కొమరులతో నిట కొలువు దీరె!
    మల్లెలు, మరువమ్ము, మాలతీకుసుమమ్ము
    తుమ్మిపూలను భక్తి తోడనిడుదు.
    బిల్వమ్ము, గరికలు ప్రియముగ నర్పింతు
    కుడుములనుండ్రాళ్ళ కొసరియిడుదు.

    భయములెల్లదీర్చి జయమునొసగు దుర్గ,
    విఘ్నహర్త, దేవ విజయ కర్త,
    విలయకారుడైన విశ్వేశ్వరుడు, దయ
    జూప విన్నపమిదె, జోతలిడుదు.

    రిప్లయితొలగించండి
  18. ఏల మహేశ్వరా! తమరికింతటి మాలిమి మానవాళిపై?
    ఆలిని దాల్చి మేన సగమందున, దోగుచు వెంట నంటి రా
    బాలురు షణ్ముఖుండు గజవక్త్రుడు, చయ్యన వచ్చినారు మా
    నేలకు, మమ్ము నేలుటకొ? నీలగళా! కరుణా సముద్రమా!

    తల్లియు తండ్రియున్ కలసి తత్త్వములున్ తనువుల్ సగమ్ముగా,
    పిల్లల వెంటబెట్టుకొని పెద్దమనస్సున నేగుదెంచిరీ
    చల్లని వేళలో, జనుల చల్లగ గావగ, జూడు డల్లదే!
    యెల్లరు మ్రొక్క రారె పరమేశ్వరుకున్, ధరణీ కుటుంబకున్

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారూ.. పొదివి పట్టిన వానిని, మొలనూలు పట్టిన వానిని పట్టి వర్ణించి చూపెట్టిన మీ గట్టి పరిశీలనకు జే కొట్టకుండా ఉంటామా...

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ 2 పద్యములు చాల బాగుగ నున్నవి. 2వ పద్యములో "పరమేశ్వరుకున్" అనే ప్రయోగము సాధువు కాదు. పరమేశునకున్ అని మార్చండి. అలాగే ధరణీ కుటుంబకున్ అనుట కంటె జగదేక మాతకున్ అంటే ఇంకా బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. నేమాని పండితార్యా! మీ సవరణలకు ధన్యవాదములు.

    ఏల మహేశ్వరా! తమరికింతటి మాలిమి మానవాళిపై?
    ఆలిని దాల్చి మేన సగమందున, దోగుచు వెంట నంటి రా
    బాలురు షణ్ముఖుండు గజవక్త్రుడు, చయ్యన వచ్చినారు మా
    నేలకు, మమ్ము నేలుటకొ? నీలగళా! కరుణా సముద్రమా!

    తల్లియు తండ్రియున్ కలసి తత్త్వములున్ తనువుల్ సగమ్ముగా,
    పిల్లల వెంటబెట్టుకొని పెద్దమనస్సున నేగుదెంచిరీ
    చల్లని వేళలో, జనుల చల్లగ గావగ, జూడు డల్లదే!
    యెల్లరు మ్రొక్క రారె పరమేశునకున్, జగదేకమాతకున్!

    రిప్లయితొలగించండి
  22. గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! మీ సహృదయతకు జేజేలు.

    రిప్లయితొలగించండి
  23. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

    జగములన్నిటికి పితరులు గణియింప
    ఆదిద౦పతులైన అ౦బత్రయంబకుండు
    అఖిల పశుపక్షిప్రాణులు యసురసురలు
    ప్రకృతి సకలము శివకుటుంబమ్ము గాదె

    కొలిచెద మూలమెవ్వడన కోకనదున్ వృషవాహనున్ సదా
    కలిగిన సూర్య చంద్ర శుచి కన్నుల వానిని పంచవక్త్రునిన్
    కొలిచెద పార్వతీపతిని గోపతి జాబిలి తాల్పు శంకరున్
    కొలిచెద తాండవ ప్రియుని కోరిన కోరికలన్ని తీరగా

    రిప్లయితొలగించండి
  24. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
    ========*========
    శివకుటుంబమొక్క చిత్రముల నెలవు
    వారి సేవలందు వాహనముల
    మధ్యగలదు,జూడ మంచి బంధమొకటి
    జ్ఞానబోధజేయు జనులకెల్ల!

    రిప్లయితొలగించండి
  25. ముజ్జగాలనేలుసామిముందుయుండె వేడుమా
    గుజ్జురూపుబుజ్జితండ్రిగుండెలోన నిల్పుమా
    బొజ్జ దేవ సోదరుండుబుధ్ధినీయ గొల్వుమా
    సజ్జనాళి కావవచ్చెశక్తినిధ్యానించుమా

    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు బ్లాగులో భక్తిరసం ఉప్పొంగింది. సంతోషం.
    శివకుటుంబంపై చక్కని పద్యాలు చెప్పిన కవిమిత్రులు.....
    రాజేశ్వరి అక్కయ్యకు,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    సహదేవుడు గారికి,
    శైలజ గారికి,
    సుబ్బారావు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    వరప్రసాద్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. అరెవో చూడర! కాలకంఠు నటతా నర్ధంపు దేహమ్ముతో
    పరువుల్ పెట్టు గణేశు చంకనిడుచున్ భారమ్ముతో వంగెనే
    చిరు పుత్రుండొక కాలులాగి యననున్ చీకాకునన్ ద్రోయగా
    పరమార్థంబిట కానరాదు గదరా! ప్రాభాకరున్ శాస్త్రికిన్ 😊

    రిప్లయితొలగించండి