20, మార్చి 2013, బుధవారం

పద్య రచన – 286 (ఆంధ్ర భారతి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"ఆంధ్ర భారతి"

26 కామెంట్‌లు:

  1. నారదాది మునులు నారాయణుని జేరి
    మధుర మైన భాష మాకు నిమ్మ !
    అనుచు గోరగ నత డాంధ్రము బలికించె
    భారతమ్మ జేత బ్రహ్మ నడిగి

    ( పాత పద్యమే గాని నేను వ్రాసిన వాటిలో నాకు నచ్చిన పద్యము )

    రిప్లయితొలగించండి
  2. పలికెద మాంధ్ర భారతికి భక్తిమెయిన్ రస రమ్య భావ సం
    కలిత సువర్ణ రత్నమయగాత్రికి ప్రస్తుత కీర్తికిన్ ప్రశం
    సలను జగన్నుత ప్రముఖ సాహితికిన్ శ్రుతపేయ భవ్య మం
    జులతర వాగ్విలాసినికి శుద్ధమనమ్మున జేయుచున్ నతుల్

    రిప్లయితొలగించండి
  3. గురువుగారు! నమస్కారములు.
    పురివిప్పి మనోహరముగా నాట్యము చేయుచున్న నెమిలివోలె శంకరాభరణ ఆంధ్రభారతికి ఆభరణముగా మీ పద్యరాజమలారుచున్నది.మిక్కిలి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. అన్నయ్యగారి ఆంధ్రభారతీ ప్రశంస అద్భుతము.ఆ శారదాదేవి విశేష కటాక్షానికి పాత్రులైన మీకు సదా వందనములు !
    అక్కయ్యగారికి నమస్సులు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    నన్నయ తిక్కన నన్నెచోడ కవిపుం
    ………. గవు లాంధ్ర భారతి గళము గాగ
    అన్నమయ్య పదములద్భుత కీర్తనల్
    ………. ఆంధ్ర భారతికిని హారమయ్యె
    వెంపటి వేదాంత ప్రియ కూచిపూడినా
    ………. ట్యంబాంధ్ర భారతి అందు వగుచు
    తిరుపతి వేంకట ధీవరులవధాన
    ………. విద్యాంధ్ర భారతి వీను లగుచు

    తెలుగు నేలచేయగ పుణ్య తీర్థమయ్యె
    “ఆంధ్రభారతి” ప్రపంచ యవని గాగ
    నిత్య కవితా సుమంబులు నీకు నీయ
    అమ్మ! దయజూపి మమ్ముల నాదు కొనుమ.

    రిప్లయితొలగించండి
  6. బుధజన సేవితాంఘ్రి యుగమున్ స్మరియించుచు పద్యమల్లగా
    సుధలను నింపుమీవె విన సొంపుగ నుండగ నాంధ్రభారతీ!
    మధువనమట్లు వేదికయె మారగ జేయవె శబ్దమాధురీ
    దధిని రసానుభూతి యిక దక్కగ వెన్నగ మమ్ముబ్రోవవే!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ తోపెల్ల శర్మ గారి భావమున కనురూపముగ ఒక పద్యము:

    ఆంధ్రభోజాది మహారాజ పోషకుల్
    ....శాశ్వత భవ్యతేజమును గూర్ప
    నన్నయ్య భట్టు మున్నగు కవిశేఖరుల్
    ....రమణీయ కావ్య హారముల నిడగ
    త్యాగరాజాది గాయక శిఖామణుల గీ
    ....తముల జిల్కలు సంతతమును పాడ
    పొలుపారు శ్రీకూచిపూడి బృందంబులు
    ....శిఖులట్లు నృత్యముల్ సేయుచుండ
    ఆంధ్ర భారతి యను యనురాగవర్షిణి
    విశ్వవేది పైని వేడ్క మీర
    నధివసించు చుండు నా దేవతామూర్తి
    వైభవప్రకరము ప్రస్తుతింతు

    రిప్లయితొలగించండి
  8. తమ్ముడు డా. నరసింహమూర్తి పద్యమునే ఉత్పలమాలగా:

    నారద ముఖ్యులౌ మునిగణమ్ములు శ్రీరమణీశు జేరి, దే
    వా! రమణీయ శబ్దమయ భాష నొకండు ననుగ్రహింపవే
    కూరిమి నంచు భక్తిమెయి కోరగ, శ్రీశు డనుగ్రహించె నిం
    పారెడు నాంధ్ర భారతి సమాహ్వయ భాష మహాద్భుతంబుగన్

    రిప్లయితొలగించండి
  9. ఆంద్ర భారతి ! నీ కివె యందు కొనుము
    వంద నంబులు శతకోటి వరుస నిడుదు
    నాదు కలమున నొప్పారి నన్ను జేయు
    సాటి కవులలో నొకనిగ శార దాంబ !

    రిప్లయితొలగించండి
  10. శ్రీమతి లక్ష్మీదేవి గారి ఆంధ్ర భారతి మధువులు సుధలతో ఆస్వాదయోగ్యముగా నున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. ధన్యవాదాలండి. ఈరోజు వేయి సమస్యలు పూర్తి అయిన సందర్భంగా ఆంధ్రభారతీ స్మరణ సమయోచితంగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  12. కాళి దాసును కరుణించె కల్ప వల్లి
    మూక శంకరు పలికించి మోక్ష మిడిన
    భార తావని తేజము ప్రజ్వ రిల్ల
    ఆంధ్ర భారతి శిరసాభి వంద నమ్ము

    రిప్లయితొలగించండి
  13. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    తమరి సూచనానంతర సవరణతో

    నన్నయాదికవుల నననీటి కావ్యముల్
    ………. కామితంబులు దీర్చు కంఠమాల
    అన్నమయ్య పదము లద్భుత కీర్తనల్
    ………. హత్తుకొనగ హృదిన్ హారమయ్యె
    నాట్యవిన్యాసపు నవ్యరీతులతోడ
    ………. కొంగుబంగారము కూచిపూడి
    అవధాన విద్యయె నవవిధాన మగుచు
    ………. కాంతులీనెడి కర్ణ కర్ణికములు

    భవ్య దివ్యభాషయె “యాంధ్ర భారతి” యన
    తెలుగు నేల సుసాహితీ తీర్థమయ్యె
    నిత్య కవితా సుమంబులు నీకు నీయ
    అమ్మ! దయజూపి మమ్ముల నాదు కొనుమ.

    రిప్లయితొలగించండి
  14. ఆంధ్ర భారతి శిరమున నందములను
    జిందు రత్న కిరీటపు జిలుగులట్లు
    పండితార్యుని పద్యముల్ ప్రభల నీనె
    వాణి మోమున చిరునవ్వు వన్నె లొదవె.

    రిప్లయితొలగించండి
  15. ప్రవిమల మానసులగు స
    త్కవి మిత్రులు వినుతి గూర్ప క్రాలె మనము స
    ఛ్ఛవి పూర్ణంబయి హితులకు
    వివేకశాలురకు గూర్తు ప్రియ వాక్యములన్

    రిప్లయితొలగించండి
  16. ఆంధ్ర భూమిని జన్మ నెత్తగ నల్ప పూజలు చాలునా?
    ఆంధ్ర భాషను పల్కగల్గుట లల్ప భాగ్యము కాదురా!
    ఆంధ్ర వాజ్ఞ్మయ దీధితుల్ తెలుగమ్మ చల్లని నవ్వురా!
    ఆంధ్ర భారతి బిడ్డలై మను టన్న పుణ్య ఫలమ్మురా!

    రిప్లయితొలగించండి
  17. అందము చందము గలవే
    నందరి ప్రియ భాషలెల్ల నాహా చూడన్
    అందున ఛందము పద్యము
    నందించెను వాణి చూడ నాంధ్రులకేగా.


    రిప్లయితొలగించండి
  18. పలుకులమ్మ వంట బ్రహ్మ తానే బెట్టి
    పంపె నరుల కంత పంచి పంచి
    పాయసమ్ము దొరకె పరగ నాంధ్రులకేను
    పరుల కింతయేని దొరుకలేదు.

    రిప్లయితొలగించండి



  19. ఇంతకు ముందు నేను రచించినవి ఇక్కడ వ్రాస్తున్నాను.

    ఆంధ్ర కవిత.
    ----------------
    ముద్దులొలుకు గళము ముత్యాలసరములు
    ద్విపద తేనె పలుకు దేశి కవిత
    తేటగీతి నాదు తెలుగు కమ్మని పాట
    ఆట వెలది యాడు ఆంధ్ర కవిత.

    తేటిపాటల కమ్మ తేటగీతుల రవళి ,
    ఆటవెలదుల గజ్జె లందియల ఘల్ఘలలు
    మత్తకోకిల మధు మంజుల స్వరజతుల్
    మురళీ సరాగాల ముత్యాల సరములున్
    కవిరాజరాజిత కళారగంధముల్.

    ఉత్ఫుల్ల చంపసుమోత్పల మాలికల్
    శార్దూల మత్తేభ స్వైరవిహారముల్
    ఈ కావ్యభూమిలో ,ఈ కళాసీమలో
    మాతెలుగు వనములో ,మాతెలుగు సరసిలో
    మాకెల్ల తమిగొల్పు, మా డెందమలరించు
    ----------------

    రిప్లయితొలగించండి



  20. మరి యొక పద్యము.
    -------------
    ఆదికవులు విగ్రహావిష్కరణ జేసి
    పీఠమ్ము పైన నిల్పిన విధమ్ము
    శ్రీనాథ,పోతనల్ చీనాంబరమ్ములు,
    జిలుగువల్వలు గట్టి కొలచి యుండ
    అలసాని కృస్ణ రాయాది కవీశ్వరుల్
    మణిమయ కనకభూషణము లొసగ
    భట్రాజు,పింగళి,పరిమళద్రవ్యాల
    పూలదండల తోడ బూజ సేయ

    త్యాగరాజాది గాయకుల్ ,రాగరమ్య
    కీర్తనలు పాడి రంజింప ,గీతికలను ,
    జానపదులు నర్తింప బూజలను గొనియె
    తెలుగు సాహితీదేవి ,మా కలల పంట.
    ----------------

    రిప్లయితొలగించండి
  21. ఆంధ్రభారతీ పద మంజీర నాదాలను కర్ణపేయంగా మ్రోగించే విధంగా వివిధచ్ఛందాలలో మనోహర పద్యాలను రచించిన కవిమిత్రులు....
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    పండిత నేమాని వారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    మిస్సన్న గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    కమనీయం గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  23. కమనీయ పద్యము వెలయించిన డా.కమనీయం గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి





  24. శంకరార్యులకు,TBSశర్మగారికి నా ధన్యవాదాలు.నా వంటి పాండిత్యం లేని వానికి మీ వంటి పండితుల మెప్పుకోలు ఆనందదాయకమే.

    రిప్లయితొలగించండి




  25. ఒక పద్యం చివరిపాదంలో టైపుతప్పువలన ' కళార గంధముల్ ' అనిపడింది.దానిని '' కల్ హారగంధముల్ ''అని సరిదిద్దుచున్నాను.-కమనీయం

    రిప్లయితొలగించండి