14, మార్చి 2013, గురువారం

సమస్యాపూరణం – 994 (మృగమును సేవించు నెడల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మృగమును సేవించు నెడల మేలగుఁ బ్రజకున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

21 కామెంట్‌లు:

  1. సగభాగము సింహముగా
    సగభాగము పూరుషునిగ శౌరి యలరె నా
    భగవంతుని నత్యత్భుత
    మృగమును సేవించు నెడల మేలగు బ్రజకున్

    రిప్లయితొలగించండి
  2. మృగ రూపంబున హరియే
    జగమందున చాల మార్లు జనియించెనుగా
    వగ దీర్చ నందు మెచ్చిన
    మృగమును సేవించు నెడల మేలగు బ్రజకున్

    రిప్లయితొలగించండి
  3. పగబట్టిన దైత్యాగ్రణి
    పగిలించగ స్థంభమందు ప్రస్ఫుట మయ్యెన్
    భగవంతుడు,భువి నా నర
    మృగమును సేవించు నెడల మేలగు బ్రజకున్ !

    రిప్లయితొలగించండి
  4. దిగజాఱిన భూగోళము
    నగణితముగ బైకి దెచ్చె నవనీపతి యా
    జగదీశుని కిటి రూపము
    మృగమును సేవించు నెడల మేలగు ప్రజకున్ !

    రిప్లయితొలగించండి
  5. భగవంతుని చేష్టలు నిల
    సుగ మంబులు గావు మనకు శోధించంగాన్
    మగ నర సింహపు రూ పగు
    మృగమును సేవించు నెడల మేలగు బ్రజకున్

    రిప్లయితొలగించండి
  6. భగవంతునిరూపంబుల
    మిగులన్ తనదేహమందు మేలగురీతిన్
    యగణితముగ కలిగిన గో
    మృగమును సేవించు నెడల మేలగుఁ బ్రజకున్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గారికి, శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు
    మనుజల మధ్య దిరుగు రాక్షసులను మృగములని నా పూరణ

    తల్లి దండ్రులు తమ సుతులకు మంచి బుద్ధులు నేర్పుట లేదు, అందుకే మానవ మృగములు సమాజములో దిరుగుచున్నవి .
    =======*=======
    మృగమును గన్న జనకులును
    మృగములనదగు, హరి జెలిమి మేలని దిరుగన్
    మృగమగు హరియే, జంపగ
    మృగమును, సేవించు నెడల మేలగు బ్రజకున్
    ( హరి జెలిమి = సింహము ,రౌడిల చెలిమి ),(హరియే = విష్ణువు )
    =======*=======
    మృగమును గన్న జనకులు మృగములు మృగ జాతి దిరుగు
    మృగముల తోడ,మనుజుల మేలు మరచి మేయు చుండ
    మృగమును సంహరించగను మేధిని మచ్చిక జేయు
    మృగమును,సేవించు నెడల మేలగు బ్రజకును హరిని.
    =======*=======
    మృగ జాతు లెల్ల మృగమును సేవించు
    నెడల మేలగు బ్రజ కెల్ల , మిగుల
    కీడు మృగ జాతి నీడ, దొలగిపోవు
    హరిని వేడ జనులు పురము నందు

    రిప్లయితొలగించండి
  8. ధగధగమని మెఱిసిన తఱి
    గగన తలమున నరసింహుఁ గను; జలధరమం
    దగుపించె నాకు, గనుమా
    మృగమును సేవించునెడల మేలగుఁ బ్రజకున్.

    రిప్లయితొలగించండి
  9. జగమేలు జంగమయ్యను
    సగభాగము సతికొసగిన చక్కని వేల్పున్
    తగురీతి గొలిచె కరి యా
    మృగమును సేవించునెడల మేలగుఁ బ్రజకున్.

    రిప్లయితొలగించండి
  10. నగమంథము జలభాగము
    దిగకుండగ వీపు దాల్చె దిద్దిర దిరుగన్
    అగుపించెగ యమృతము భృథ
    మృగమును సేవించు నెడల మేలగుఁ బ్రజకున్

    నగమంథము = మంథర పర్వతము
    భృథము = కూర్మము

    రిప్లయితొలగించండి
  11. మృగములు కాచు నడవి నే
    పుగ పెరిగిన వృక్ష రాశి మూగిన మేఘం
    బుఁగురియగ నడ్డు నటులన్
    మృగముల సేవించు నెడల మేలగు ప్రజకున్!

    రిప్లయితొలగించండి
  12. అగుపించెడు నదె హిమవ-
    న్నగమున పరమేశ్వరుండు నవ్వుచు! దాల్చెన్
    సగమేన గిరిజ, చేతను
    మృగమును, సేవించు నెడల మేలగు ప్రజకున్!

    రిప్లయితొలగించండి
  13. మృగ రాజు యనెడి సింగము
    భగవంతుని వాహనమగు భాగ్యము నొందెన్ !
    జగ మేలెడు దైవ కృపగల
    మృగమును సేవించు నెడల మేలగుఁ బ్రజకున్ !

    రిప్లయితొలగించండి





  14. భగవంతునిలీలలనె
    న్నగ దరమే యరసిచూడ నగధరుడు నరుల్
    మృగమను భేదము నెంచడు
    మృగమును సేవించు నెడల మేలగు బ్రజకున్.

    రిప్లయితొలగించండి
  15. నగజాత్మజునిన్ కుజునిన్
    మృగమును సేవించు నెడల మేలగుఁ బ్రజకున్
    తగురీ తిని జప ములనా
    పగిదిని యధిదేవతాధి పతులు మెచ్చన్.
    (మృగము = మృగశిరా నక్షత్రము)

    రిప్లయితొలగించండి
  16. శ్రీ తోపెల్ల శర్మ గారూ!
    శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. 4వ పాదములో ఒక మాత్ర తక్కువగ నున్నది. చూడండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. చిన్న సవరణతో,

    పగబట్టిన దైత్యాగ్రణి
    పగిలించిన స్థంభమందు ప్రస్ఫుట మయ్యెన్
    భగవంతుడు , భువి నా నర
    మృగమును సేవించు నెడల మేలగు బ్రజకున్ !

    రిప్లయితొలగించండి
  18. శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు.
    సవరణతో నా పూరణ:
    నగజాత్మజునిన్ కుజునిన్
    మృగమును సేవించు నెడల మేలగుఁ బ్రజకున్
    తగురీ తిని జప ములనా
    పగిదిని యధిదేవతాధి పతులను వేడన్.

    రిప్లయితొలగించండి
  19. నగుమోమున తుండముతో
    సగమౌ దంతము, ఘనమగు శ్రవణమ్ములతో
    వగలను దోచుచు నలరెడి
    మృగమును సేవించు నెడల మేలగుఁ బ్రజకున్


    మృగము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

    3. అడవి యందు తిరిగెడి యేనుగు;

    రిప్లయితొలగించండి
  20. ఖగమును బోలుచు వెడలన్
    భగవంతుని దయను గ్రోలి భారత నావే
    ధగధగమను జాబిలిలో
    మృగమును సేవించు నెడల మేలగుఁ బ్రజకున్

    రిప్లయితొలగించండి