28, జులై 2012, శనివారం

పద్య రచన - 64

 
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. నా కావ్యము శ్రీగిరిమల్లికార్జున శతకమునుండి:

    భారతి వీణమీటి కలుపన్ శ్రుతి, తాళము గూర్ప బ్రహ్మ, పా
    కారి యొనర్ప వేణురవ, మచ్యుతు డింపుగ మ్రోయ మద్దెలన్
    గౌరిని గూడి తాండవము కన్నుల విందుగ జేసితయ్య దై
    త్యారి గణార్చితా! కొలిచిదన్ నిను శ్రీగిరిమల్లికార్జునా!

    సురనది కేశపాశమున సొంపుగ నూగిసలాడగా, సుధా
    కరుడు చలించుచుండగ ధగద్ధగ దీప్తుల జిమ్ముచుండి, కం
    ధరమున నాడుచుండ ఫణి, తాండవకేళిని సల్పినట్టి సుం
    దర నటరాజ! నిన్ గొలిచెదన్ మది శ్రీగిరిమల్లికార్జునా!

    శివానందలహరిలో ఒక శ్లోకము:

    ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రా కలాపీ, నతా
    నుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యో గీయతే
    శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా
    వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠంభజే

    (ఆ శ్లోకమునకు స్వేఛ్ఛానువాదము)

    అతివిశాలాకాశ మద్భుత కేశముల్
    ఫణిరాజతతి కలాపమ్ము గాగ
    ఓంకారనాదమే క్రేంకారవర్యమై
    ఉపదేశసారమై యొప్పుచుండ
    ఘన ఘనా ఘనరుచి తనరారు శ్యామల
    శైలసంజాత హర్షమును గూర్ప
    సంధ్యాసమయమున స్వాంతంబు దనరార
    నీలకంఠ విశేష నృత్యగతుల
    ప్రథిత నిగమ శీర్షోద్యాన వనములందు
    నేత్రపర్వమ్ముగా జేయు నిగమవేద్యు
    శ్రీమహాదేవు నటరాజు చిత్స్వరూపు
    దలచి సాష్టాంగ విధుల వందనమొనర్తు

    రిప్లయితొలగించండి
  2. కన్నుల నాట్యమున్ గనిన, గాంచి రసజ్ఞత తోడ నెప్పుడున్,
    మిన్నుల తేరుపై చనిన మేలగు భావము పొందుచుందునే!
    పన్నగధారి ! నిన్ దలచి, పాడెదనో నట రాజ! శంకరా!
    మిన్నగ గొప్పదౌ రుచిని మెచ్చి యొసంగితివే నటేశ్వరా!

    రిప్లయితొలగించండి
  3. నటరాజా! నీ రూపును
    పటమున నే గంటినయ్య ! పరదైవమవై
    నటియించెడి భంగిమలో
    నిట నిలిచితివన్న మాట లింపుగ వింటిన్.

    భరతమునిని మెచ్చుకొనిన
    పరమశివుఁడు వరమొసంగ భరతుఁడు సేవా
    నిరతుఁడగుచు నాట్యపు విధి
    గరతలమునమలకమట్లు కావ్యము వ్రాసెన్.

    నయనానందకరమ్మగు
    నయరీతుల నాడగ శుభనాట్యము లెపుడున్
    లయఁ దప్పక నేర్చినచో
    జయమును మంగళమగునిక జాణ! తెలియుమా!

    రిప్లయితొలగించండి
  4. జటలను దాల్చిన వానిని
    నిటలాక్షునినే, దలంప నిక్కము భువిలో,
    జటిలములైన సమస్యల
    చిటికెను వేసెడు క్షణమున శివుఁడే దీర్చున్.

    రిప్లయితొలగించండి
  5. భారతీయులందరూ సగర్వంగా చెప్పుకోదగ్గమాట- ప్రపంచంలోనే నాట్యప్రక్రియ కి ఒక నిర్దుష్ట ప్రతిమ నటరాజ రూపము. వేరే యేదేశంలోగానీ, వేరే యే విదేశనాట్యానికి గానీ ఒక రూపంలో ప్రతిమ (డాన్స్ సింబాలిజం) లేదు.

    రిప్లయితొలగించండి
  6. ప్రళయ కాల కలాపమా ? పంచ బాణు
    తీట దీసిన కోపమా ? త్రిపుర హరణ
    జేసి జగతిని గాచిన చిద్విలాస
    నటనమా ? యిది తెల్పవే నాట్య రాజ!

    రిప్లయితొలగించండి
  7. నృత్యము జేయుచు నటునిటు
    మృత్యువును జయించి జగతి మహ దేవుడవై !
    అత్యాస బొందు జనులను
    ప్రత్యక్షమై ననిజముకు పాత్రుడ వగుచున్ !

    రిప్లయితొలగించండి
  8. ఒజ్జలందరు మెచ్చుచుండగ నోర్పుగా ఖలునార్పుచున్
    ముజ్జగంబులస్పూర్తి సుందర మూర్తి నర్తన జేయగా
    గజ్జెలందెలు మ్రోగుచుండగ గానమెవ్వడు జేసెనో
    సజ్జనావళి సంతసంబున సాగి మ్రొక్కెనుపాహిమాం !!!

    రిప్లయితొలగించండి
  9. కదల లయ బద్ధ ముగ జూడ కాదె నాట్య
    మటులె జగమంత కదలును నటన వలన
    లయలు గలిగిన నటనకు, లయము జేయు
    ఘటన లన్నింటి కిని నీవె గతివి దేవ.

    రిప్లయితొలగించండి
  10. పంచ భూతమ్ముల,ప్రాతినిధ్యమ్మును
    గన నటరాజ విగ్రహమునందు,
    శబ్దమ్ము డమరును ,జ్వలనచక్ర మ్మగ్ని ,
    శశిరేఖ గగనవిశాలవీధి
    జడల భాగీరథి జలరాశి సర్వమ్ము ,
    సర్పరాజులు జ్ఞానసంపదలను
    విశ్వసంగీతమ్ము వినిపింప తారకల్ ,
    గ్రహరాశి తిరుగంగ కక్ష్య లందు
    సర్వలోకమ్ము లాశ్చర్య సంభ్రమమున ,
    పరవశింపగ సాగెను పరమశివుని
    తాండవమ్మొక లీలగా దనరుచుండె
    శిల్పమందు సాక్షాత్కార చిత్రమేమొ!

    (ప్రఖ్యాత శిల్ప చరిత్రకారుడు , విమర్శకుడు,
    కీ.శే. ఆనంద కుమారస్వామి ' cosmic dance of Shiva )ని అనుసరించి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ నటరాజానంద మ
    హానటునకు నర్తనప్రియ నకులునకు సం
    ధ్యానట విహార జటికి మ
    హా నటహంసునకు కోటి హారతు లిడెదన్!

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    ధన్యోస్మి! మీ శ్రీగిరి మల్లికార్జున శతకంలోని రెండు పద్యాలు, శివానందలహరి అనువాద పద్యం హృదయరంజకంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మూడు విడతలుగా మీరు పంపిన పద్యాలు ముచ్చట గొల్పుతున్నాయి. అన్ని పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి వృత్తంలో ‘మిన్న - గొప్ప’ పదాలను వెంటవెంటనె ప్రయోగిందడం పునరుక్తి అవుతున్నది కదా!
    *
    చంద్రశేఖర్ గారూ,
    నటరాజ రూపాన్ని గురించి సగర్వంగా చెప్పారు. బాగుంది. ధన్యవాదాలు. కాని పాశ్చాత్యులకు మన దేవతాచిహ్నాలను అవమానించడమే పని. చాలాకాలం క్రితం ‘సింద్‌బాద్...’ పేరుతో వచ్చిన ఒక చిత్రంలో నటరాజ విగ్రహం ఒక దుష్టపాత్రగా మాంత్రికుని అదుపులో ఉండి ప్రాణం పోసుకొని హీరోతో నాలుగుచేతులతోనూ యుద్ధం చేస్తుంది. ఆ దృశ్యం చూసినప్పుడు బాధ కలిగింది.
    మీ నటరాజ స్తుతి చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    నటరాజును సంబోధిస్తూ మీరు చెప్పిన పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    రెండవపాదంలో యతిదోషం. మహాదేవుని మహదేవుడు అనరాదుకదా! నాల్గవపాదంలో గణదోషం. సరిగణం జగణమయింది. మీ పద్యానికి నా సవరణ....
    నృత్యము జేయుచు నటునిటు
    మృత్యువును జయించి జగతి మేటి విభుడవై
    అత్యాస బొందు జనులకు
    ప్రత్యక్షమగుచు నుతులకు పాత్రుడవౌదే!
    *
    మంద పీతాంబర్ గారూ,
    నటరాజ దర్శనంతో తన్మయులై మత్తకోకిలగా కవితాగానం చేసారు. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    నటరాజ విగ్రహ సంకేతాలను వివరిస్తూ అద్భుతమైన పద్యాన్ని వ్రాసారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి