21, జులై 2012, శనివారం

పద్య రచన - 57


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

20 కామెంట్‌లు:

 1. నోరు పండుటందు నోములు పండుట
  యందు పూజ లందు నరయ సకల
  పెండ్లి పేరటముల పేరున్న దానవు
  నాగవల్లి దళమ నతులు నీకు.

  రిప్లయితొలగించండి
 2. లేత తమలపాక లేదులే నీ సాటి
  సౌకుమార్యమందు జగతి నెన్న
  లేమ పాదములను లేత తమలపాకు
  తోడ పోల్చ వినమె నాడు నేడు.

  నీదు తీగ కూడ నిజముగా సుకుమారి
  కలగి వాడు సూర్య కాంతి సోక
  నెలత మేను బోల్చ నీతీగ తోడను
  అతిశయమ్ము గలదె యవని నెన్న.

  కోమలాంగి సఖుని గూడి చరించెడు
  రీతి నీదు తీగ ప్రీతి నల్లు
  కొనును చేరువైన కొద్ది యాధారము
  నంటి యుండు గాదె ననవరతము.

  శుభము నిన్ను నుంచ శుభ కార్య ములయందు
  దైవ కార్యమందు తమలపాక
  కప్పురంపు విడెము ఘనమౌను ప్రేయసీ
  ప్రియుల కెన్న వారి ప్రేమ బెంచ.

  రిప్లయితొలగించండి
 3. పత్రము ధన్యత పొందెను
  చిత్రముగా హరి పరుండ శిశువైనంతన్.
  పత్రము రుక్మిణి వల్లను
  చిత్రముగా త్రాసు దాను చేరిన తోడన్.

  రిప్లయితొలగించండి
 4. పత్రము ధన్యమాయెనట బాలుడి రూపున పవ్వళించగా
  చిత్రమదేమొ శ్రీహరియు జేయగ, ముద్దుల గొల్పుచుండగా.
  పత్రము రుక్మిణీ సతికి భాగ్యము కల్గగ త్రాసు జేరుచు
  న్నాత్రత తీర్చె నెల్లరకు, నక్కట! భామను మాయజేయుచున్.

  రిప్లయితొలగించండి
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 6. లేత తమల పాకు లైదింటి చొప్పున
  వరుస పెట్టి తెచ్చి వాణి కిమ్ము
  వాయ నంబు , శుక్ర వారం బు రోజున
  నీ య మేలు గలుగు నిజము బాల !

  రిప్లయితొలగించండి
 7. భగవదర్చనంబు ప్రారంభమౌటకు
  తాను సాధనంబు ధరణిలోన
  భాగ్యశాలి చూడ యోగ్య యన్నింటను
  తమలపాకు ధన్య తథ్యము గద!

  శోభలినుమడించు శుభకార్యములలోన
  దీని యునికివలన దీప్తు లొలుకు
  సంతసంబు గలుగు సద్భావమేర్పడు
  తమలపాకు ధన్య, తథ్యము గద!

  సరసమైనయట్టి సత్కావ్యరచనంపు
  కాంక్ష కలుగజేయు కవులకిలను
  వక్క,సున్నములకు చక్కని నేస్తమై
  తమలపాకు ధన్య, తథ్యము గద!

  తానె ముఖ్యమౌచు తాంబూలమందున
  హాయి నొసగుచుండి యద్భుతముగ
  నుర్వి జనులలోన నుత్సాహమును జేర్చు
  తమలపాకు ధన్య, తథ్యము గద!

  వ్రతములందు జేరి వైభవంబుగ నూరి
  వారిలోన బెంచు భక్తి నెపుడు
  శ్రద్ధ గలుగజేయు సాధుత్వమును గూర్చు
  తమలపాకు ధన్య, తథ్యము గద!

  పిన్నవారికైన పెద్దలకైనను
  కంఠశుద్ధి చేసి కమ్మనిదగు
  స్వరమునందజేయు సత్వంబు గలిగించు
  తమలపాకు ధన్య, తథ్యము గద!

  రిప్లయితొలగించండి
 8. ఆకువక్కల బోలిన యాలుమగలు
  సున్నమును జేర్చినట్టు సత్సుతుని గూడి
  అరుణరాగమ్ము రంజిల్లు నాస్యమట్లు
  చక్కనైనట్టి సంసార సారమగును.

  రిప్లయితొలగించండి
 9. గుండు మధుసూదన్ గారి పద్యములు....
  కం.
  ధారానగరమునందు ను
  దారులు భవభూతి, కాళిదాసు లిరువు రా
  దారి నడువంగఁ జని యటఁ
  గోరియుఁ దాంబూల మపుడు గూరిమితోడన్.
  తే.గీ.
  కనిరి తాంబూలరాగాధరను వితర్ది;
  నామె తారుణ్యభరయౌట, నటకు నేఁగి,
  "తూర్ణమే తెమ్ము చూర్ణమ్ము పూర్ణచంద్ర
  వదన!" యని భవభూతియుఁ బలుకఁగానె
  ఆ.వె.
  కాళిదాసు పలికె “కర్ణాంతకీర్ణలో
  చన విశాల! తెమ్ము స్వర్ణవర్ణ
  పర్ణములను! నీకు బహుశుభాశీస్సులు!
  వేఁగఁ బోయి రమ్ము, వేచియుంటి!”
  ఆ.వె.
  అనఁగ లోని కేఁగి యాపడతియు నప్డు
  పసిఁడిఁ దమలపాకు లెసఁగుచుండఁ
  దెల్లనైన సున్న ముల్లసిల్లుచునుండఁ
  దీసికొనియు వచ్చె దీక్షతోడ!
  తే.గీ.
  ముందు గోరిన యా భవభూతి విడచి
  కాళిదాసుకు నిచ్చెను కాంక్ష దీర;
  నపుడు భవభూతియును కారణ మ్మడుగఁగ
  వనిత బదులిచ్చెఁ గారణమును కవికిని!
  కం.
  “వినుఁ డార్యా! లోకమునం
  జనురీతిని నే నడచితి! సైరింపుఁడు నన్!
  బెను రొక్కము లిచ్చినవా
  రినె మెచ్చును లోక మెపుడు, శ్రేష్ఠ! నిజమిదే!
  ఆ.వె.
  వీవు మూఁడణాలు, నితఁడును నైదణా
  లిచ్చిరయ్య నాకు నిచ్చగలిగి
  నెక్కుడైన ధనము నిచ్చిన యీతని
  కాంక్షఁ దీర్ప ముందుగా నిడితిని!“
  కం.
  ఆమాట విన్న యిద్దఱు
  నేమాటనుఁ బలుకలేక నెఱజాణ కటన్
  సేమమ్ము గల్గు ననియును
  నీమముతో వెడలి రపుడు నెమ్మన మలరన్.

  రిప్లయితొలగించండి
 10. తానే తాంబూలంబై
  శ్రీనాధుని నోటఁ జేరి సీసముఁ బల్కెన్
  నేనూ పుక్కిటబట్టగ
  ఈనాడీకందమగుచునిక్కడఁజేరెన్!

  రిప్లయితొలగించండి
 11. హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  సుందరమైన పద్యాలను చెప్పారు. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీరు తమాల పత్రాన్ని కాక ‘పత్రాన్నే’ విషయంగా తీసుకున్నారు.
  ఒకే విషయాన్ని రెండు వేర్వేరు పద్యాల్లో చక్కగా సమర్థవంతంగా చెప్పారు.
  విష్ణుదేవుని మఱ్ఱియాకును, రుక్మిణి యొక్క తులసి యాకును విషయాలుగా చేసుకున్నారు. బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ వాయనాల పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సత్యనారాయణ మూర్తి గారూ,
  తమలపాకు ధన్య అనడం కంటే మీ పద్యాలను చదివే అవకాశం లభించినందుకు మేము ధన్యులం. తమాలపత్రాన్ని అన్ని కోణాల్లోను పరామర్శించారు. అద్భుతంగా ఉన్నాయి పద్యాలు. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  కమనీయం గారూ,
  ఒక చక్కని కుటుంబచిత్రాన్ని పద్యరూపంలో మా కళ్ళముందుంచారు. చాలా బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  చమత్కారభరితమైన కథను ఖండకృతి రూపంలో అందించారు. చాలా బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  పద్యాన్ని తమలపాకుతో పోల్చిన మీ పద్యంలోని చమత్కారం అలరించింది. అభినందనలు.
  ‘నేనూ’ అనేదాన్ని ‘నేనును’ అంటే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 12. పచ్చని తాంబూల మనగ
  హెచ్చును సంతసము మదికి హేలా గతియౌ !
  యిచ్చును శుభముల నన్నిట
  మెచ్చిరి కవనమ్ములల్ల మెఱుపౌ విడెమున్ !

  రిప్లయితొలగించండి
 13. గురువు గారూ,
  ముందున రెండు ప్రయత్నాలలోనూ, తప్పులు వ్రాసాను, మన్నించండి.
  ఈ సారీ కూడా తప్పులున్నాయని అనుమానం కలుగుతున్నది కానీ సాహసిస్తున్నాను.

  మృష్టాన్నాంతర ఘన సం
  తుష్టికి,జీర్ణవ్యవస్థ దోర్బలమునకున్,
  సృష్టికి, కవితా వృష్టికి,
  పుష్టికి, మూలమ్మిదౌను భువిఁబింబోష్ఠీ!

  రిప్లయితొలగించండి
 14. కప్పురపు విడెము గాంచిన
  నొప్పుగ తినగోరు తపన నోరూరంగా !
  చప్పున కనబడె ప్రేయసి
  తెప్పలుగ కురిసె మనమున తీయని కోర్కెల్ !

  రిప్లయితొలగించండి
 15. గురువుగారికి ప్రణామములు,తమరి సవరణ బాగుంది. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 16. గురువు గారు,
  ధన్యవాదాలు.
  రామకృష్ణ గారు,
  శబ్దాలంకార శోభితమైన మీ పద్యం, అందులోని భావం కూడా బాగుంది.
  గణ, యతి దోషాలైతే కనిపించటం లేదు. మరి మీరెందుకనుకుంటున్నారో నాకు తెలీదు. పెద్దలు చెప్పగలరు.
  పుష్టికి తమలపాకు ఉపయోగపడుతుందంటారా?
  కవితావృష్టిని పుష్టికి అని లంకె వేస్తే.....బాగుంటుందని నా అభిప్రాయం. ప్రకృతిలో భాగంగా రామణీయకతను పెంచుతూనూ, తాంబూలంగా సంతుష్టి నిచ్చేది గానూ, కవితా వృష్టి ఇంకా బాగా జరగటానికి ఉపయోగపడుతుంది.
  (కొంచెం ఎక్కువే వాగేశానా.....మన్నించండి.)

  రిప్లయితొలగించండి
 17. ఊకదంపుడు (రామకృష్ణ) గారూ,
  మీ పద్యం సర్వశ్రేష్టంగా ఉంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  ‘పుష్టికి తమలపాకు ఉపయోగపడుతుందంటారా?’ అని ప్రశ్నించారు. ‘వస్తుగుణదీపిక’లో ఏం చెప్పారో చూడండి....
  తమలపాకులను ఔషధంగాను, తాంబూలానికి ఉపయోగిస్తారు. ఇవి నోటిజిగట, దుర్గంధం, శ్లేష్మం, వాతం, గుండెలో భారం, రసదోషం, అజీర్ణం, మలబద్ధకం మొదలైన వాటిని పోగొడతాయి. వేడికాని, చలువకాని చేయక సమశీతోష్ణమైనవి. ఆకలి పుట్టిస్తాయి. పొట్టకు, హృదయానికి, బుద్ధికి బలాన్నిస్తాయి. దేహంలోని దుష్టపదార్థాలను తొలగిస్తాయి.... ఇంకా చాలా ఉన్నాయి...

  రిప్లయితొలగించండి
 18. గురువు గారూ, లక్ష్మీదేవి గారూ,
  ధన్యవాదములు.

  లక్ష్మీదేవి గారూ,
  దోర్బలము అన్నదగ్గర అనుమానం వచ్చింది. శబ్దరత్నాకరం లో దోర్బలుడు కనిపించింది కానీయండీ, దోర్బలము అగుపడలేదు.

  సృష్టి, వృష్టి, పుష్టి మూడున్నూ 'కవితా'తో కలిపి అన్వయం చెప్పుకోబడే వెసులుబాటు ఉంటుందేమోనని అలా రాశాను.
  కేవలం వృష్టి ని మాత్రమే కలుపవచ్చును. గురువు గారు ఉటంకించినట్టు, సర్వరోగ నివారిణిని తీసుకున్న తరువాత పుష్టి అదే వస్తుంది.

  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 19. రామకృష్ణ గారు,
  నేనూ వెతికాను అర్థం. దోర్బలము = మైట్ ఆఫ్ ఆర్మ్ అని ఇచ్చారు. ఆన్ధ్రభారతి నిఘంటువులో ( శంకర నారాయణ నిఘంటువులో)
  అప్పటికే ఎక్కువ వాగాననిపించి ఊరుకున్నా.

  రిప్లయితొలగించండి