23, జులై 2012, సోమవారం

‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - 4

          ఈ కావ్యము పేరు "శ్రీమదధ్యాత్మరామాయణము" కావున ఇది వేదాంత విజ్ఞాన సర్వస్వమునకు భాండాగారము.  అనేకానేక వేదాంత విజ్ఞాన విషయములు ఇందులో తెలుపబడినవి.
1.   కావ్య ప్రారంభములో "శ్రీరామహృదయము" అనే ఆత్మజ్ఞాన బోధ కలదు.  దీనినే సీతా రామాంజనేయ సంవాదము అని కూడా చెప్పుదురు.  ఆత్మ జ్ఞానసారము శ్రీరాముని ఆదేశము మేరకు సీతాదేవి ఆంజనేయునికి బోధిస్తుంది.  పిదప శ్రీరాముడు మరికొంత బోధ కావించెను.  ఇదే ఈ కావ్యమునకు పునాది.  మిగిలిన కావ్యమంతయు దీనికి విపులమైన వ్యాఖ్య గానే యున్నది.
2.   శ్రీరాముడు లక్ష్మణునికి నాలుగు సందర్భములలో జ్ఞానబోధ కావించెను.  అందులో "శ్రీరామగీత" యను మహోపదేశము చాల ముఖ్యమైనది.  శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన "గీతాబోధ"తో సమానమైనది.  అంతేకాదు అనేకులగు మహర్షులకు, శబరి, స్వయంప్రభ, తార మొదలగు వారికి మంచి జ్ఞాన బోధ గావించెను.  అటులనే కొందరు మహర్షుల బోధలు కూడ ఇందున్నవి. 
3.  శ్రీరామునికి అహల్య, పరశురాముడు, జటాయువు, ఇంద్రాది దేవతలు చేసిన స్తోత్రములు అనేకములు ఇందున్నవి.  కౌసల్యాదేవి శ్రీ మహావిష్ణువునకు చేసిన స్తోత్రము ఒక దండకము రూపములో, అయోధ్యా పౌరులు శ్రీరామ పట్టాభిషేక సమయములో చేసిన స్తోత్రము ఒక దండకము కలవు.  మరియును మూడు అష్టకములు కలవు. 
4.  పూర్తి సంస్కృత వాక్యములతో కొన్ని శ్లోకములు వేద మంత్రములను అనుకరించుచు కలవు  --
  - బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించి నప్పుడు;
  - పరశురాముడు శ్రీరామునికి ప్రార్థనము  చేసినప్పుడు;
  - శ్రీరాముడు రామలింగ క్షేత్రములో లింగ ప్రతిష్ఠ కావించినపుడు చేసిన స్తోత్రము
మొదలైన స్తోత్రములు చదువరులకు ఎంతయును ఆనందమును కలిగించును.

5.   మూలములో లేని స్తోత్రములను ఈ కావ్యములో కొన్నిటిని చేర్చితిని.  ఉదా: గంగాదేవికి సీతాదేవి చేసిన ప్రార్థన;  ఆంజనేయుడు శ్రీరామునికి చేసిన స్తోత్రము, ఇంద్రాదులు సీతాదేవి అవతారము ముగించునపుడు చేసిన స్తోత్రము, మొ.వి.  
          వ్యాస మహర్షి ఈ అధ్యాత్మ రామాయణము (పూర్తి కావ్యము) గురించి, ఇందులోని శ్రీరామ హృదయమును గూర్చి, మరియు శ్రీరామగీతను గూర్చి చదివిన, వ్రాసిన, వినిన గొప్ప పుణ్య ఫలితములు ఉండును అని ఫలశ్రుతిని దెలిపెను.
          స్వస్తి.  (సశేషము).

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి