26, జులై 2012, గురువారం

సమస్యాపూరణం - 774 (కాకరపూ పూచి నిమ్మ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కాకరపూ పూచి నిమ్మకాయలు కాచెన్.
(‘తెలుగులో సమస్యాపూరణలు’ గ్రంధంనుండి)

21 కామెంట్‌లు:

 1. కాకర పాదులు బాగా పెరుగుటకు దిష్టి సోకకుండా కట్టిన నిమ్మకాయలు కాచినవని(రక్షిం చాయని) నా భావం.

  సోకక జేయగ దిష్టిని
  కాకర పాదులకు నిమ్మకాయలు కడితిన్
  ఆ కారణమున పెరిగెను
  కాకరపూ పూచి, నిమ్మకాయలు కాచెన్.

  రిప్లయితొలగించండి
 2. నే కడు మక్కువతోడను
  కాకరపాదునిట పెడితి కాయల కొఱకై
  ప్రాకెనిది, నిమ్మ తోటను
  కాకరపూ పూచి నిమ్మకాయలు కాచెన్.

  రిప్లయితొలగించండి
 3. గుండు మధుసూదన్ గారి పూరణ.....

  సోఁకెనని చీడ, నిమ్మకుఁ
  గాకరకును గీట నాశకమ్మగు మందున్
  జే కొని చిమ్మఁగ, నప్పుడు
  కాకర పూ పూచి, నిమ్మకాయలు కాచెన్!

  రిప్లయితొలగించండి
 4. శ్రీకృష్ణుడె జన్మించియు
  నా కంసుని కాడుబిడ్డ యట కన్పట్టెన్
  హా కాల మహిమమేమో
  కాకర పూ పూచి నిమ్మ కాయలు కాచెన్

  రిప్లయితొలగించండి
 5. మూకలుగా రోగంబులు
  సోకిన జంబీరతరువు సుందరి! నీవున్
  చేకొని సంరక్షించగ
  కాకర! పూపూచి నిమ్మకాయలు కాచెన్.

  రిప్లయితొలగించండి
 6. కాకరయు నిమ్మముక్కలు
  తాకుచును పరాగములను తనిగాగూడెన్
  వైకార్యంబున బుట్టిన
  కాకరపూ పూచి, నిమ్మకాయలు కాచెన్.

  రిప్లయితొలగించండి
 7. వేకువన రైతు మొలుకలు
  చేకొనిజలకములబెట్టి చేనుననాటన్
  ప్రాకెను బీరయు,చిక్కుడు,
  కాకర పూపూచె, నిమ్మ కాయలు కాచెన్ !!!

  రిప్లయితొలగించండి
 8. శ్రీకరముగభూమివెలసెఁ
  గాకరపూ పూచె;; నిమ్మకాయలు కాచెన్
  పోక తమల వరి పసుపు పొ
  గాకు విరివిగానుపండె కఱవది దీరెన్!
  మనవి: సమస్య పాదంలో ‘పూచి ‘ ని ‘పూచె’ గా మార్చటం జరిగింది. కొందరు అలాకూడా పూరించారు. నా పూరణలో “పూచి” అని చదువుకొన్నా మంచిదే.

  రిప్లయితొలగించండి
 9. శ్రీకరముగ మా తోటల
  నీ కాలమునందు పంట హెచ్చెను గనుమా
  నైక గతుల సుగుణానీ
  కాకర! పూ పూచి నిమ్మ కాయలు కాచెన్

  రిప్లయితొలగించండి
 10. శ్రీకరమగు ప్రకృతి యన
  భీకర ముగనెండ వాన భీభత్సములున్ !
  ప్రాకెను నటునిటు పాదులు
  కాకర పూపూచి నిమ్మ కాయలు కాచెన్

  రిప్లయితొలగించండి
 11. సోకెను దోషము తరులకు
  యేకాక్షి వంటి కేకరము లనేకముగా !
  రాకాసి మూక మహిమకు
  కాకర పూపూచి నిమ్మ కాయలు కాచెన్ !

  రిప్లయితొలగించండి
 12. మాకున్న పెరడులో మే
  మీ కాలము పెంచినార మెన్నియొ మొక్కల్
  ప్రాకటముగ మూన్నాళ్ళయె
  కాకరపూ పూచి, నిమ్మ కాయలు కాచెన్.

  రిప్లయితొలగించండి
 13. ప్రాకంగనిమ్మచెట్టుకు
  కాకర, పూపూచి నిమ్మ, కాయలు కాచెన్
  కాకర కీటక నాశిని
  గాకున్న పెరటి నిమ్మ,కాసులొసగునే?
  (పెరటి నిమ్మ చెట్లు ఇంటి అవసరములకు మించి కాయల నీయగా, అమ్మితే డబ్బులొచ్చాయన్న భావం)

  రిప్లయితొలగించండి
 14. హనుమచ్ఛాస్త్రి గారూ,
  భేష్! ప్రశస్తమైన ఆలోచనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ రెండు పూరణలూ వైవిధ్యంగా బాగున్నవి. ముఖ్యంగా ‘కాకర’ను సంబోధనగా మార్చిన మీ ప్రతిభ శ్లాఘనీయం. అభినందనలు.
  *
  సత్యనారాయణ మూర్తి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  చంద్రమౌళి గారూ,
  మీ ‘క్రాస్ బ్రీడ్’ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మొన్ననే సమస్యపాదంలోని అక్షరాలను మార్చకూడదు అనే చర్చ జరిగింది. మీరు ‘పూచి’ని ‘పూచె’గా మార్చారు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  బాగుంది మీ పూరణ. పృచ్ఛకుడు ఇచ్చిన సమస్యలోని అక్షరాలను మార్చకూడదని నియమం.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది కానీ రెండవపాదంలో గణయతిదోషాలు. సవరణకు నాకు లొంగనంటున్నవి..
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. " లొంగితే వింతేముంది ? " మీ కలానికి పని చెప్పాలి కదా ?

  రిప్లయితొలగించండి
 16. విద్యాసాగర్ అందవోలుశనివారం, జులై 28, 2012 9:54:00 PM

  కాకర నిమ్మయు మరియా
  కాకర పాదులు మొలువగ ఘనమౌ రీతిన్,
  కాకరకు పట్టె పురుగా
  కాకర పూపూచి నిమ్మ కాయలు కాచెన్
  (రెండు నాలుగవ పాదాలలో చివర 'ఆకాకరకాయ' ను ప్రస్తావించడం జరిగింది)
  --విద్యాసాగర్ అందవోలు

  ఏక స్థలమున నిమ్మయు

  కాకర పాదులు మొలువగ,కలవర మెసగన్

  కాకరకు పట్టె పురుగా

  కాకర పూపూచి నిమ్మ కాయలు కాచెన్
  -- అందవోలు రామ్మోహన్

  రిప్లయితొలగించండి
 17. చాకలి కూతల తోడన్
  శ్రీకరముగ లవకుశులును శ్రీరామునికా
  శోకము దీర్చగ కలిగెన్...
  కాకరపూ పూచి నిమ్మకాయలు కాచెన్

  రిప్లయితొలగించండి
 18. కాకరను, నిమ్మ మొక్కను,
  ప్రాకటముగ నాటి మగువ బలుపుగ పెంచన్
  వేకువ జామున చూడగ
  కాకర, పూపూచి;...నిమ్మ, కాయలు కాచెన్

  రిప్లయితొలగించండి