27, జులై 2012, శుక్రవారం

పద్య రచన - 63

వరలక్ష్మీవ్రత పర్వదిన శుభాకాంక్షలు!
 కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

  1. వందేహం శ్రీహరిప్రియాం

    వందేహం శ్రీమహాలక్ష్మీం
    వందే భక్త వరప్రదాం
    వందే వారిజ పత్రాక్షీం
    వందేహం శ్రీహరిప్రియాం

    వందే పూర్ణేందు బింబాస్యాం
    వందే చంద్ర సహోదరీం
    వందే మందస్మితాం పద్మాం
    వందేహం శ్రీహరిప్రియాం

    వందే సంపత్ప్రదాం దేవీం
    వందే దారిద్ర్య నాశినీం
    వందే హిరణ్మయీం శాంతాం
    వందేహం శ్రీహరిప్రియాం

    వందే సువర్ణ భూషాఢ్యాం
    వందే దేవగణార్చితాం
    వందే సౌభాగ్య సంపన్నాం
    వందేహం శ్రీహరిప్రియాం

    వందే సౌఖ్యప్రదాం లక్ష్మీం
    వందే మంగళ దేవతాం
    వందే దయామయీం సాధ్వీం
    వందేహం శ్రీహరిప్రియాం

    రిప్లయితొలగించండి
  2. వరలక్ష్మీ వ్రతమాచరింప జనముల్ భక్తిన్ గృహమ్మందునన్
    చిర సౌభాగ్యము శాంతి సత్సుఖములున్ శ్రీలున్ సదా నెల్కొనున్
    వర వీణా మృదు పాణి గౌరి సిరియున్ వాత్సల్య మేపారగన్
    స్థిరవాసమ్ముగ నింటి జేకొనుటచే జేజేలు హర్షింపగా .

    రిప్లయితొలగించండి
  3. సిరులును, భక్తి భావమును, సేవను జేయు గుణమ్మునిచ్చుచున్,
    వరములు గోరు భక్తులకు బాధను దీర్చి, శుభమ్మునిచ్చుచున్,
    కరుణను బ్రోచు దేవతను, కన్నులయందు వసించు లక్ష్మినిన్,
    నిరతము పూజ జేయుదును, నెమ్మనమందున దేవి నిన్నికన్.

    రిప్లయితొలగించండి
  4. వరముల నీయవె తల్లీ
    వరలక్ష్మీ పూజ శుక్ర వారము చేతున్
    ధరలో నిలువని వారము
    ధరలన్నీ పెరిగి పోయె దండము తల్లీ!

    రిప్లయితొలగించండి
  5. వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ
    ఆ.వె.
    సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
    జేరి పార్వతియును, జిఱునగవుల
    శివుఁడు తనదు భస్మసింహాసమ్మునఁ
    గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు. (1)
    ఆ.వె.
    “స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
    పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
    వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
    జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)
    కం.
    సతి కోరఁగ విని, శివుఁడును
    హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
    వతి వినయమునను గోరితి;
    కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్. (3)
    తే.గీ.
    మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
    ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
    పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
    ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)
    కం.
    ఒకనాఁడు స్వప్నమందున
    సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
    ప్రకటిత మాయెను సరగున
    వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)
    తే.గీ.
    “చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
    బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
    సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
    గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)
    ఆ.వె.
    అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ,
    చారుమతియు లేచి, సంతసించి,
    “వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి,
    మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)
    కం.
    హే మాతా! సంపత్కరి!
    శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
    నేమమున నిన్నుఁ గొలుతును;
    నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)
    తే.గీ.
    అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
    పతికి, నత్తమామలకును నతివ తెలుప;
    సంతసమ్మున విని, వారు సమ్మతించి,
    “వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)
    కం.
    ఇది విన్న యూరి సుదతులు
    ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
    యెదురుపడు శుక్రవారము
    గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్. (10)
    తే.గీ.
    “పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి!
    దేవి! నారాయణప్రి యాబ్ధితనయ! నమ”
    మనుచు వారలు చారుమతిని గలసియుఁ
    జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)
    తే.గీ.
    తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
    మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
    కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
    ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)
    తే.గీ.
    పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
    సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
    నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
    దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)
    కం.
    సతి వింటివె యీ కథ! నే
    సతి పతు లిది విన్నఁ గాని, చదివిన, లక్ష్మీ
    సతి, తా నొసఁగును సకలము,
    లతి శుభముల నిచ్చుఁ గాత, యనవరతమ్మున్. (14)

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    మీ ‘హరిప్రియ’ స్తోత్రం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ వరలక్ష్మీ వ్రత కథ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. వరలక్ష్మి పూజ జేసిన
    సిరులన్నియుగురియునింట చింతలుదీరున్
    పెరుగును పతులకు నాయువు
    పరమానందము గలుగును పడతులకెల్లన్ !!!

    రిప్లయితొలగించండి
  8. నేరము లెంచకు తల్లీ
    భారము నీపైన నిడితి పాలించ గదే ?
    వారిజ లోచన దయగని
    నీరాజన మందు కొనుము నీరజ లక్ష్మీ !

    రిప్లయితొలగించండి