వినాయక స్తుతి
సురవందిత శుద్ధ యశోవిభవా!
ధరణీధరరాజ సుతా తనయా!
పరమార్థ ఫలప్రద! వందనమో
వరసిద్ధి వినాయక! భద్రగుణా! (1)
సరసేక్షణ! సజ్జన సంఘహితా!
దురితఘ్న! సుఖప్రద! దోషహరా!
పరమేశ్వర నందన! వందనమో
వరసిద్ధి వినాయక! భద్రగుణా! (2)
కరిరాజవరేణ్య ముఖా! సుముఖా!
కరుణాకర! పావన! కంజపదా!
వరదా! శ్రితవత్సల! వందనమో
వరసిద్ధి వినాయక! భద్రగుణా! (3)
శరణాగత రక్షక! సద్ధృదయా!
శరదైందవ వర్ణ! ప్రసన్న ముఖా!
పరమా! ప్రమథ స్తుత! వందనమో
వరసిద్ధి వినాయక! భద్రగుణా! (4)
పరమేశ కృపామృత పానరతా!
పరితాపహరా! భవబంధ హరా!
వర మూషిక వాహన! వందనమో
వరసిద్ధి వినాయక! భద్రగుణా! (5)
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
ఆర్యా!
రిప్లయితొలగించండిమీ వరసిద్ధివినాయక స్తుతి అత్యద్భుతంగా ఉంది.
నమస్కారములు.
అయ్యా,
రిప్లయితొలగించండిఅన్నింట్లో ర ప్రాస వేసిన చక్కటి స్తుతి.
పరితోష హరా అనే పేరుని ఏ అర్థంలో ప్రయోగించారో అర్థం కాలేదు. పరితోషం అంటే సంతోషం కదా!
అమ్మా లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు. నా వ్రాత ప్రతిలో 'పరితాపహరా" అనే ఉన్నది. టైపు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని టైపు చెయ్యలేదు. అందుకే పొరపాటు దొరలినది. దానిని "పరితాప హరా" అని సవరించమని శ్రీ శంకరయ్య గారిని ఇందు మూలముగా కోరుచున్నాను. స్వస్తి.
రిప్లయితొలగించండిమా వినాయక స్తుతి గురించి ప్రశంస చేసిన శ్రీ హరి వారికి, శ్రీమతి లక్ష్మీ దేవి గారికి (తప్పు చూపించినందుకు కూడా) అనేక శుభాశీస్సులు. స్వస్తి.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండితోటక వృత్తాలలో మీ వినాయక స్తుతి గానయోగ్యమై అద్భుతంగా ఉంది. ధన్యావాదాలు.
టైపాటును సవరించాను.
వరసిద్ధి వినాయక ప్రస్తుతితోఁ
దరియింపఁగఁ జేసిన ధన్యుఁడవే,
చిరశాంతిసుఖంబుల సిద్ధినిఁ బొం
ది రహింపుము మిత్రమ! తేజమునన్.
నమస్కారములు
రిప్లయితొలగించండిశ్రీ పండిత నేమాని వారి , గణనాధుని స్తుతి శ్లాఘనీయము. ధన్య వాదములు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురువర్యా......
రిప్లయితొలగించండివినాయక స్తుతి అమోఘంగా ఉన్నది. అభినందన పూర్వక వందనసుమాలు.