26, జులై 2012, గురువారం

పద్య రచన - 62

 కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. నటరాజును మరపించుచు
    చిటిపొటి పాదమ్ము లదమి చిరు నాట్యముతో
    పటుతరముగ కాళీయుని
    కటకట బడ జేసినావు గద శ్రీ కృష్ణా!

    రిప్లయితొలగించండి
  2. నా కావ్యము (అముద్రితము) కాళియమర్దనమునుండి.

    బుసలు కొట్టిన పాము పసతగ్గి గాత్రమ్ము
    పట్టుకోల్పోయె కంపమ్ము హెచ్చె
    కంటిచూపులలోని మంటలు చల్లారె
    రోసమ్ముమాసె నాయాసమొదవె
    వజ్రతుల్యములైన బలమైన కోరలు
    చెల్లరే నొప్పితో డుల్లలయ్యె
    ఏమిటో యాస్థితి యెరుగని వేళలో
    భావింపజాలని బాధ హెచ్చె
    మంత్రమో తంత్రమో మహిమంబొ యేమొ
    వెరచుచుండియు వేరొక వెరవులేక
    సాహసము మానడయ్యె నే సరణినేని
    బాలకుని విడువడుగదా పాపరేడు

    పెంచి శరీరమున్నతిని భీప్రదుడై ఫణిరాజు పట్టు ఛే
    దించి ఫణాళిపై కెగసి దివ్యమహోజ్జ్వల మూర్తి దాల్చి న
    ర్తించెను బాలకృష్ణు డవలీలగ తాండవకేళి నంత భా
    సించెను దిక్కులెల్ల యదు సింహుని లీలల గాంచి వేడ్కతో

    తధింధిమి తళాంగుతై తకిటతోం తతోం తత్తతోం
    తధింకిట తధింకిట త్తకిట దీధింతోం ధిత్తతోం
    తధాంగు తక తత్తతై తధిమితై పదాలేర్పడన్
    సుధీవరుడు నృత్యమున్ సువిధి సల్పె భోగీంద్రుపై

    హర్షాతిశయవతి యమునా తరంగిణి
    యుప్పొంగు నలల నుర్రూతలూగె
    బృందారకాళి యమంద సంతోషాన
    నద్భుత దివ్య వాద్యాల మ్రోసె
    నారద సనక సనందన ముఖ్య బృం
    దాళి స్తోత్రమొనర్చె తన్మయమున
    కిన్నెర గంధర్వ కింపురుషాళియు
    లయను గల్పించి తాళమ్ము గూర్చె
    బహుళ మణిదీప తోరణోద్భాసితమగు
    విషధరు ఫణాంచిత విశాల వేదిపైని
    వేణుగానమొనర్చుచు ప్రేమమూర్తి
    కృష్ణు డద్భుత తాండవకేళి సలుప

    లీలా మానుష వేషధారి మురళీకృష్ణుండు మాయాజగ
    ల్లీలా నాటక సూత్రధారి నగవుల్ చిందించుచున్ భోగిపై
    బాలార్క ప్రతిమాన తేజమలరన్ భాసించె నత్యంత రా
    గాలాంకారుడు నృత్యకేళి భువనం బాశ్చర్యముం జెందగన్

    రిప్లయితొలగించండి
  3. మదమ్ముతో చరించు సర్పమై విషమ్ము చిమ్మ, నీ
    పదాళి తాండవమ్ము జేసె పంకజాక్ష! "శ్రీ హరీ!
    త్వదీయ పాద తాడనమ్ము తాళజాల నం"చు నీ
    పదమ్ము బట్టి వేడువాని పాలి దైవమైతివా!

    కరుణ కన్నుల నిండియుండగ కంటి నిన్ను గదాధరా!
    మరణ భీతిని నేర్పుతోడను మాపిగావుము శ్రీధరా!
    సిరియు సంపదలిచ్చి మమ్ముల జేరదీయుము దేవరా!
    వరము కోరగ వచ్చినారము, వాంఛితమ్మును దీర్చరా!

    విందు నేత్రములందు రీతిని వెల్గు వానికి మంగళం!
    సుందరమ్ముగ ప్రేమరూపును జూపువానికి మంగళం!
    మందహాసము తోడి శోకము మాపువానికి మంగళం!
    నందనందనుడైనవానిని నమ్ము వారికి మంగళం!

    రిప్లయితొలగించండి
  4. బాలుదతండుగాడు జనపాలుడు పూతనపూతచన్నులన్
    పాలును గ్రోలిగూల్చినకృపాళువు దేవకిముద్దుబిడ్డడున్
    చేలముఫించముoదడువ చెంగునదూకెసరస్సునందునన్
    లీలలునద్భుతంబు,నవలీలగగర్వమడంచెసర్పికిన్!!!

    కాళింది మడుగు నందున
    కాళీయుని మదమడంచ కాలయముండై
    కేళీ వినోది కృష్ణుడు
    కాళీయుని పడగపైన కథకళి సలిపెన్ !!!

    రిప్లయితొలగించండి
  5. కాళియుడను భీకరమౌ
    వ్యాళము కలిగించుచున్న బాధల నెల్లన్
    తాళగజాలక వంశీ(వంశజ)
    నాళంబును దాల్చుఘనుని నమ్మిరి వారల్.

    గోపకులము గావ గోవిందు డలనాడు
    హ్రదము నందు దూకి యహిని బట్టి
    సత్వ మణచి గర్వసంహార మొనరింప
    ఫణములందు దూకి బహుళగతుల.

    తాండవంబు చేసి దానిగర్వము ద్రుంచి
    యభయ మొసగె నహికి నద్భుతముగ
    తన్మయత్వమంది తనవారు, ఖేచరుల్
    జయము బలుకుచుండ శౌరి యపుడు.

    జయము బాలకృష్ణ! శ్యామాంగ! మాధవ
    జయము దానవారి! చక్రధారి!
    జయము వాసుదేవ! సత్సౌఖ్యదాయక!
    సర్వలోకనాథ! జయము నీకు.

    రిప్లయితొలగించండి
  6. శ్రావణ మాసము వచ్చెను
    గోవిందుని జన్మదినపు కూరిమి వేడ్కల్
    మా వీటనుజరిపిం పగ
    భావించితి మొక్క నాడు పదుగుర మొకటై.

    పూజించి చిన్ని కృష్ణుని
    రాజసముగ నుట్టి గొట్టు రమ్యక్రీడన్
    మోజుగ యువకులు పాల్గొన-
    గా జరిపించంగ వలయు ఘనముగ ముదమై.

    అని తలచి బాల కృష్ణుని
    ఘనమగు చిత్రమ్ము కొనగ కలసి హితులతో
    జని చూచితి మంగడిలో
    తనివారగ వెన్నదొంగ తళుకుల బొమ్మల్.

    వెన్న దినెడు బొమ్మ వెలదుల గూడుక
    రాస లీల జేయు రంగు బొమ్మ
    కొండ నెత్తు బొమ్మ గోవుల గాయుచు
    మురళి నూదు బొమ్మ లరసి నాము.

    అన్న తోడ గూడి యాట లాడెడు బొమ్మ
    మన్ను తినగ తల్లి మందలింప
    నోట జగము జూపి మాటలాపిన బొమ్మ
    యసురు జంపు బొమ్మ లటను గలవు.

    ఒక్కెడ కాళీయునిపై
    చిక్కక నాట్యమ్ము సల్పు చిత్రము జూడన్
    మక్కువ గల్గెను నాకట
    పెక్కేలా కొనగ దాని ప్రియమాయె మదిన్.

    సుందరమౌ నగిషీతో
    నందముగా తీర్చి దిద్ది రా పట మెన్నన్
    విందౌను చిన్ని కృష్ణుని
    సుందర నాట్యమ్ము దాన జూడగ మదికిన్.

    జీవ ముట్టి పడెడు శ్రీ కృష్ణ దేవుని
    చిన్ని నగవు మోము శిరసు పైన
    నాట్య మాడు కతన నలిగెడు కాళీయు
    వేదనను గనంగ వేడుకాయె.

    కొని తెచ్చి యా పటమ్మును
    కనువిందుగ జరిపినాము ఘనమౌ వేడ్కల్
    జనులందర మా కృష్ణుని
    జననము జరిగిన దినమ్ము సఖుడా వింటే.

    రిప్లయితొలగించండి
  7. నేమాని పండితార్యా అముద్రితమైన మీ సుందర కావ్యము ముద్రితమెపుడో.

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! మిస్సన్న గారూ!
    శుభాశీస్సులు.
    నావి ముద్రితమైన గ్రంథములు 9. అముద్రితములు సుమారు 6 వరకు ఉన్నవి. ఇప్పుడు విశ్రాంత జీవితము కదా. నాకు నేనుగా ముద్రణ కీయలేను. కాళీయ మర్దనము కావ్యములో వృత్త వైవిధ్యము గర్భ కవిత్వము విరివిగా వాడబడినవి. ఎప్పుడు ముద్రణ కీయగలనో చెప్పలేను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. కాళీయుని పడగలపై
    హేళాగతి నటన మాడ హేలగు నీకున్ !
    కాళీయుని సతులు వేడెను !
    తాళుము బాధిం చకు మిక తాడన మనుచున్ !

    రిప్లయితొలగించండి
  10. నేమాని పండితార్యా మీరుపాసించే భారతే ఆ పని చేయించుకుంటుంది.

    రిప్లయితొలగించండి
  11. హనుమచ్ఛాస్త్రి గారూ,
    కృష్ణశతకంలోని పద్యాన్ని చదివిన అనుభూతి కలిగింది మీ పద్యాన్ని చూస్తే. చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఆహా! ఎంత అద్భుతమైన పద్యాలు! ధన్యోస్మి!
    మీ గ్రంధాలను పిడియఫ్ (ఇబుక్)గా ఇంటర్‌నెట్ లో అందుబాటులో పెడితే్ ఎలా ఉంటుందంటారు?
    *
    లక్ష్మీదేవి గారూ,
    కాళియుని పడగలపై కృష్ణుని నృత్యకేళిని కళ్ళకు కట్టించారు. చక్కని పద్యాలు. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    అద్భుతంగా ఉన్నాయి మీ పద్యాలు. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,.

    ఘనమౌ కాళియమర్దన
    మను పటమును కొనెడి మిషను హరి లీలలఁ జె
    ప్పిన మీ నైపుణ్యమ్మును
    వినుతించెదను మనసార విను మిస్సన్నా!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. బాగుంది. అభినందనలు.
    సతులు ‘వేడిరి’ అనాలి కదా!

    రిప్లయితొలగించండి
  12. " వేడిరి " అని వ్రాసి కొట్టేసి " వేడెను " అని వ్రాసాను " ఏం చేస్తాం ?
    హత........ వి......ధీ ?

    రిప్లయితొలగించండి