22, జులై 2012, ఆదివారం

పద్య రచన - 58


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. వానవిల్లు (నా రచన - సుప్రభాతము అను ఖండ కావ్యమునుండి)

  అన్న ఏమది ఆకసమ్మున అన్ని రంగుల వింతగా
  కన్ను విందగు వానవిల్లులు కాంచుమచ్చట రెండుగా
  ఎన్ని రంగులు వాటిలో గల వేడు నేడు క్రమమ్ముగా
  ఉన్నవందలి యద్భుతంబుల నొప్పుగా వివరింపుమా

  వాన వెలియగ మబ్బుల పట్టు సడలి
  సూర్యదేవుని కిరణాల శోభ హెచ్చి
  ఏడు రంగులలో కంటికింపు గొలుపు
  వానవి ల్లాకసమ్మున కానవచ్చు

  వర్ష జలబిందువులలోన పడుచునుండు
  స్వఛ్ఛమగు కాంతి కిరణమ్ము లద్భుతముగ
  వర్ణ విశ్లేషణముజెంది వన్నె వన్నె
  లీను హరివిల్లుగా ఆకసాన జెలగు

  దినకరున కభిముఖమైన దిక్కునందు
  దూర తీరాల గొప్ప సేతువును బోలి
  కానవచ్చెడు రంగుల వానవిల్లు
  చూచువారల హృదయాలు దోచుకొనును

  సుకవి మనమను గాజు పట్టకమునందు
  భావమను కాంతి కిరణమ్ము పడిన యెడల
  వివిధ రసమయ రమ్య కవిత్వ తత్త్వ
  సార సౌవర్ణ శోభా ప్రసారమగును

  అంబరేశుడు వాహ్యాళి కరుగు వేళ
  సప్త వర్ణ కలిత మహాఛ్ఛత్రమతని
  వెనుక పరిచారకులు పట్టుకొనెడి సరణి
  కానవచ్చును చక్కని వానవిల్లు

  స్వఛ్ఛమగు నంతరంగ భావనలునేని
  మాయలన్ బ్రసరించుచో మలినమగుచు
  విషయ సౌఖ్యాలు గోరుచు వెర్రియగుట
  కద్దు కావున తగిన జాగ్రత్త వలయు

  ఆదినారాయణుని నిర్మలాంశువులును
  శీకర స్పర్శ వర్ణ వైచిత్రి నొందు
  చుండ సామాన్య జీవుల గుండియలును
  రంగు మారుటలో అబ్బురంబు గలదె

  వివిధ వర్ణమ్ములును వానవిల్లునుందు
  సామరస్యమ్ముతో నొప్పు చందమకట
  సకల మతములు బోధించు సారమొకటె
  శాంతియుత సహజీవన సరణియనుట

  క్రమముగా రంగులన్ని చక్రమున పేర్చి
  త్రిప్పుచో కానవచ్చును తెల్లదనమె
  అటులె ఏ మత మార్గములైన గాని
  సత్యపదమునకే జేర్చు సాధకులను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పండితనేమాని వారూ,
   ఎప్పుడో మీరు వ్రాసిన అద్భుతమైన ఖండిక ‘వానవిల్లు’ను చదివి రసాస్వాదన చేసే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
 2. కారు మబ్బులు గగనాన గాను పించె
  నింద్ర ధనువును నాపైన నేర్ప డంగ
  నేడు రంగుల కాంతులు నిను మడిం ఛి
  చూడ నబ్బుర గొలిపెను చోద్య మయ్యి .

  రిప్లయితొలగించండి
 3. సుకవి...., అంబరేశుడు పద్యాలలోని శోభ రంగులీనుతున్నది. సంతోషము.

  రిప్లయితొలగించండి
 4. నా బాల్యము లో హరివింటి నారిని మీటితే వీణ వలె సప్తస్వరములు పలుకుతాయేమొ? భూతలమ్మున మొదలై నింగి కెగసి వంగి భూతలమ్ము తాకిన వింటి నారి భూతలమ్ము వెదికితే కనిపిస్తుందని భ్రమ:

  నింగి హరివింటి నారిని నేను మీటి
  సప్త సుస్వర నాధమ్ము జాలువార
  వినగ భూతలమ్మంతయు వెదకి జూడ
  నారి కనరాదె? దాటిన నాల్గు పదులు!

  రిప్లయితొలగించండి
 5. సప్త వర్ణమ్ము విరజిమ్మె చక్క దనము
  మబ్బు కన్నెల వలయాలు మనసు పడుచు
  విపిన మందున తరువులు వేడ్క మీర
  కాన రాకుండ క్రమ్మెను గగన మమత

  రిప్లయితొలగించండి
 6. సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  ఈ మధ్య మీరు వ్రాసిన పద్యాలలో ఇది ఉత్తమంగా ఉంది. ఉదాత్తమైన భావన. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,.
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘సప్తవర్ణముల్ విరజిమ్మె’ అనాలనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 7. గురువులకు ధన్య వాదములు
  అవును పేపరు మీద బాగానే వ్రాసాను .తీరా టైప్ చేయడం లో పొర బాటు . [ చివరి పాదంలో కూడా ! " గగన మంత అని ఉండాలి ]
  -----------------------------------
  సప్త వర్ణముల్ విరజిమ్మె చక్క దనము
  మబ్బు కన్నెల వలయాలు మనసు పడచు
  విపిన మందున తరువులు వేడ్క మీర
  కాన రాకుండ క్రమ్మెను గగన మంత !

  రిప్లయితొలగించండి
 8. గగనము రంగుల నీనుచు
  సొగసుగ గానంబడియెడు శుభఘడియల, నే
  మిగ మురిపెముగా గంటిని,
  గగన రమణి హారమున్, ధగధగలనీనెన్.

  రిప్లయితొలగించండి
 9. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....
  పండిత నేమావి వారి వానవిల్లు ఖండకృతి కడు రమణీయముగనున్నది. వారికి నా శుభాకాంక్షలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శక్రచాపమ్మునందలి సప్తవర్ణ
  ములు పరావర్తనము జెంది వెలుగు వేరు
  వేరుగా ,దలంపగనొక్క వెల్లనైన
  కాంతియే గద ,వెలయు జగమ్ము నిండ.

  అటులె సర్వజాతులు కూడ నవని నెల్ల
  విస్తరించిన మానవుల్ ,విశ్వకర్మ,
  విశ్వ పాలకు రూపులే వివిధ వర్ణ
  గుణ గణమ్ముల నుందురు గణన జేయ.

  తత్త్వమేదైనగాని,వేదాంత మేల,
  కాంచి రసహేల హృదయమ్ము కందళింప
  వర్ష ఋతు శోభ రెట్టించు హర్ష దాయ
  కమ్ము మఘవ చాపమ్మదే గగనవీథి .

  రిప్లయితొలగించండి
 12. నేమాని పండితార్యా యెంత మనోహరమైన పద్యాలు !

  రిప్లయితొలగించండి