23, జులై 2011, శనివారం

చమత్కార పద్యాలు - 109 A (ప్రహేళిక సమాధానం)

మ.
చవితిన్ షష్ఠజుఁ డేగి, పంచమపతిస్థానంబు లంఘించి, యే
డవవాఁ డేలిన వీడుఁ జేరి, పదిలుండై యష్టమస్యందనో
ద్భవి వీక్షించి, తృతీయు చెంతకుఁ జతుర్థశ్రేణి నంపించి, యా
ది విరోధిన్ బెదరించి, యప్పురి ద్వితీయున్ నిల్పి వచ్చెన్ వెసన్.

వివరణ -
ఈ పద్యంలోని అర్థాలలి అష్టదిక్పాలురతో (1. ఇంద్రుడు, 2. అగ్ని, 3. యముడు, 4. నిరృతి, 5. వరుణుడు, 6. వాయువు, 7. కుబేరుడు, 8. ఈశానుడు.) సంబంధం ఉంది.
చవితినాడు
షష్ఠజుడు (దిక్పతులలో ఆరవవాడైన వాయువు కుమారుడైన ఆంజనేయుడు) బయలుదేరి,
పంచమపతి స్థానం (ఐదవవాడైన వరుణుని స్థావరమైన సముద్రాన్ని) లఘించి,
ఏడవవా డేలిన నగరం(ఏడవవాడైన కుబేరుడు పాలించిన లంకానగరం) చేరుకొని,
అష్టమ (ఎనిమిదవవాడైన ఈశ్వరుని) స్యందన (వాహనమైన భూమికి) ఉద్భవి (జన్మించిన సీత)ను చూచి, తృతీయుని (మూడవవాడైన యముని) వద్దకు
చతుర్థ శ్రేణిని (నాల్గవవాడైన నిరృతి పరివారమైన రాక్షసులను) పంపించి,
ఆది విరోధిని (మొదటివాడైన ఇంద్రుని శత్రువైన రావణిని) బెదరించి,
ఆ లంకానగరంలో ద్వితీయుని (రెండవవాడైన అగ్నిని) నిల్పి [కాల్చి]
వేగంగా తిరిగివచ్చాడు.
గన్నవరపు నరసింహ మూర్తి, కోడీహళ్ళి మురళీమోహన్ గారలు సరియైన సమాధానలు పంపారు.
వారికి అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి