29, జులై 2011, శుక్రవారం

సమస్యా పూరణం -409 (బంజరు భూములు దొరకవు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్.
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

  1. ఏం జనమో ! యిటు పెరిగిన
    అంజనములు వేసి వెదుక హైదరబాదున్
    రంజుగ రియలె స్టేటున
    బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్ !

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    శాస్త్రీజీ ! బావుంది !

    01)
    ___________________________________

    వ్యంజితమది యెల్లరకును
    జంజాటం బెక్కు వయ్యె ! - జాదూ గాళ్ళే
    నంజుకొనగ నిండుకొనెను !
    బంజరు భూములు దొరకవు - పదికోట్లన్నన్!
    ___________________________________
    జాదూ గాళ్ళూ = మాయగాళ్ళు
    మాయగాళ్ళు = మంత్రులు అధికారులు మొదలగువారు

    రిప్లయితొలగించండి
  3. 02)
    ___________________________________

    లంజల పుత్రులు కొందరు
    జంజీర్లే వేనవేలు - సలిపిన పిదపన్ !
    గింజుకొనగ నేమి ఫలము ?
    బంజరు భూములు దొరకవు - పదికోట్లన్నన్!
    ___________________________________
    లంజ = లక్ష్మి
    జంజీర్‌ = గొలుసు-సంకెల = దురాక్రమణ చేసి కంచె వేయుట

    రిప్లయితొలగించండి
  4. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జులై 29, 2011 8:41:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    గింజలు సైతము మొలవని
    బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్
    రంజిల్లెడు గృహకూటమి
    పంజరములవోలె కట్టి ప్రజలందుండన్

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ రంజింపజేసింది. అభినందనలు.
    ‘ఏం జనమో’ అనే వ్యావహారికి రూపాన్ని మార్చలేమా?
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    ‘జంజీరుల వేనవేలు చక్కగ నిలుపన్’ అంటే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  6. శ్రీపతి శాస్త్రి గారూ,
    అపార్ట్‍మెంట్ వ్యవస్థను చక్కగా పూరణలో వినియోగించుకున్నారు. పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మాస్టరు గారూ ! ధన్యవాదములు. మీ సూచన పై చిన్న సవరణ ...
    కిశోర్ జీ ! ధన్యవాదములు.మీ రెండుపూరణలు బాగున్నాయి.
    శ్రీపతి శాస్త్రి గారూ ! మంచి పూరణ .

    పంజా విప్పెను దందా
    అంజనములు వేసి వెదుక హైదరబాదున్
    రంజుగ రియలె స్టేటున
    బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్ !

    రిప్లయితొలగించండి
  8. పంజా విప్పిన జనన ప్ర
    భంజన మది చూడ నింక భావి జనులకున్
    గంజియు దొరుకున? భువిపై
    బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా ! చక్కని సవరణ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  10. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటిపాదంలో ‘జననప్ర’అన్నప్పుడు సమాసాంతర్గతమైన ‘న’గురువై గణదోషం వస్తున్నది. ‘జనుల ప్ర’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  11. సంజయుఁడనువాఁడొకపరి
    బంజరు భూములనుఁ నమ్మ బలుకుచు నమ్మెన్
    రంజనికి; పెరిగి నేడా
    బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్ !

    రిప్లయితొలగించండి
  12. మిత్రుల పూరణలు సుందరముగా యున్నాయి,


    శ్రీ కృష్ణ రాయబార సందర్భములో కృష్ణునితో దుర్యోధనుడు :

    కొంజకఁ గొనుటకుఁ బోయిన
    బంజరు భూములు దొరకవు పది కోట్లన్నన్
    కంజాతాక్షుడ ! సున్నయె
    కుంజర యూధులకు ధరయు కురు రాజ్యములో !!!

    కొంజు = సంశయించు , కంజాతము = పద్మము

    రిప్లయితొలగించండి
  13. నాలుగవ పాదములో టైపాటు


    కుంజర యోధులకు ధరయు కురు రాజ్యములో

    రిప్లయితొలగించండి
  14. మందాకిని గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. కంజాక్షి! ఆంధ్ర ధారుణి-
    కిం జనిన హిరణ్యగర్భు కింకర మూకల్
    పంజా విప్పుట గననగు,
    బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్!

    రిప్లయితొలగించండి
  16. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, జులై 29, 2011 11:10:00 PM

    పంజాగుట్టన నైనను
    పంజాబుననైననేమి ప్రతియొకచోటన్
    పుంజిగ సెజ్జులు పెరిగిన
    బంజరభూములు దొరకవు పదికోట్లన్నన్

    పుంజిగ = సంవృద్ధిగ

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్న గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ‘పంజాగుట్ట, బంజారాహిల్స్’ నేపథ్యంతో ఎవరూ పూరణలు చేయలేదు. నేను చేద్దామనుకునే లోగా మీరు చేసారు. సంతోషం. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రు లెవరూ గంజాయిని స్పృశించ లేదే !

    ఒక రాజకీయపు రాజప్ప మరో యొడ్డన్నతో ;

    గంజాయి విక్రమంబున
    సంజనితము లైన సిరులు సంపద లొడ్డీ
    భంజింపక రైతన్నల
    బంజరు భూములు దొరకవు పది కోట్లన్నన్ !!!

    రిప్లయితొలగించండి
  19. డా. మూర్తి మిత్రమా! "గంజాయి త్రాగి తురకల, సంజాతమున..." అనే పధ్ధతిలో వ్రాశాను. కానీ మన వికటకవి తెనాలి రామకృష్ణ కవి గారి మీద గౌరవంతో వేయలేదు. అది మీరందుకొని వేసినట్లు గా వున్నది. ధన్యోహం, మిత్రమా.
    మిగతా మిత్రుల పూరణలు అద్భుతం. నేను అనుకొన్న ఐడియాలన్నీ దాదాపుగా పూరణలలో కనిపించాయి. సంతోషము.

    రిప్లయితొలగించండి
  20. మిత్రులు చంద్రశేఖరుల వారికి కృతజ్ఞతలు. ఆశ పెట్టి వారు మొన్న మా పల్లెకు వచ్చినప్పుడు చంద్ర భాసురము తీసుకు రాలేదు. అయినా నేను మీ అందఱికీ కలంజము సమర్పించు కొంటున్నాను !!

    రిప్లయితొలగించండి
  21. తెచ్చాను సార్, మీకిద్దామనే, దారిలో పల్లెపడుచు కనిపించి, నా దగ్గర వున్నవన్నీ దోచుకొంది. దాని దగ్గర గుఱ్ఱ౦ కూడా వుంది. భయ"చివరకు మిగిలింది" మీ దగ్గరకు వచ్చింది. అది నేనే :-)

    రిప్లయితొలగించండి
  22. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    గంజాయిపై మీ పూరణ బాగుంది.అభినందనలు.
    ‘విక్రయంబున’ టైపాటువల్ల ‘విక్రమంబున’ అయినట్లుంది ..?

    రిప్లయితొలగించండి
  23. గురువు గారూ మన్నించాలి . చూసారా గంజాయి విక్రమము !

    గంజాయి విక్రయంబున
    సంజనితము లైన సిరులు సంపద లొడ్డీ
    భంజింపక రైతన్నల
    బంజరు భూములు దొరకవు పది కోట్లన్నన్ !

    రిప్లయితొలగించండి
  24. పంజాబు ప్రభుత మారగ
    జంజాటము జేసి నేడు జగడము లాడన్
    గంజాయి నాటుకొనుటకు
    బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్

    రిప్లయితొలగించండి
  25. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. మంజుల వాణీ వినవే!
    జంజాటమ్మేల మనకు జనప్రియ చాలున్!
    తంజావూరపు నళినీ!
    బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్!


    బంజరు భూములు = బంజారా హిల్సు ఎస్టేట్లు

    రిప్లయితొలగించండి