5, జులై 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 95 (షాదిక్షాంత పద్యములు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 39
సమస్యలు పూర్తయ్యాక ‘ష’ అనే అక్షరంతో ప్రారంభించి, ‘క్ష’ అనే అక్షరంతో ముగిస్తూ కొన్ని కందపద్యాలను శ్రీరామస్తవంగా చెప్పమని రాజు కోరాడట. అప్పుడు వెంకన్న కవి చెప్పిన పద్యాలు ...
షాదిక్షాంత కంద పద్యాలు

షాక్షర మాదిగఁ జెప్పెద
నీ క్షణమునఁ గందపద్యనివహము వరుసన్
వీక్షింపర దయతో నిటు
రాక్షసహర! రామ! మోక్షరామాధ్యక్షా!

షడ్రాజన్యాంబరయుత
రాడ్రతవర్గస్తుతామరస్సరసీజా
తేడ్రుడ్యాగారపరి
వ్రాడ్రీవర! రామ! మోక్షరామాధ్యక్షా!

షణ్మిధునాంభస్సంభవ
రాణ్మానిత నూత్నరత్న రాజన్మకుటో
ద్యన్మండితాంతరీక్ష! వి
రాణ్మూర్తీ! రామ! మోక్షరామాధ్యక్షా!

షట్పదలసితోద్యస్మిన్
త్రిట్పదలాంగప్రకాశధీరాజిత! గ్రా
జట్పదజటిపటనానా
రాట్పూజిత! రామ! మోక్షరామాధ్యక్షా!

వెంకటగిరి రాజు వెంకన్న కవి పాండిత్యాన్నీ, ఆశుధారాపాటవాన్నీ, సమయస్ఫూర్తినీ, చాతుర్యాన్నీ మెచ్చుకొని నూటపదార్లు బహుమానమిచ్చి, పట్టుబట్టలు పెట్టి సత్కరించాడట!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
‘షాదిక్షాంత కందపద్యాన్ని’ (ఇష్ట) దైవస్తుతిపరంగా వ్రాయవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

32 కామెంట్‌లు:

 1. షండులె నీముందందరు
  నుండగ నువు పరమ పురుష నుర్విని రామా!
  పండుగ మాకగు నాడే
  నిండుగ నీ కరుణ నిడగ, నిగమాధ్యక్షా !!

  రిప్లయితొలగించండి
 2. షండులె నీముందందరు
  నుండ రమధవ! నిజ పురుష! నుర్విని శ్రీశా !
  పండుగ మాకగు నాడే
  నిండుగ నీ కరుణ దడువ, నిగమాధ్యక్షా !!

  రిప్లయితొలగించండి
 3. షణ్మత సంస్థాపకుడవు !
  మృణ్మయమగు మూఢజనుల మేధస్సుకు సం
  విన్మహిమ గూర్చు నో యతి
  రాణ్మణి ! నిను గొల్తు శంకరా ! మృదు వీక్షా !!!

  రిప్లయితొలగించండి
 4. షణ్ముఖునినిఁగన్న జనని
  మృణ్మయ రూపునిఁ, విఘాతమెల్లెడఁ దానీ
  షణ్మాత్రకరుణఁ బాపెడు
  షణ్ముఖు ననుజుడనుఁ గన్న సతి మాకికరక్ష!

  షట్పదినై నేఁ విభునిన్
  షట్పాదమ్ముల పదములఁ సద్భక్తిఁ బాడన్
  లోట్పాట్లెంచక, మెచ్చుచు
  షట్పాపములున్ దొలగగఁ సమ్మతి నిడురక్ష!

  రిప్లయితొలగించండి
 5. చిన్న సవరణ ....పై పూరణ లో రమాధవ అని ఉండాలనుకుంటా..

  షండులె నీముందందరు
  గండర గండ ! పురుష ! మరి గతి నీవేగా !
  పండుగ మాకగు నాడే
  నిండుగ నీ కరుణ దడువ, నిగమాధ్యక్షా !!

  రిప్లయితొలగించండి
 6. షట్పాపములు - అరిషడ్వర్గ ప్రభావముతో చేసే పాపములు.

  రిప్లయితొలగించండి
 7. షట్కాలంబులలోన వ
  షట్కారుడవైన నిన్ను స్మరియింతు ; ద్విషత్
  షట్కము నదలింపగ , నా
  షట్కర్మములందు గొలుతు , జయ ! నిటలాక్షా !!!

  (శంకరశ్శంకర స్సాక్షాత్ ....కాబట్టి యిదీ ఆ శంకరాచార్యులకే !!! )

  రిప్లయితొలగించండి
 8. షణ్ముఖ జనకా ! నిను యీ
  షణ్మాత్రము మరువలేను శైలజ వినుతా !
  ఉన్మాదిని భక్తి వలన ;
  జన్మము ధన్య మొనరించు శైలాధ్యక్షా !

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీరు ముచ్చటగా మూడవసారి వ్రాసిన పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.

  డా. విష్ణు నందన్ గారూ,
  ఆదిశంకరుల స్తుతించిన మీ రెండు పద్యాలూ మనోహరంగా ఉన్నాయి. ధన్యవాదాలు.

  మందాకిని గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  మొదటి పద్యం మొదటి పాదం ‘షణ్ముఖుని గన్న జననివి’ అందాం.
  రెండు పద్యాల చివరిపాదాలు లఘువుతో అంతమౌతున్నాయి. అక్కడ తప్పక గురువుండాలని కదా నియమం. పురుషదైవాన్ని ఎన్నుకుంటే ఈ ఇబ్బంది తప్పేది.

  రిప్లయితొలగించండి
 10. నాగరాజు రవీందర్ గారూ,
  ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జులై 05, 2011 2:43:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  షష్టికి పూజలు జేసెద
  నిష్టముగా స్వామి మీకు నీస్వర పుత్రా
  శిష్టుడ నే దయజూడుము
  కష్టములను బాపుమయ్య కమలదళేక్షా

  రిప్లయితొలగించండి
 12. షణ్ముఖునినిఁగన్న జనని,
  మృణ్మయ రూపునిఁ- విఘాతమెల్లెడఁ దాఁనీ
  షణ్మాత్రకరుణఁ బాపెడు
  షణ్ముఖు ననుజుడనుఁ గన్న సతికినుపేక్షా?
  (సతికిన్ + ఉపేక్షా?)


  షట్పాదమ్ముల పాడెద
  షట్పది! నీ పదములనెడఁసద్గతి నిమ్మా!
  లోట్పాట్లెంచక, మెచ్చుచు
  షట్పాపములున్ దొలగగఁ సమ్మతి -మదపేక్షా!
  (మత్ + అపేక్షా!)

  రిప్లయితొలగించండి
 13. అందరి పూరణలూ ప్రశంసార్హమైనవి . శంకరయ్యగారు చెప్పినట్లు , హనుమచ్ఛాస్త్రి గారి పూరణ చక్కగా ఉంది .
  నాగరాజు రవీందర్ గారూ , నిను నీషణ్మాత్రము అనండి సరిపోతుంది .అక్కడ యడాగమం రాదు కనుక.
  శ్రీపతి శాస్త్రి గారూ , షష్టికి (అరవై ) , షష్ఠి (ఆరు ) కీ తేడా ఉంది కదా , ఇక్కడ షష్ఠి అయితే సరిపోతుంది .
  మందాకిని గారూ , షణ్ముఖుని అంటే చాలు కదా , షణ్ముఖునిని అంటే ఒక ని ఎక్కువవుతుంది . షణ్ముఖుడు - ప్రథమా , షణ్ముఖుని - ద్వితీయా విభక్తులు .
  లోట్పాట్లెంచక ప్రాసకోసం చేసిన సవరణా ? అలా అయితే కూడదు కదా ! చివరి పాదంలో కొంచెం గణభంగం జరిగినట్లుంది . గమనింపగలరు .

  పనిలో పని , ఒక పురాణ ప్రసంగం . ఇంతకీ గణపతి , కుమారస్వామి కి అనుజుడా ? అగ్రజుడా ? ఇందులో కొన్ని ప్రాంతీయ భేదాలున్నాయి .పురాణాలలోని సంబంధ బాంధవ్యాలను తఱచి చూడడం తేనెతుట్టెను కదపడమే కదా !!!

  రిప్లయితొలగించండి
 14. విష్ణునందన్ గారూ, ధన్యవాదములు.
  గురువు గారు సవరణ చెప్పాక షణ్ముఖుడనుగన్న జనని అని రాద్దాం అనుకుని మరిచాను.
  ఇక చివరిపాదం గణదోషం నేను గమనించుకోనే లేదు. కృతజ్ఞురాలను.
  షట్పాపములున్ దొలగగఁ సమ్మతియె -మదపేక్షా! అంటే సరిపోతుందనుకుంటాను.
  లోట్పాట్లలో లోటు గురించి మీరు చెప్పింది ఒప్పుకుంటాను. కొన్ని పదాలు ఇలా గణగణన కోసం అన్నట్టు కలిసిపోయి రావటం చూసి ఒక ప్రయోగం చేశాను. తప్పే.
  ఇక తేనె తుట్టె కదిపే సాహసం ( పురాణాలపై చక్కటి అవగాహన ఉన్న పండితులే శలవివ్వాలి.
  శ్రమ తీసికొని తప్పులు ఎంచి చూపినందుకు కృతజ్ఞురాలను.

  రిప్లయితొలగించండి
 15. షట్పాపములున్ దొలగగఁ సమ్మతియె -మదపేక్షా! అంటే సరిపోదు. తప్పే అవుతుంది.

  రిప్లయితొలగించండి
 16. ( స్వగతం ): ఈ యడాగమంతో పెద్ద చిక్కే వచ్చి పడింది !

  రిప్లయితొలగించండి
 17. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  01)
  ________________________________

  షండకము న్పూరించుచు
  దండు నుత్సాహ పరచు - దైవమ రావే !
  చెండాడుచు ధూర్తుల నిల
  యండగ నుండుము జనులకు - యదుకుల రక్షా !
  ________________________________

  రిప్లయితొలగించండి
 18. డా. విష్ణు నందన్ గారూ,
  మీకు తీరిక దొరకడం మా అదృష్ణం. కవి మిత్రుల పూరణలను పరిశీలించి సవరణలను తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
  డా. విష్ణు నందన్ గారి వ్యాఖ్యను గమనించారు కదా!

  మందాకిని గారూ,
  ‘షట్పాపములున్ దొలగఁ బొసఁగు -మదపేక్షా!’ అందాం.

  రిప్లయితొలగించండి
 19. శంకరార్యా !
  "-‘ష’ అనే అక్షరంతో ప్రారంభించి, ‘క్ష’ అనే అక్షరంతో ముగిస్తూ - "
  అన్నారుగదా ! మరి చివరి అక్షరం" క్ష "అయితే తప్పేమిటి ?

  అక్కడ తప్పక గురువుండాలని నియమం ఎక్కడుంది ?

  రిప్లయితొలగించండి
 20. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  01 అ)
  ________________________________

  షండకము న్పూరించుచు
  దండును నడిపించి నట్టి - దైవమ రావే !
  చెండాడుచు ధూర్తుల నిల
  యండగ నుండుము జనులకు - యదుకుల రక్షా !
  ________________________________

  రిప్లయితొలగించండి
 21. షడక్షరిని సదా నేనిక
  విడువక జపియింపఁ దలచితి, విభుడగు నీశున్
  విడి, నేఁ, మనజాలనికన్
  నడిపించవయా దయగొను నా నిటలాక్షా!

  కందపద్యాల్లో చెప్పమన్నారు కదా, కంద పద్యం రెండో పాదము గురువు తోనె ముగించాలికదా! వసంతకిశోర్ గారు,

  రిప్లయితొలగించండి
 22. ఓం తో కలిపి పంచాక్షరిని షడక్షరి అంటారని ఆంధ్రభారతి నిఘంటువు చెపుతోంది.

  రిప్లయితొలగించండి
 23. వసంత కిశోర్ గారూ,
  ‘తెనాలి రామకృష్ణ’ చిత్రంలో పెద్దన రామకృష్ణుణ్ణి "మంచి పట్టే పట్టావు మనుమడా!" అన్న మాట గుర్తుకు వచ్చింది. అవి షాదిక్షాంత (క్షా + అంత) పద్యాలు కదా! అడిగింది కందపద్యం. పాదాంతమున గురువుండాలి కదా. వివరణలో ‘క్షా’ అనే అక్షరంతో అని ఇవ్వాల్సింది. ధన్యవాదాలు.
  ఇక మీ ఫూరణ బాగుంది. ‘షండకము = శంఖము’ ఎక్కడ దొరికింది?
  అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. మందాకిని గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  కానీ మొదటి పాదంలో బేసి గణంగా ‘షడక్ష’ జగణం వేసారు. రెండవ పాదంలో గణదోషం ఉంది. అక్కడ ‘దలచితు’ - దలతు అంటే సరిపోతుంది. కాని మొదటి పాదాన్ని ఏం చేద్దాం"

  రిప్లయితొలగించండి
 25. శంకరార్యా ! ధన్యవాదములు !

  శంకరార్యా ! అలానే ఎందుకనుకోవాలి ?

  ష + ఆది + క్ష + అంత = షాదిక్షాంత - అనుకోవచ్చుగా !

  రిప్లయితొలగించండి
 26. శంకరార్యా ! మన్నించాలి !
  కందపద్యం చివరి అక్షరం గదా ! దీర్ఘమే ఉండాలి !

  మందాకినిగారూ ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 27. గురువుగారూ, క్ష, క్ష కు ముందక్షరము లఘువు కాదా? షడక్షరి - నలము గా భావించి రాశాను.

  రిప్లయితొలగించండి
 28. పద్యాల గురించి మరింత సమాచారం తెలుసుకొనుటకు ఈ క్రింది లింకుని చూడండి.
  http://www.samputi.com/launch.php?m=home&l=te

  రిప్లయితొలగించండి