22, జులై 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 109 (ప్రహేళిక)

మ.
చవితిన్ షష్ఠజుఁ డేగి, పంచమపతిస్థానంబు లంఘించి, యే
డవవాఁ డేలిన వీడుఁ జేరి, పదిలుండై యష్టమస్యందనో
ద్భవి వీక్షించి, తృతీయు చెంతకుఁ జతుర్థశ్రేణి నంపించి, యా
ది విరోధిన్ బెదరించి, యప్పురి ద్వితీయున్ నిల్పి వచ్చెన్ వెసన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
ఎవరికైనా సమాధానం తెలుసా?
తెలిస్తే క్రింది చిరునామాకు మెయిల్ పెట్టండి.
shankarkandi@gmail.com

5 కామెంట్‌లు:

 1. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ సమాధానం నూటికి నూరు పాళ్ళూ సరి యైనది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 2. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
  మీ సమాధానం సరియైనది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య (22-7-2011. 9.55 am)

  ప్రహేళిక సమాధానము;
  అష్ట దిక్పాలకులు (1) ఇంద్రుడు (2)అగ్ని (3) యముడు (4)నైరృతి (5)వరుణుడు (6) వాయువు (7) కుబేరుడు (8) ఈశ్వరుడు
  వాయుదేవుని కుమారుడు ఆంజనేయుడు సముద్రము దాటి లంకకు చేరి ఈశ్వరుని రథమయిన భూదేవి కూతురు సీతమ్మ వారిని దర్శించి యముని వద్దకు రాక్షసులను ( నైరృతులను ) పంపించి ,ఆ పురికి నిప్పు పెట్టి వచ్చాడు. చక్కని రామాయణ గాధ.

  రిప్లయితొలగించండి
 4. కోడీహళ్లి మురళీమోహన్ గారి వ్యాఖ్య (22-7-2011, 8.16 pm) ...

  షష్ఠజుడు = హనుమంతుడు (దిక్పాలకులలో ఆరవ వాడు = వాయువు)
  పంచమపతిస్థానము = సముద్రము (పంచమ = వరుణుడు)
  ఏడవవాఁ డేలిన వీడు = లంక (ఏడవవాడు = కుబేరుడు)
  అష్టమస్యందనోద్భవి = సీత (అష్టమ = ఈశ్వరుడు)
  తృతీయుడు = యముడు
  జతుర్థశ్రేణి = రాక్షసులు (చతుర్థ = నిరుతి
  ఆది విరోధి = రావణుడు (ఆది = ఇంద్రుడు)
  ద్వితీయుడు = అగ్ని

  రిప్లయితొలగించండి
 5. మూర్తిగారికి అభినందనలు !
  మోహన్ గారికి అభినందనలు !

  రిప్లయితొలగించండి