24, జులై 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 110 A (ప్రహేళిక సమాధానం)

కం.
అంచిత చతుర్థజాతుఁడు
పంచమమార్గమున నేఁగి ప్రథమతనూజన్
గాంచి, తృతీయం బప్పురి
నించి, ద్వితీయంబు దాఁటి, నృపు కడ కరిగెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
వివరణ -
ఈ పద్యంలోని అర్థాలకు పంచభూతాలతో (1. భూమి, 2. నీరు, 3. అగ్ని, 4. వాయువు, 5. ఆకాశం) సంబంధం.
చతుర్థజాతుడు (నాల్గవదైన వాయువు కుమారుడైన ఆంజనేయుడు) పంచమమార్గమున (ఐదవదైన ఆకాశమార్గంలో) వెళ్ళి, ప్రథమతనూజన్ (మొదటిదైన భూమి కుమార్తె అయిన సీతను) చూచి, ఆ లంకాపురిలో తృతీయాన్ని (మూడవదైన అగ్నిని) నింపి, ద్వితీయంబు (రెండవదైన నీటిని అంటే సముద్రాన్ని) దాటి, రాముని వద్దకు వెళ్ళాడు.
మందాకిని, గన్నవరపు నరసింహ మూర్తి, ఊకదంపుడు గారలు సరైన సమాధానాలు పంపారు.
అందరికీ అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి