17, జులై 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 107 (ప్రహేళిక)

సీ.
ఏమిచేయక వృథా యేటి నీ రేగును?
భూపాలుఁ డేటికిఁ బుట్టు వొందు?
తుంగముస్తెల ప్రీతి తొలఁకాడు వేనికి?
సభవారి నవ్వించు జాణ యెవఁడు?
కలహంస నివసించు కాసార మెయ్యది?
వీరుఁ డెద్దానిచే విజయ మందు?
లజ్జ యెవ్వరి కమూల్యపు టలంకారంబు?
దేవాంగులకు దేన జీవనంబు?
తే. గీ.
అన్నిటికిఁ జూడ నైదేసి యక్షరమ్ము
లొనర నిరుదెసఁ జదివిన నొక్క తీరె
చెప్పఁగల్గిన నే నిత్తు జిన్నమాడ
చెప్పలేకున్న నవ్వుదుఁ జిన్ని నవ్వు.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

5 కామెంట్‌లు:

 1. కట్టకట్టక - నేలనేలనే - కిటికోటికి - వికటకవి - సుర సరసు - చేతి హేతిచే - కుల స్త్రీలకు - నేత చేతనే

  రిప్లయితొలగించండి
 2. అజ్ఞాత గారికి అభినందనలు

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్రి గారి వ్యాఖ్య .....

  శంకరార్యా ! నమస్కారములు. జన్మదిన శుభా కాంక్షలు.
  ఈ ప్రహేళిక సమాధానములు కూడా పెద్దబాలశిక్ష లో చదివినవే. చిత్తగించండి.

  ఏమిచేయక వృథా యేటి నీ రేగును? = కట్టకట్టక
  భూపాలుఁ డేటికిఁ బుట్టు వొందు? = నేలనేలనే
  తుంగముస్తెల ప్రీతి తొలఁకాడు వేనికి? = కిటికోటికి
  సభవారి నవ్వించు జాణ యెవఁడు? = వికటకవి
  కలహంస నివసించు కాసార మెయ్యది? = సురసరసు
  వీరుఁ డెద్దానిచే విజయ మందు? = చేతిహేతిచే
  లజ్జ యెవ్వరి కమూల్యపు టలంకారంబు?= కులస్త్రీలకు
  దేవాంగులకు దేన జీవనంబు? = నేతచేతనే

  రిప్లయితొలగించండి
 4. మిత్రు లందరికీ నమస్కృతులు.
  ఇదికూడా నిన్నటి ప్రహేళిక వలనే ప్రసిద్ధమూ, సర్వవిదితమూ.
  అందువల్ల ప్రత్యేకంగా సమాధానాల పోస్ట్ పెట్టడం లేదు.
  సమాధానాలు పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి, అజ్ఞాత గారలకు అభినందనలు.

  వసంత కిశోర్ గారికి అజ్ఞాత అంటే మూర్తి గారే గుర్తుకు వస్తున్నారు. పాపం! మూర్తి గారు పై ‘అజ్ఞాత’ తాము కాదన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి అజ్ఞాత గారికి అభినందనలు తెలుపుకోవలసి వచ్చింది.

  రిప్లయితొలగించండి