18, జులై 2011, సోమవారం

సమస్యా పూరణం -397 (కవితాతత్త్వమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కవితాతత్త్వమ్ము నడ్డగాడిద లెఱుఁగున్.

22 కామెంట్‌లు:

  1. ఎవరికి సాయము చేయదు
    ధవునికి సేవన్నమాట దరిజేర్చదుగా!
    అవగుణములతో నొప్పెడు
    కవితాతత్త్వమ్ము నడ్డగాడిద లెఱుఁగున్!!

    రిప్లయితొలగించండి
  2. రవి గాననివే చూచెడి
    కవితాతత్త్వమ్ము నడ్డగాడిద లెఱుఁగున్!
    కవినే కపియని చులకన
    గవమానము జేయ జూడ గాడిద లేగా !!

    రిప్లయితొలగించండి
  3. చంద్రశేఖర్ పూరణ:
    కవి విశ్వనాధ యెరుగును
    కవితాతత్త్వమ్ము; నడ్డగాడిద లెఱుఁగున్
    కవిస మ్రాట్టులఁ దూరుట
    కవి హృదయమెరుంగు ప్రజ్ఞ గానని కుమతుల్!

    రిప్లయితొలగించండి
  4. కవికులమంతయు మెచ్చగఁ
    కవనములనుఁజేయవచ్చు. కవిహృదయముతో
    కవియగు గురువుల సేవలఁ
    కవితాతత్త్వమ్ము నడ్డగాడిదలెఱుఁగున్.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________

    రవి గాంచని చోటుండిన
    కవి గాంచు ననెడు నుడుగును - కన్నడ జేయన్
    కవితా రీతులు, మారిన
    కవితా తత్త్వమ్ము నడ్డ - గాడిద లెఱుఁగున్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  6. శ్రవణంబుల పరమార్ధము
    కవితాతత్వమ్ము, నడ్డగాడిద లెఱుఁగున్
    భువనమ్ముల మేల్కొల్పుట
    భవహరు జన్మంబునందు, వసుదే వెఱుఁగున్ !

    రిప్లయితొలగించండి
  7. అవినీతి దొరల మలినపు
    కవితాతత్వమ్ము నడ్డగాడిద లెఱుగు
    న్నవియే భువి భారతమున
    సవితునిసాక్షిగ పదవుల సరసనజేరెన్!

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, జులై 18, 2011 3:23:00 PM

    అవమానించెడి పదములు,
    కవితావస్తుత్వమెందు?? గానగ మనస
    త్కవులే మెచ్చని నేటి,కు
    కవితాతత్వమ్మునడ్డ గాడిద లెరుగున్.

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, జులై 18, 2011 3:55:00 PM

    చిన్న సవరణ.

    అవమానించెడి పదముల,
    కవితావస్తుత్వమెందు గానగ, విద్వ
    త్కవులే మెచ్చని నేటి,కు
    కవితాతత్వమ్మునడ్డ గాడిద లెరుగున్.

    రిప్లయితొలగించండి
  10. శ్రీపతిశాస్త్రిసోమవారం, జులై 18, 2011 8:43:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    కవితలు జెప్పుచు కుకవులు
    భువిపై వెదజల్లినారు పుస్తకములనున్
    అవి తినె ఖరముల మందలు
    కవితా తత్వంబు నడ్డగాడుదులెరుగున్

    రిప్లయితొలగించండి
  11. అవమానము, నభిమానము
    భువి జీవాత్మలకు నంట బోదను నిజమున్
    యవధూతల వలె చెప్పును
    కవితా ! తత్త్వమ్ము నడ్డగాడిద లెఱుఁగున్.

    రిప్లయితొలగించండి
  12. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి. మిస్సన్న గారూ మీ పూరణ అద్భుతముగా ఉంది

    నా మరో ప్రయత్నము :

    భువన విజయమున గనవలె
    కవితా తత్వమ్ము, నడ్డగాడిద లెఱుఁగున్
    అవిధేయత బుధవర్యుల !
    కవివర్యుల ప్రకట మవవె ఘన రాజ్యములున్ !

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘అవగుణాల కవిత్వమా’? .. మొదటి పూరణ బాగుంది.
    రెండవ పూరణ కూడ బాగుంది.‘చులకనగ(న్)+అవమానము’ ఇక్కడ సంధి దోషం.
    ’.....చులకన
    నవమానము జేయ జూడ నగు గాడిదలే !! ’ అందాం.

    రిప్లయితొలగించండి
  14. చంద్రశేఖర్ గారూ,
    అత్యుత్తమమైన పూరణ మీది. అభినందనలు. నిజమే .. విశ్వనాథ వారిని చులకన చేసి మాట్లాడే ‘అడ్డ గాడిదలు’ మా క్లాస్ మేట్లే కొందరుండేవారు.
    ‘మనతెలుగు’ ద్వారా మీ ‘చిత్రకూటాన్ని’ దర్శించాను. బాగుంది.

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా ! సొగసైన సవరణ చేసిన మీకు ధన్యవాదములు.
    మొదటి పూరణ లో అవగుణాలతో యొప్పు కవిత అనే ఆమె గురించి ఏ అడ్డ గాడిదనడిగినా చెప్తాడని నా భావం.

    రిప్లయితొలగించండి
  16. మందాకిని గారూ,
    గురుసేవతో అడ్డగాడిదలైనా కవితాతత్త్వాన్ని తెలిసికొంటారన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘వసుదేవుడు + ఎఱుగున్’ సంధి కుదరలేదు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    కువిత్వాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    కవితా సంకలనాలను తిన్న గాడిదల పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ ధన్యవాదాలు.
    మూర్తి మిత్రమా ధన్యవాదాలు. మీ పూరణలు చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  18. మాస్టారూ, ధన్యవాదాలు. మనతెలుగు ద్వారా చిత్రకూటాన్ని దర్శించినందులకు నేను కృతజ్ఞుడనయ్యాను. నా బాల్యం అంతా 'చిత్రకూటాశ్రమం" అనే పదిళ్ళ లోగిలిలోనే జరిగింది. దానిని రామాయణం శాస్త్రులు గారని, అసాధారణ సంస్కృత పండితులు నిర్వహించారు. వారు సంస్కృతంలో రామాయణానికి వ్యాఖ్యానం వ్రాసి, ప్రజల కోరిక మేరకు తెలుగులోకి అనువదించారు. ఆ గుర్తుగానే 'చిత్రకూటం' అని బ్లాగుకి పేరుపెట్టాను. ఇప్పుడే ఆరంభ దశలో వుంది. ఇంకా చాలా అలంకరించాలి. మీ అందరి ఆశీస్సులూ కావాలి.

    రిప్లయితొలగించండి
  19. అవియివి యనకనె చవటలు
    చవిలేని పదముల గూర్చి చంపుకు తినెడి
    న్నవినీతి బెంచు సినిమా
    కవితాతత్త్వమ్ము నడ్డగాడిద లెఱుఁగున్

    రిప్లయితొలగించండి
  20. సవరించి కంధరములను
    వివరముగా పాడుచుండి వివశత్వమునన్
    నవనవ లాడెడి రీతుల
    కవితాతత్త్వమ్ము నడ్డగాడిద లెఱుఁగున్

    రిప్లయితొలగించండి