18, జులై 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 108 (ద్రౌపది, పాండవులు)

ద్రౌపది, పాండవుల వరుసలు
సర్వజ్ఞ సింగ భూపాలుని వద్దకు ఒక కవి వచ్చాడు.
ద్రౌపద్యాః పాండుతనయాః పతి దేవర భావుకః |
న దేవరో ధర్మరాజః సహదేవో న భావుకః ||

అనే శ్లోకాన్ని మనసులో ఉంచుకొని రాజు "ద్రౌపదికి పాండవు లైదుగురు భర్తలు కదా! వారిలో ఒకరు ఆమెకు భర్త అయినప్పుడు తక్కినవారు ఆమెకు ఏమవుతారో ఆశువుగా కందపద్యంలో చెప్పగలవా?" అని కవిని ప్రశ్నించాడు. అప్పుడా కవి చెప్పిన పద్యం .....
కం.
పతి మఱఁదియు సహదేవుఁడు,
పతి బావయు ధర్మజుండు, బావలు మఱఁదుల్
పతులు నర నకుల భీములు,
పతు లేవురు సింగభూప! పాంచాలి కిలన్.

సింగభూపాలుడు ఆనందించి కవిని ఉచితంగా సత్కరించాడట!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె.

12 కామెంట్‌లు:

  1. శివుని విల్లు విరచిన వశిష్ట, విశ్వ
    మిత్ర శిష్యు డైన విశిష్ట మిత్ర కులజు
    భూజ కోరినదశరథ రాజు పెద్ద
    కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె.

    రిప్లయితొలగించండి
  2. మదినిఁ దలచినఁ వానిని, మదన కాముఁ
    గన్నఁ దండ్రిని, నీలపుఁగలువ వర్ణ
    దేహుడౌ కృష్ణ దేవుని, దేవకమ్మ
    కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________

    కోకనదుని కోదండము - కోరి విరిచి
    కోమలాత్ముడు కోదండ - రాము డంత
    కోటి కాంతుల రాజిల్లి - కోటి కెక్క
    కోటి కోర్కెలు మదిలోన - కూడు కొనగ
    కోరి వరియించి ,భూజాత - కోమలాంగి
    కులుకు నడకల సిగ్గుతో - కువలయేశు
    కొడుకునే భర్తగాఁ బొంది - పడతి మురిసె !
    _____________________________________
    కోకనదుడు = శివుడు
    కోటి కెక్కు = ప్రసిద్ధికెక్కు
    కువలయేశుడు = రాజు (దశరథ మహారాజు)

    రిప్లయితొలగించండి
  4. శ్రీపతిశాస్త్రిసోమవారం, జులై 18, 2011 2:47:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    మంచిగుణములవాడని మనసు బడెను
    జీవితమ్మును పంచగ బావకొరకు
    మేను పులకించె మగువకు మేన మామ
    కొడుకునే భర్తగా పొంది పడతి మురిసె

    రిప్లయితొలగించండి
  5. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, జులై 18, 2011 3:01:00 PM

    ధైర్యసాహసగుణములు ధార్ఢ్యదేహ
    మపరిత జ్ఞానశోభితుడార్య సుతుడు,
    తనను మురిపించి యలరించు మేనమామ
    కొడుకునే,భర్తగాపొంది పడతి మురిసె.

    రిప్లయితొలగించండి
  6. 01 అ)
    _____________________________________

    కోకనదుని కోదండము - కోరి విరిచి
    కోమలాత్ముడు రాముడు - కొలువు లోన
    కోటి కాంతుల రాజిల్లి - కోటి కెక్క

    కొల్లబోయిన హృదయంబు - కోరి విడచి
    కోటి కోర్కెలు మదిలోన - కొలువు దీర
    కోరి వరియించి ,భూజాత - కోమలాంగి
    కొత్త నడకల ముదమున -కోసలేశు
    కొడుకునే భర్తగాఁ బొంది - కొమిరె( పడతి )మురిసె !
    _____________________________________
    కోకనదుడు = శివుడు
    కోటి కెక్కు = ప్రసిద్ధికెక్కు
    కోసలేశుడు = దశరథ మహారాజు

    రిప్లయితొలగించండి
  7. తండ్రి వలె ప్రేమ గా జూచు తనదు మామ
    కన్న తల్లిని మరపించు నెన్న నత్త
    మెట్టి నింటను మమతల పెట్టు వారి
    కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె.

    రిప్లయితొలగించండి
  8. గాలి నాతడు, నామెసౌగంధికమ్ము,
    గీతమయ్యెను, నామెసంగీతమయ్యె,
    గువ్వ మరదలు, బావనే గూడు,మావ
    కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె!!!

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘మదనకాము’ అన్నచోట ‘మకరకేతు’ అనండి. బాగుంటుంది.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ‘అపరిత’ ... ? ‘ధార్ఢ్యదేహ/మనుపమ జ్ఞానశోభితుడార్య సుతుడు’ అందాం.
    *
    మిస్సన్న గారూ,
    అందమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘గాలి యాతడు .... గీతమాతడు ... మామకొడుకు’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి