3, జులై 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 93 (చందురులో నిఱ్ఱి)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 37
సమస్య -
"చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్"
కం.
కందర్పహరుఁడు నరుఁడును
పందికినై పోరిపోరి పరిపరిగతులన్
గ్రిందైన హరుని శీర్షపుఁ
జందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

21 కామెంట్‌లు:

 1. హాలాహలం పుట్టినప్పుడు లోకాలన్నీ గజగజ వణికి పోతుంటే భయపడకండి నేనున్నానని చెపుతూ... భూమాతను ప్రేమతో దగ్గరకు తీసుకుని లాలించినట్లు భావన ...

  కందుకము వోలె భూమిని
  పొందికగా చేతబట్టి పోగొట్ట భయం
  బందముగ హరుడు ముద్దిడ
  చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్ !

  రిప్లయితొలగించండి
 2. మందాకిని భువి జాఱగ
  చందురుడున్ యేగుదెంచె జాహ్నవి తోడన్
  విందయ్యె శీత నగమున
  జందురులో నిఱ్ఱి నేల చంగలి మేసెన్ !

  రిప్లయితొలగించండి
 3. విందులకైఁ గూడితిమిట
  సుందరముగ నదము వెలుగుఁ సొబగులఁ గనుమా!
  మందాకినియందు గనుము,
  జందురులో నిఱ్ఱి నేల చంగలి మేసెన్ !

  మందాకినీ నదిలో చంద్రుని ఛాయను చూచుట.

  రిప్లయితొలగించండి
 4. సుందర దృశ్యము సుమ్మీ!
  మందగతినిసాగుచున్న మందాకినిలో
  విందయె కనులకు నదిగో!
  చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్ !


  మందాకినీ నదిలో చంద్రుని ఛాయను చూచుట.

  రిప్లయితొలగించండి
 5. మన్(మన్నును)దాకిన చంద్రుణ్ణి మందాకిని తో జారినట్లూహించిన మూర్తి గారికి,మన్( మనసును)దాకి విందులుజేసినట్లు వ్రాసిన మందాకిని గారికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. సుందరి చిత్తము దోచెనొ?
  ఎందుకురా చూతువటుల? ఇట పసరములన్
  ఎందుకు విడిచితి? కనెదవు
  చందురులో. నిఱ్ఱి నేలచంగలి మేసెన్ !

  రిప్లయితొలగించండి
 7. విందొన రించగ నాలయ
  మందలి శివరాత్రి శోభ నది తిలకింపన్
  క్రిందకు దిగ, హరు శిరమున
  చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్!

  రిప్లయితొలగించండి
 8. గోలి హనుమచ్చాస్త్రి గారూ,
  అందమైన పూరణ. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణతో మాకు విందు చేసారు. అభినందనలు.
  ‘చందురుడున్ + ఏగుదెంచె’ అన్నప్పుడు యడాగమం రావద్దు కదా! ‘చందురుడున్ వెంటవచ్చె’ అందాం.
  *
  మందాకిని గారూ,
  మీ రెండు పూరణలు విషయం ఒక్కటే అయినా మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మనోజ్ఞమైన పద్యం చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. హనుమచ్ఛాస్త్రిగారూ ,
  ధన్యవాదములు.

  గురువు గారూ ,ధన్యవాదములు.
  నిన్నటి పాఠానికి కూడ కృతజ్ఞురాలను.

  రిప్లయితొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________

  తొందరగా చండీశుడు
  పంద దరుమ ,కింద మీద - పర్విడు వేళన్
  చందిరుడే క్రింద బడగ
  చందురులో నిఱ్ఱి నేల - చంగలి మేసెన్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 11. శంకరార్యా ! "చంగలి" - యీ పదమెక్కడా దొరకలేదు !
  దానికి సరైన అర్థ మేమిటో ?
  పచ్చికనుకొని పూరించాను మరి !

  రిప్లయితొలగించండి
 12. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  ‘చండీశుడు/ పంద దరుమ’అంటే చండీశుడే పందను తరుమగా అనే అర్థం వస్తున్నది.
  ‘చండీశుని/ పంద తరుమ’ అంటే బాగుంటుందేమో?
  ‘చంగలి’ శబ్దం నాకూ దొరకలేదు. ‘మేసెన్’ అనే శబ్దం గడ్డినే సూచిస్తున్నది.

  రిప్లయితొలగించండి
 13. గురువుగారూ ధన్యవాదములు. మిత్రులందఱి పూరణలూ బాగున్నాయి, కాని మందాకిని గారి పూరణలు చాలా మనోజ్ఞముగా ఉన్నాయి. వసంత కిశోర్ గారి సందేహము నాకు కూడా వచ్చింది. మీరు నివృత్తి చేసారు. తమిళములోనో కన్నడములోనో 'చంగలి ' ఉందేమో, గ్రాసం నుంచి గ్రాస్ వచ్చినట్లు.

  రిప్లయితొలగించండి
 14. గురువుగారూ" చంగలి " అంటే పల్లెటూళ్ళలో వాడుక పదం.
  చంగలి గడ్డి అంటారు. కొంచెం నాజూకుగా సన్నగా కాండంపై కొద్దిగా
  నీలి వర్ణం కూడా జేరి చిన్ని చిన్ని ఆకులతో ఉండే పచ్చ గడ్డి పరకలు.
  లేత దూడలకు వాటిని గడ్డి తినడం నేర్చుకొనే దశలో చిన్న బుట్టలో
  పెట్టి దూడ మూతికి కట్టేస్తారు. ఆ దూడ వాటిని మెల్లగా నములుతూ
  పచ్చ గడ్డి పరకలు తినడానికి అలవాటు పడుతుంది.
  నాకు తెలిసిన సమాచారం ఇది.

  రిప్లయితొలగించండి
 15. మూర్తిగారూ, ధన్యవాదములు.
  ఈవేళ్టి నా పూరణల్లో మందాకిని ప్రవహించింది. ఆ శోభలే ఇవి . :-)

  రిప్లయితొలగించండి
 16. మిస్సన్న గారూ మా అందరి సందేహాన్ని తీర్చారు. ధన్యవాదములు. చిన్నప్పుడు బొరిగతో గడ్డి గోకి దూడలకు పెట్టాను గాని చంగలి మాట విన లేదు.

  రిప్లయితొలగించండి
 17. మిస్సన్న గారూ,
  ‘చంగలి’కోసం నేను నా దగ్గరున్న సూర్యరాయాంధ్ర నిఘంటువు, శబ్దరతాకరము, శబ్దార్థచంద్రిక, పర్యాయపద నిఘంటువు, విద్యార్థి కల్పతరువు తదితర గ్రంథాల్లోను, నెట్లో బ్రౌణ్యం మొదలైన వాటిలోను వెదికాను. దొరకలేదు.
  చంగలి గురించి వివరాలు తెలియజేసినందుకు మిత్రు లందరి పక్షాన ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 18. శంకరార్యా ! ధన్య వాదములు !
  సందేహం తీర్చిన మిస్సన్న మహాశయులకు మిక్కిలి ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 19. చంగలి
  =====
  గురువుగారూ మూర్తి మిత్రమా కిశోర మహోదయా ధన్యవాదాలు.

  గురువుగారూ నిఘంటువులలో బహుశా ' చెంగలి ' అని ఉన్నదేమో అనుకొంటున్నాను. ఇది కేవలం నా ఊహ మాత్రమె.

  రిప్లయితొలగించండి
 20. Chandrayan - 10
  (our upcoming Moon Mission)


  హిందూ దేశపు ఘనులట
  చందురులో జింకనుగొని చకచక తేగా
  విందును జేయుచు వెఱ్ఱిగ
  చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్

  రిప్లయితొలగించండి