9, జులై 2011, శనివారం

చమత్కార పద్యాలు - 99 (ప్రహేళిక)

అస్థి నాస్తి శిరో నాస్తి
బాహురస్తి నిరంగుళిః |
నాస్తి పాదద్వయం గాఢ
మంగమాలింగతి స్వయమ్ ||
(శ్రీ శ్రీభాష్యం విజయ సారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం -
ఆ. వె.
లేవు బొమిక లెవ్వి లేదు తలయు గూడ
చేతు లుండు లేవు చేతివ్రేళ్ళు
కాళ్ళు లేవు గాని కౌఁగిలించు నొడలు
తెలిసి చెప్పఁగలవె ధీవిశాల!
సమాధానం - అంగీ (చొక్కా).
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
"అంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్."

22 కామెంట్‌లు:

 1. క్రుంగక మనసున జన వా
  క్కుంగని తనధర్మ మునకు, కులసతియైనన్
  భంగము నొల్లక, తన య
  ర్థాంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్!

  రిప్లయితొలగించండి
 2. చెంగున స్వాతంత్ర్యంబును
  రంగములో దూకి తాను రయమున దెచ్చెన్!
  అంగపు వస్త్రము గట్టుచు
  అంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్!!

  రిప్లయితొలగించండి
 3. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, జులై 09, 2011 10:16:00 AM

  శృంగిని జేరి మనంబున
  నంగాహితుబొంద జేయు నగ్ర తపములన్,
  భంగము జేసెడు నట్టి ల
  తాంగిని రోసిన యతడె మహాత్ముండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  నందనోద్యానంలో అర్జునుడు :

  01)
  ____________________________________

  అంగజు ప్రేరేపితమై
  అంగన , ఊర్వశి , రతమున - కర్జును వేడన్ !
  అంగీకరించక; కన
  కాంగిని రోసిన యతడె - మహాత్ముండయ్యెన్ !
  ____________________________________

  రిప్లయితొలగించండి
 5. అన్నదాత :

  02)
  ____________________________________

  అంగారపు నేలను బడి
  బంగారపు రంగు, టొడ్లు - పండించునుగా !
  అంగము స్వేదము గార్చుచు
  అంగిని రోసిన యతఁడె - మహాత్ముం డయ్యెన్ !
  ____________________________________

  అంగారపు నేల = బొగ్గులా నల్లగా నున్న నేల

  రిప్లయితొలగించండి
 6. శంకరార్యా !
  ఈ క్రింది వాటికి సంధి కార్యం వివరిస్తారా !

  01) రోసిన యతడు
  02)బంగారము + రంగు + వడ్లు

  రిప్లయితొలగించండి
 7. శ్రీపతిశాస్త్రిశనివారం, జులై 09, 2011 3:47:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  లొంగని మగువల ముఖముల
  పొంగెడు నాంలములు కసిగ పోయుట కంటెన్
  కృంగక మదివిసిగినను ల
  తాంగిని రోసిన యతడె మహాత్ముండయ్యెన్
  నేటిసమాజంలో తను బాధ పడిననూ యితరులను బాధ పెట్టకుండా ఉండేవాన్ని
  మహాత్ముడనే (వ్యంగ్యముగా) చెప్పవచ్చు

  రిప్లయితొలగించండి
 8. శ్రీగురుభ్యోనమ:

  లొంగని మగువల ముఖముల
  పొంగెడు నాంలములు {naamlamula}కసిగ పోయుట కంటెన్
  కృంగక మదివిసిగినను ల
  తాంగిని రోసిన యతడె మహాత్ముండయ్యెన్
  నేటిసమాజంలో తను బాధ పడిననూ యితరులను బాధ పెట్టకుండా ఉండేవాన్ని
  మహాత్ముడనే (వ్యంగ్యముగా) చెప్పవచ్చు
  శ్రీపతిశాస్త్రి

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి.
  మీ రొక్కరే గాంధీజీని ప్రస్తావించారు. సంతోషం!
  ‘స్వాతంత్ర్యంబును/రంగములో’ అన్నచోట ‘స్వాతంత్ర్యసమర/రంగములో’ అంటే బాగుంటుంది కదా!

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.
  ‘శృంగి’ అంటే శివుడు, శివపరిచారకుడు, పరీక్షిత్తును శపించిన ముని ... వీరిలో ఎవరిని ఉద్దేశించారు? ‘అంగాహితు .. ’ ? నా సవరణ ..
  శృంగి (దరి) జేరి(యు) మనం
  (బుం గామవివశతగ జేయబోవ తపంబున్)
  భంగము జేసెడు నట్టి ల
  తాంగిని రోసిన యతడె మహాత్ముండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 10. ఖంగు తినిపించి దొరల; ఫి
  రంగుల నెల్ల బెదరించి రంగము దూకెన్
  చెంగున గాంధీ; హింసను
  అంగిని రోసిన యతడె మహాత్ముండయ్యెన్ !

  రిప్లయితొలగించండి
 11. వసంత కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
  ‘బంగారపు రంగు వడ్లు’ అనవచ్చు కదా.
  ‘రోసిన + అతడు’ అన్నప్పుడు యడాగమమే వస్తుంది.

  శ్రీపతి శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘ఆమ్లములు’ టైప్ చెయ్యడంలో ఇబ్బంది పడ్డారు. మీరు తెలుగు టైపుకు ఏ సాఫ్త్వేర్ వాడుతున్నారు? లేఖిని అయితే ‘Am&lamu’ అని టైప్ చేయండి.

  రిప్లయితొలగించండి
 12. నాగరాజు రవీందర్ గారూ,
  గాంధీజీ గురించి ఒక గోలి వారే వ్రాసారనుకున్నాను. మీ పూరణ కూడా చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. రంగుల రోసెను మనమున,
  హంగులు వదలెను , భజనలు యాత్రలుఁ జేసెన్
  గంగా తీరముఁ జేరిన,
  మంగిని రోసిన; యతడె మహాత్ముండయ్యెన్.

  మంగి = క్షురకుఁడు, మంగలి.
  వైరాగ్యము పొంది దైవధ్యానమున మునిగి మంగలిని రోసి గడ్డాలు పెంచాడని భావన.

  రిప్లయితొలగించండి
 14. మాష్టారూ, ఒక మంచి పద్యం. చిన్నప్పుడు మా అమ్ముమ్మ గారు కంఠస్థం చేయించారు. మళ్ళా ఈరోజు తిరుపతి వేంకట కవుల పుస్తకంలో అనూహ్యంగా చదవటం జరిగింది. అందరితో పంచుకోవాలనిపించింది. ఈ మకుటంతో వారు ఇంకా పద్యాలు వ్రాశారు.
  ధనమా, పోవును; మానమా చెడును; నిందా, నెత్తిపైకెక్కు;లో
  ననుమానింతురు తల్లిదండ్రులు; కులంబా, వన్నెకుందక్కు; నూ
  తన మాంద్యమ్ము ఘటిల్లు; బందుగులు పంతంబొప్ప నిందింతు; రో
  మనమా! వద్దిఁక నాదు మాట వినుమా, మర్యాదఁ గాపాడుమా!

  రిప్లయితొలగించండి
 15. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, జులై 09, 2011 11:12:00 PM

  గురువుగారూ నా పద్యములోని భావన........

  శృంగము జేరి = కొండ మీద అనే అర్థములో....
  అనంగాహితు బొంద = ఈశ్వరుని జేరుట ( మోక్ష ప్రాప్తి పొందుటకు )

  మనంబున + అనంగాహితు ( ఈశ్వరుడు ) = మనంబుననంగాహితు

  తప్పులుంటే సరిదిద్దవలసినదిగా ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 16. శంకరార్యా ! ధన్యవాదములు.స్వాతంత్యంబును ....రయముగ దెచ్చెన్ అనే అర్థం కోసం అలా వ్రాసాను.

  రిప్లయితొలగించండి
 17. మందాకిని గారూ,
  పద్యం బాగుంది. కాని మంగి శబ్దానికి మంగలి అనే అర్థం లేదు కదా. ‘లతాంగిని రోసిన’ అంటే సరిపోతుందేమో? ‘స్త్రీవ్యామోహం వదలి మహాత్ముడయ్యాడు’ అనే అర్థంలో.

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ భావాన్ని అర్థం చేసికోలేని మూఢమతిని. మన్నించండి. మీ వివరణ చూసాక నా తప్పు తెలిసింది. మీ పూరణ చాలా బాగుంది.

  హనుమచ్ఛాస్త్రి గారూ,
  నిజమే. కాని రంగములో అంటే ఏ రంగములో ?

  రిప్లయితొలగించండి
 18. మంగి = మంగలి అని ఆంధ్రభారతి నిఘంటువు లొ ఇచ్చారే గురువుగారూ! తప్పయితే , సరే మరి.

  రిప్లయితొలగించండి
 19. మందాకిని గారూ,
  మన్నించండి. మీరు చెప్పిందే సరి యైనది. తొందరపాటు నాదే. నా ముందే నేను టైపు చేస్తున్న సూర్యరాయాంధ్ర నిఘంటువు 6వ సంపుటి ఉంది. ఒక్క క్షణం అందులో వెదికితే సరిపోయేది.

  రిప్లయితొలగించండి
 20. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, జులై 10, 2011 8:46:00 AM

  అయ్యో గురువుగారూ,

  ఎంతమాట. మీయొక్క ఆశీస్సులను కోరుకొనే వానికి ఇంత శిక్ష వేయడం సమంజసమేనా గురువుగారూ??

  రిప్లయితొలగించండి
 21. మాస్టరు గారూ ! వివరణకు ధన్యవాదములు.మేలైన మీ సవరణ తో ...

  చెంగున స్వాతంత్ర్య సమర
  రంగములో దూకి తాను రయమున దెచ్చెన్!
  అంగపు వస్త్రము గట్టుచు
  అంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్!!

  రిప్లయితొలగించండి
 22. భంగును త్రాగండొక య
  ర్ధాంగిని గైకొనక చేరి యరుణా చలమున్
  కంగారొందుచు వేడిమి
  కంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్ :)


  అంగి = చొక్కా

  రిప్లయితొలగించండి