21, జులై 2011, గురువారం

చమత్కార పద్యాలు - 108 (ప్రహేళిక)

సీ.
ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబులఁ
దేఁటి రక్కసిరాజు తెలియఁ దల్లి;
ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబుల
శివునిల్లు వరిచేను క్షీరధార;
ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబుల
భార్యయు ఖడ్గంబు పాదపంబు;
ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబుల
మార్వన్నె యీటె ధూమంబు దనరు;
తే.గీ.
అన్నిటికిఁ జూడ మూఁడేసి యక్షరములు;
మొదలు తుదలును, నడి తుది, మొదలు నడుమ,
ప్రాణరక్షను; లతలను; పాదపములఁ
బరికరము లంద యీ పదా లమరవలయు.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
వివరణ -
అన్ని సమాధానాలు మూడక్షరాలు పదాలు.
మొదటి సమాధానం ప్రాణరక్ష చేసే ‘గంజి’ వంటి పానీయాహారం. దాని 1,3 అక్షరాలు కలిస్తే తుమ్మెద; 2,3 అక్షరాలు కలిస్తే ఒక రాక్షసరాజు; 1,2 అక్షరాలు కలిస్తే తల్లి.
రెండవ సమాధానం ‘బీర, కాకర’ వంటి ఒక తీగ. దాని 1,3 అక్షరాలు కలిస్తే దేవాలయం; 2,3 అక్షరాలు కలిస్తే వరి నాటిన స్థలం; 1,2 అక్షరాలు కలిస్తే ‘గుమ్మము’లో పాలధార.
మూడవ సమాధానం ‘జీలకఱ్ఱ, మెంతులు’ వంటి పోపులో వేసే చెట్టు దినుసు. దాని 1,3 అక్షరాలు కలిస్తే భార్య; 2,3 అక్షరాలు కలిస్తే ‘వారసులు’లో వాడికత్తి; 1,2 అక్షరాలు కలిస్తే ఒక గింజ ‘మామిడికాయ’ పచ్చడికి తప్పనిసరి కావలసింది.
నాల్గవ సమాధానం ‘జాజి, మల్లె’ వంటి వకుళవృక్షం. దాని 1,3 అక్షరాలు కలిస్తే రూపు లేదా వన్నె ; 2,3 అక్షరాలు కలిస్తే ‘గడబిడ’లో ఈటె; 1,2 అక్షరాలు కలిస్తే ధూమం.
కవిమిత్రులారా,
సమాధానాలు చెప్పగలరా?
ఉదాహరణకు మొదటి సమాధానం ‘వరస’ అనుకుందాం. మీరు సమాధానం వ్రాయవలసిన పద్ధతి ఇది ...
1. వరస - వర, రస, వస.

సమాధానాలను క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

7 కామెంట్‌లు:

  1. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    మీ సమాధానలు అన్నీ సరియైనవే. అభినందనలు.
    *
    భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    బహుకాల దర్శనం!
    మీ సమాధానలు అన్నీ సరియైనవే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. వసంత కిశోర్ గారూ,
    మీ సమాధానలన్నీ కరెక్టే. అభినందనలు.
    మీరు చెప్పినట్లే వివరణలో నేను పొరబడ్డాను. సమయానికి పోస్ట్ పెట్టాలనే తొందరలో జరిగిన పొరపాటు అది. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  3. కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానం
    (21-7-2011, 8.07 am)

    1.అంబలి - అలి, బలి, అంబ
    2.గుమ్మడి - గుడి, మడి, గుమ్మ
    3.ఆవాలు - ఆలు, వాలు, ఆవ
    4.పొగడ - పొడ, గడ, పొగ

    రిప్లయితొలగించండి
  4. భమిడిపాటి సూర్యలక్ష్మి గారి సమాధానం
    (21-7-2011, 5.27 pm)

    అంబలి ---- అలి, బలి, అంబ.
    గుమ్మడి---- గుడి,మడి, గుమ్మ
    ఆవాలు---- ఆలు, వాలు, ఆవ.
    పొగడ---- పొగ, గడ, పొగ.

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారి సమాధానం
    (22-7-2011, 1.50 am)

    అంబలి - అలి - బలి-అంబ
    గుమ్మడి - గుడి -మడి -గుమ్మ
    ఆవాలు - ఆలు - వాలు - ఆవ
    పొగడ -పొడ -గడ -పొగ

    రిప్లయితొలగించండి
  6. వసంత కిశోర్ గారూ,
    సవరించాను. ధన్యవాదాలు.
    ఎంతమంది సమాధానలకోసం ప్రయత్నించి నా తప్పుడు వివరణ వల్ల ప్రయత్నం మానుకున్నారో? క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! ధన్యవాదములు !
    అయ్యో ! మీరంత బాధ పడనవసరంలేదు !
    పొరపాటు మానవ సహజం గదా !

    రిప్లయితొలగించండి