28, జులై 2011, గురువారం

సమస్యా పూరణం -408 (కంచెయే చేను మేయుట)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కంచెయే చేను మేయుట కల్ల గాదు
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

  1. కన్న బిడ్డను కడ తేర్చు కన్నతల్లి
    శిష్యు రాండ్రను కామించి చెరచు గురువు
    ప్రజల సొమ్మును గాజేయు ప్రభుత; చూడ
    కంచెయే చేను మేయుట కల్ల గాదు

    రిప్లయితొలగించండి
  2. వంచకుల కేలఁ జిక్కగా వసుధ యిపుడు
    పాల కుండలఁ జేరగా జీలు లెన్నొ
    పొంచి యుండగ నింటనే మ్రుచ్చు లంత
    కంచెయే చేను మేయుట కల్ల యగునె ?

    రిప్లయితొలగించండి
  3. వంచితులు వృద్ధి యగుచుండ్రి వసుధపైన.
    రక్షకులు మారు చుండిరి భక్షకులుగ.
    మోసగింతు రెవరినైన దోషమనక.
    కంచెయే చేను మేయుట కల్ల గాదు.

    రిప్లయితొలగించండి
  4. చింతా రామకృష్ణారావు గారూ
    "వంచితులు వృద్ధి యగుచుండ్రి వసుధపైన" మీ పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. కంచెయే చేను మేయుట కల్ల గాదు
    వైద్యుడే విషమిచ్చుట బ్బరము గాదు
    తల్లియే పిల్ల నడచుట తప్పు గాదు
    ఏతమేనీరు త్రాగిన యేమి తప్పు?

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గురుభ్యో నమః

    అర్చనలుఁ జేసి నిగమాంత చర్చ పిదప
    నాభరణము లపహరించె నంబివాఁడు
    పంగనామము నిండుగాఁ బ్రస్ఫుటింప
    కంచెయే చేను మేయుట కల్ల గాదు !!!

    రిప్లయితొలగించండి
  7. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, జులై 28, 2011 9:58:00 AM

    అష్టవశువులు శాపవశంబుచేత,
    బాలలైరట శంతను భార్యకిలను,
    తల్లియే నీట ముంచెనిర్దాక్షిణముగ,
    కంచెయే చేను మేయుట కల్ల గాదు.

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, జులై 28, 2011 12:44:00 PM

    నరసింహ మూర్తిగారు,

    సర్వదా కృతజ్ఞుడిని. మీ అందరి అభిమాన ప్రోత్సాహములే మాకు శ్రీరామరక్ష. మీ వంటి కవుల పరిచయమునకు వేదికను సమకూర్చిన గురువు గారికి నా అభివాదములు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతిశాస్త్రిగురువారం, జులై 28, 2011 2:03:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    కల్ల వేయగ మళ్ళలో గలుపు మొలచె
    చీడపీడలు వ్యాపించె చేలలోన
    హర్ష మన్నది యున్నదా కర్షకులకు
    కంచెయే చేను మేయుట కల్ల గాదు

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కగా ఉంది మీ మొదటి పూరణ.‘జీలులు’ ...?
    రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    సర్వశ్రేష్ఠమైన పూరణ మీది. అభినందనలతో పాటు ధన్యవాదాలు.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీపతిశాస్త్రిగురువారం, జులై 28, 2011 2:11:00 PM

    నిజాయితీగా వ్యవసాయం చేసే రైతుకు కష్టాలె తప్ప సుఖం ఎక్కడ ఉంది?
    రైతును కాపాడాల్సిన వ్యవసాయమే రైతును ముంచుచున్నది.

    రిప్లయితొలగించండి
  12. చంద్రశేఖర్ (మనతెలుగు) గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘అబ్బరము’ అంటే అధికము, అపారము. అక్కడ ‘బద్దు కాదు’ అనండి. బద్దు అంటే అసత్యము.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటిపాదంలో యతిదోషం. అలాగే ‘నిర్దాక్షిణ్యము’ ఉంది. ‘నిర్దాక్షిణము’ లేదు. నా సవరణలు ..
    అష్టవశువులు శాప(వాక్యం)బు చేత,
    తల్లియే నీట ముంచెని(ర్దయను నాడు),
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ‘కల్ల = కంచె’ ఎక్కడ పట్టారు స్వామీ ఈ శబ్దాన్ని? బాగుంది.

    రిప్లయితొలగించండి
  13. గురువు గారూ నమస్కారములు, ధన్యవాదములు.
    ' పాలకుండలఁ జేరగాఁ జీలు లెన్నొ ' అని వ్రాయాలి. అరసున్న మింగేసాను.
    చీలి,ఓతువు,మార్జాలము,బిడాలము,పిల్లి నాకు తెలిసిన పర్యాయ పదాలు. పిల్లుల అర్ధములో చీలులు అని వాడాను. దోష మయితే సరిదిద్ద గలరు.
    పదానికి అర్ధము వ్రాద్దమనుకొనే అలవాటుగా మరచిపోయాను, మన్నించండి.

    రిప్లయితొలగించండి
  14. సంపత్ కుమార శాస్త్రి గారూ, మీరన్నట్లు గురువుగారు మనందఱికీ వేదిక కలిగించి పద్యాలు వ్రాసే అవకాశము కలిగించడమే గాక క్రొత్త మిత్రులు కలిగే అవకాశము చేకూర్చారు. విశ్రాంతి తీసుకొంటున్నాను అని వ్రాస్తూనే దినమంతా మన ( నా ) తప్పులు సరి దిద్దటానికి , మనలను ప్రోత్సాహ పరచడానికి కాలము వినియోగము చేస్తారు. పూజ్యనీయులు.

    రిప్లయితొలగించండి
  15. చంద్రశేఖర్:
    మాస్టారూ, సవరణకు ధన్యవాదాలు. "బద్దు" అనే కొత్త పదం నేర్చుకొన్నాను. అయితే, అబ్బరము అనే పదాన్ని ఆశ్చర్యము అనే అర్థంలో మేము నిత్యమూ మాట్లాడుకొనే భాషలో చాలా చోట్ల వాడతాము. నాకు సందేహమే రాలేదు. మీసూచన చూశాక బ్రౌణ్య నిఘంటువు చూశాను. అందులో మొదటి అర్థం "అపారం", రెండవ అర్థం క్రింద "ఆశ్చర్యము" అని ఇచ్చారు. బహుశ: "అబ్బురము" నకు "అబ్బరము" పర్యాయ పదం అయిందేమో. అయితే గ్రాంధికముగా వాడవచ్చో లేదో తెలియజేయగలరు.

    రిప్లయితొలగించండి
  16. కల్ల లాడినఁ బోవునుఁ గన్నులనుచుఁ
    జిన్న వాండ్రకు బోధలఁ జేయు వారె
    కంచెయే చేను మేయుట కల్ల కాదు
    యనెడి రీతిని కల్లల నాడఁ దగునె?

    రిప్లయితొలగించండి
  17. 01)
    ___________________________________

    పిల్లలకు పెట్టు తిండినే - నొల్లు కొంద్రు
    ఊళ్ళ నుండెడి భూముల - నల్లుకొంద్రు
    గుళ్ళయందున సంపదన్ - కొల్ల గొంద్రు
    కంచెయే చేను మేయుట - కల్ల గాదు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  18. 02)
    ___________________________________

    నల్ల డబ్బది దేశాన - కొల్ల లాయె
    అల్లనల్లన మంత్రులే - చల్లగాను
    ఇల్లు గుల్లను జేయుట - న్మల్లు లైరి
    కంచెయే చేను మేయుట - కల్ల గాదు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  19. 03)
    ___________________________________

    కుళ్ళుపోతులు లోకాన - పల్లవించ
    తెల్లబోవుట మాత్రమే - యెల్లవారు
    కంచెయే చేను మేయుట - కల్ల గాదు !
    ఒల్లకుండకు మిత్రమా - కళ్ళు తెరుము !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  20. 04)
    ___________________________________

    కంచెయే చేను మేయుట - కల్ల గాదు !
    కుళ్ళగించుము యవినీతి - పెళ్ళు మనుచు
    గుల్లజేయుము తొందర - మల్లకులను
    వెల్లు వెత్తగ నీతియ - న్మల్లకములు !
    ___________________________________
    మల్లకుఁడు = కఠినుఁడు = a cruel man.
    మల్లకము = దీపపు ప్రమిద.

    రిప్లయితొలగించండి
  21. 05)
    ___________________________________

    కంచెయే చేను మేయుట - కల్ల గాదు !
    వల్ల గాదని దలచకు - పెళ్ళగించు !
    ముళ్ళు వేయుము మూర్ఖుల - వల్లె తోడ
    కుళ్ళు బోవగ కడిగిన - మల్లె రీతి !
    ___________________________________
    వల్లె = వల్లెత్రాడు = పశుబంధనరజ్జువు

    రిప్లయితొలగించండి
  22. చంద్రశేఖర్ గారూ,
    నేను కేవలం సూర్యరాయాంధ్రనిఘంటువు, పర్యాయపద నిఘంటువులను మాత్రమే చూసి అలా వ్యాఖ్యానించాను. ఇప్పుడు శబ్దార్థచంద్రిక చూసాను. అందులో ‘వింత’ అనే అర్థం కూడా ఉంది. నా తొందరపాటును మన్నించండి.

    రిప్లయితొలగించండి
  23. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అక్కడ సరళాదేశం జరిగి ఉంటుందన్న ఆలోచనే రాలేదు నాకు. సందేహం తీరింది. అక్కడ ఏ దోషమూ లేదు.
    బ్లాగు నిర్వహణ ‘విశ్రాంతి’గా చేసే పనే! కాకుంటే ఎక్కువసేపు సిస్టం ముందు కూర్చుంటే కళ్లకు అలసట, మెడనొప్పి వస్తుంటాయి.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. మందాకిని గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    చివరి పాదం ప్రారంభంలో యడాగమం! అక్కడ ‘అనెడి’ అచ్చుతోనే మొదలుపెట్టండి.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ ఐదుపూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. అయ్యో మాస్టారూ, మాకు నేర్పుతున్నారు. మేము నేర్చుకొంటున్నాము. మన్నించమనే ప్రశ్నే లేదు. నేర్చుకోవాలనే తపనే తప్ప ఇంకేమీ లేదు.
    కొన్ని టిప్స్ - మీది లాప్ టాప్ కంప్యూటర్ గనక అయితే కూర్చునే విధానం, స్క్రీన్ యాంగిల్ మార్చుకొంటే కొంతవరకు మెడనొప్పి ముంజేతి నొప్పి కళ్ళ అలసట తగ్గించుకోవచ్చు. మౌసు పట్టుకొనే విధానం వల్ల కూడా మెడనొప్పి చేతి నొప్పి
    తగ్గించుకో వచ్చు. ప్రయత్నించి చూడండి.

    రిప్లయితొలగించండి
  26. రాజ శేఖరు, కల్మాడి, రాజ, జగను,
    యడ్యురప్పయు. కనిమొళి యాదుల ఘన
    చరిత లెప్పుడు చెప్పెడి సత్య మొకటె
    " కంచెయే చేను మేయుట కల్ల గాదు ".

    రిప్లయితొలగించండి
  27. శ్రీపతిశాస్త్రిగురువారం, జులై 28, 2011 10:03:00 PM

    గురువుగారు కల్ల = కంచె వాడుకలో ఉన్నపదమనే ఉపయోగించాను. ఒక పాత నిఘంటువులో చూడగా కల్ల అంటె అపద్దము అని మాత్రమె ఉన్నది. తప్పు అయినచో మన్నింపగోరినాను. కల్ల బదులు కంచె వేసుకుందాము{ఫద్యంలొ}.

    రిప్లయితొలగించండి
  28. పాల పేకెట్లు దెచ్చుట- బడికి పిల్ల
    ల వదులుట- కూరల, సరకుల గొని తేర
    శంకరా! యకటకట! విశ్రాంతి యనెడు
    కంచెయే చేను మేయుట కల్ల గాదు!

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  29. మిస్సన్న గారూ,
    ఉత్తమమైన పూరణ. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ‘కల్ల’ శబ్దానికి ‘కంచె’ అనే అర్థం ఉంది. మీ ప్రయోగంలో దోషం లేదు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    అవన్నీ వృద్ధ విశ్రాంత ఉద్యోగుల నిత్యకృత్యాలే కదా! నాకూ అనుభవైకవేద్యాలే!

    రిప్లయితొలగించండి
  30. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జులై 29, 2011 8:46:00 AM

    గురువుగారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి