7, జులై 2011, గురువారం

చమత్కార పద్యాలు - 97 (ప్రహేళిక)

అపదో దూరగామీ చ
సాక్షరో న చ పండితః |
అముఖః స్ఫుటవక్తా చ
యో జానాతి స పండితః ||

(శ్రీ శ్రీభాష్యం విజయ సారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం -
తే.
పాదములు లేవు దూరపు బాట పట్టు
సాక్షరమె కాని పాండితీస్పర్ష లేదు
నోరు లేదు స్పష్టమ్ముగా నుడువగలదు
తెలిసి చెప్పెడివాఁడె పో ధీయుతుండు.
దీని సమాధానం - (అందరికీ తెలిసిందే) జాబు.
కవిమిత్రులారా!
‘పదములు లేనట్టివాఁడు పరుగులు వెట్టెన్’
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.

20 కామెంట్‌లు:

 1. ఉదయము గుడిలో చోరుడు
  పదిమందికి దొరుక, వారు వాయగ గొట్టన్
  పదపడి మ్రొక్కుచు, పలుకగ
  పదములు లేనట్టివాఁడు పరుగులు వెట్టెన్!

  రిప్లయితొలగించండి
 2. చిన్న సవరణ .. గుడి కనుక పూజ చేద్దమని ...

  ఉదయము గుడిలో చోరుడు
  పదిమందికి దొరుక, చేయ బడితెల పూజన్!
  పదపడి మ్రొక్కుచు, పలుకగ
  పదములు లేనట్టివాఁడు పరుగులు వెట్టెన్!!

  రిప్లయితొలగించండి
 3. ముదముగ నాడుచు బంతిని
  మదిఁదలచెను రాణి " యేమి మాయ, మ్మగు, నేఁ
  వదలిన నీబంతియు, భలె!
  పదములు లేనట్టి వాఁడు పరుగులు వెట్టెన్

  రిప్లయితొలగించండి
 4. సదనంబున సెజ్జను దల
  మృదుతల్పము పైన నిడుచు మిధ్యపు గలమున్
  పదముల నిడ పద్యముయై
  పదములు లేనట్టి వాడు పరుగులు పెట్టెన్ !

  ( కంప్యుటర్లో వ్రాసిన పద్యాలు ఎంత త్వరగా వెళ్తాయో )

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  సూర్య సారథి అనూరుడు :
  01)
  ___________________________________

  ఉదయమున వచ్చు రయమున
  ఉదరథి రథమును నడిపెడి - ఉత్తముడతడే !
  ఉదయింప జేయు నర్కుని !
  పదములు లేనట్టివాఁడు - పరుగులు వెట్టెన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 6. వసంతకిశోర్ గారూ, సూర్యదేవుని సారథి అనూరుని ప్రస్తావనతోపూరించారు. చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 7. గురువుగారూ, మీరు రాసిన తేటగీతి పద్యం బాగుంది. స్పర్ష ను కొంచెం గమనించగలరు.
  మిత్రులందరి పూరణలూ బాగున్నాయి.

  రిప్లయితొలగించండి
 8. మిత్రుల పూరణలు బాగున్నాయి అనూరుడి గురించి ఆలోచన వచ్చినా ' పదములు ' దొఱుకలేదు. కిశోర్ జీకి ఆ పదాలు పాఱుతూంటాయి. చక్కగా చెప్పారు !

  రిప్లయితొలగించండి
 9. గురువు గారూ' పదముల నిడ పద్యముగా ' సరిదిద్దాలనుకొంటాను.

  రిప్లయితొలగించండి
 10. చంద్రశేఖరా ! ధన్యవాదములు !
  మూర్తీజీ ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  మందాకిని గారూ,
  బంతిని పరుగులు పెట్టించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
  ‘పద్యము + ఐ’ అన్నప్పుడు యడాగమం రాదు కదా. ‘పద్యమ్మై’ అంటే సరి!
  ఓహ్! మీ సవరణ చాలా బాగుంది. నేను ఆలస్యంగా చూసాను.


  వసంత కిశోర్ గారూ,
  చక్కని పూరణ. సూర్యుణ్ణి ‘ఉదరథి’ అనడం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. పాండురంగ మహత్మ్యం లో పుండరీకుడుకాళ్ళు లేని స్థితిలో
  " అమ్మా యని అరచినా ఆలకించవేమమ్మా................"అని పాడుతూ
  దేకుతూ వచ్చి తల్లి దండ్రుల పాదాల నాశ్రయించగానే కాళ్ళు వస్తాయి !
  02)
  ___________________________________

  పదములు మీవే దిక్కని
  పదుగురిలో తల్లిదండ్రి - పదములు పట్టన్ !
  పదములు మొలిచెను వానికి !
  పదములు లేనట్టివాఁడు - పరుగులు వెట్టెన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 13. వసంత కిశోర్ గారూ,
  మీ రెండవ పూరణ అత్యుత్తమం. ఎందుకన్నానంటే నాకెంతో ఇష్టమైన చిత్రాన్ని గుర్తుకు తెచ్చారు. ఆ వీడియో సిడిని ఎన్ని సార్లు వేసికొని చూసినా కొన్ని సన్నివేశాలలో నాకు ఏడుపు ఆగదు. "దాన్ని మాటిమాటికి చూడడ మెందుకు? కొత్తగా చూస్తున్నట్లు ఏడవడ మెందుకు?" అని మా ఆవిడ విసుక్కుంటుంది. ముఖ్యంగా మీరు ప్రస్తావించిన పాట నాకెంతో ఇష్టం.
  కొత్త పాండురంగడిలో ఆ ఆర్ద్రత, ఆ డెప్తు ఏమాత్రం లేవు.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. శంకరార్యా ! ధన్యవాదములు !
  నాకు కూడా ఆ సినిమా మీద మహా పిచ్చి !
  ఆ పాటంటే మరీనూ !
  కాని మీయంత ధైర్యం లేక కొత్త పాండురంగడు చూళ్ళేదు !

  రిప్లయితొలగించండి
 15. శ్రీపతిశాస్త్రిగురువారం, జులై 07, 2011 7:25:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  పదునుగ నెండలు మండగ
  అదునుగ పవనుండుతాను ననుకూలింపన్
  ముదముగ రేగగ జ్వాలలు
  పదములు లేనట్టి వాడు పరుగులు తీసెన్

  రిప్లయితొలగించండి
 16. శ్రీపతిశాస్త్రిగురువారం, జులై 07, 2011 7:37:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  డాక్టర్ విష్ణునందన్ గారికి నమస్కారములు. 5 వ తేది నా పద్యాలకు చక్కని సవరణలు సూచించినారు. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 17. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. చదరంగములోతురగము
  కదలాడుచుదూకబోగ కలవరపడితా
  చదరము చదరము దూకుచు
  పదములులేనట్టివాడు పరుగులువెట్టెన్ !

  రిప్లయితొలగించండి
 19. కదలుచు నభమున చకచక
  ముదమున నిచ్చుచు వెలుగుల ముచ్చటి రీతిన్
  కుదురుగ నా పేరు కలిగి
  పదములు లేనట్టివాఁడు పరుగులు వెట్టెన్ 😊

  రిప్లయితొలగించండి