20, జులై 2012, శుక్రవారం

‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - 1


          నా ఆత్మీయ సోదరుడు ఆంధ్ర విశ్వవిద్యాలయములో అచార్యపదవి నిర్వహించి విశ్రాంతి గైకొనుచున్న ఆచార్య సార్వభౌమ ప్రొ. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక శుభ సమయమున నన్ను సంబోధించి “తమ్ముడూ! అధ్యాత్మరామాయణము పద్యములలో వ్రాయుటకు నీవు సమర్థుడవు. అందుచేత నీవు ఆ రచనమును  పూనుకొనుము” అని నాలో ఉత్సాహమును కల్పించి నన్ను ఆశీర్వదించినారు. 
          పిదప ఒక వారము దినములలో శ్రీ వలివేటి సుబ్రహ్మణ్యము అనే మిత్రుడు (మంచి పద్యకవి, భారత్ సంచార నిగములో ఇంజినీరు - ప్రస్తుతము రాజమహేంద్రవరము నివాసి) తన వద్దనున్న గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ వారి ప్రచురణ ‘అధ్యాత్మ రామాయణము’ సంస్కృతమూలము తెలుగు తాత్పర్యముతో కూడిన పుస్తకమును నాకు ఇచ్చెను. 
          14-1-2009 (సంక్రాంతి) నాడు అధ్యాత్మరామాయణమును తెలుగు పద్యములలో రచించుటకు శ్రీకారము చుట్టితిని.  రచన నిరాటంకముగనే సాగెను.  25-3-2009 నాటికి అమెరికాకు చేరు కొంటిని.  అచ్చట మా చిన్న అబ్బాయి చి. నందకిశోర్ ఉద్యోగము చేయుచున్నాడు.  అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రములో లేంకాస్టర్ పట్టణములో ఉంటూ పద్యరచన కొనసాగించితిని.  పద్య రచన చక్కగా సాగి సెప్టెంబరులో (వినాయక చవితి నాటికి) కావ్య రచన పూర్తి అయినది.  సుమారు 7 నెలల కాలములో పద్యకావ్యము పూర్తి అగుట ఒక గొప్ప అదృష్టము.  
          ఈ కావ్యమును సంస్కృతములో శ్రీ వ్యాస మహర్షి వ్రాసెను.  ఇందులో 4,200 శ్లోకములు కలవు.  శ్రీరాముని కథ రేఖా మాత్రముగనె యుండును.  ఎక్కువ భాగము శ్రీరాముడును, మహర్షులు, ఇతరులు చేసిన ఆత్మ తత్త్వ బోధలు ఉండును, అటులనే శ్రీరామునికి ఎందరో చేసిన స్తోత్రములు ఉండును.  ఇట్టి కావ్యమును నేను తెలుగులో సుమారు 2,400 పద్యములలో వ్రాసితిని.  ఆ సమయము ఒక పుణ్య సమయము.  నేను కావ్యమును రచించుట ఒక తపస్సు.  ఇది నా జన్మ జన్మల పుణ్య ఫలముగా లభించిన అదృష్ట విశేషము.
          మరికొన్ని వివరములను తదుపరి భాగములో వివరించెదను.  స్వస్తి.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

3 కామెంట్‌లు:

  1. గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ

    ‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - నిజముగాను , ఇది వారి జన్మ జన్మల పుణ్య ఫలముగా లభించినది. శ్రీమదధ్యాత్మరామాయణము ను తెలుగులో జదువుట మా జన్మ జన్మల పుణ్య ఫలము.
    గురువుగారు మీ అనుభవములను చదివిననూ మా జన్మ ధన్యమగును .

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    పూజ్య గురువులు శ్రీ పండితుల వారి " రామాయణ గ్రంధమును " నేను వారి చేతుల మీదుగా పొంద గలగడం నా అదృష్టము . వారి దర్శన భాగ్యము గలిగి నందులకు నా జన్మ ధన్య మైనది . అంతటి పవిత్ర గ్రంధమును పొంద గలిగి నందులకు , దంపతు లిరువురికి " పాదాభి వందనములు .

    రిప్లయితొలగించండి