8, జులై 2012, ఆదివారం

చమత్కార (చాటు) పద్యాలు - 204

భోజరాజు వింత కోరిక

భోజరాజున కొకనాఁడు పొడమె నొక్క
వింత కోరిక, “నే మరణింతు నేని
యెట్లు స్పందింతు?” వనుచు ప్రశ్నించెఁ గాళి
దాసు; నది విని వెఱగంది “తప్పు గాదె
యిట్లు మాటాడ, నే నిప్పు డిట్టి శ్లోక
మొక్కటైనను విన్పించ నొప్ప” ననెను;
కుపితుఁడై రాజు “నామాట గౌరవింప
కిట్లు రాజాజ్ఞధిక్కార మెంతొ చేసి
నాఁడ, విపుడె నా రాజ్యము వీడు” మనఁగ,
వెడలె తనయిచ్చ వచ్చిన కడకుఁ గవియు;
కొంతకాలము గడచిన యంత కాళి
దాసు లోపమ్ము గుర్తించి ధరణిపతియు
మారువేషమ్ముతోడ నూరూరు దిరిగి
వెదకుచుండఁగ నొకచోఁ గవిం గనుఁగొని
వందనము సేయ “నెవఁడ? వేపట్టణమ్ము
నీ?” దనుచు పృచ్ఛ సేయఁగా “నే నొకప్పు
డుంటి ధారానగరమునఁ, గంటికివెలుఁ
గైన భోజుఁడు మరణింప నది విడిచితి”
ననఁగ, నామాటలు విని యత్యధిక దుఃఖ
వివశుఁడై శ్లోక మొక్కటి వినిచె నిట్లు

“అద్య ధారా నిరాధారా
నిరాలంబా సరస్వతీ |
పండితాః ఖండితా స్సర్వే
భోజరాజే దివంగతే ||”

కొర్కె తీరిన భోజుఁడు గూలి మడిసెఁ;
బడిన భూపతిఁ గని గుర్తుపట్టి ఖేద
మంది యుమఁ గొల్చి శ్లోకము నచ్చటచట
స్వల్పభేదముల్ గల్పించి పలికె నిట్లు

“అద్య ధారా సదాధారా
సదాలంబా సరస్వతీ |
పండితాః మండితా స్సర్వే
భోజరాజే భువం గతే ||”

అమ్మహాకవివాక్ప్రభావమ్ముచేత
బ్రతికె భోజుఁడు, కవి కిడె వందనమ్ము,
లిరువు రానందమున పయనించి నెలవు
చేరి గడిపిరి బ్రతుకు సస్నేహముగను.

10 కామెంట్‌లు:

  1. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాభినందనలు.
    కాళిదాసు - వాక్శుద్ధి గూర్చిన ఈ ప్రసిద్ధమైన కథను చక్కని తేటగీతులలో రచించి మాబోంట్లకు మహదానందము గల్గించినారు. ధన్యవాదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. మాస్టారూ, అద్భుతం. భోజరాజ కాళిదాసులు బ్రహ్మా సరస్వతుల అవతారము లంటారు. నిజమేనేమో.

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    చంద్రశేఖర్ గారూ,
    ......... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూ చక్కటి చమత్కారాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. ఆర్యా!
    నమస్కారములు.
    కాళిదాసుఁ గూర్చి కథలున్నవెన్నియో
    అందు నొక్కదాని కద్భుతముగ
    పద్యరూపమిచ్చి హృద్యంబుగా బల్కు
    శంకరార్య! మిమ్ము సన్నుతింతు.

    రిప్లయితొలగించండి
  6. సత్యనారాయణ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. గురువు గారూ, పద్య రూపములో అద్భుతమైన కధ చెప్పారు . చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  8. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. నమస్కారములు
    భోజ రాజు వింత కోరిక ఛాలా బాగుంది. ఇలాంటివి మరిన్ని తెలుప గలరని మనవి

    రిప్లయితొలగించండి