6, జులై 2012, శుక్రవారం

పద్య రచన - 42


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. మిస్సన్న
    తిరుమలేశుని సేవలో త్రికరణములు
    నిల్పి దేవేరులంగూడి నిల్చినావు;
    తెలుగు వారికి బంధువా! ధీర తేజ!
    కృష్ణరాయ భూపాలకా! కేలు మోడ్తు.

*     *     *     *     *
౨. కంది శంకరయ్య
    అతఁడె శ్రీకృష్ణ దేవ రాయలు, తెలుంగు
    రాయఁ డని కీర్తిఁ బడసియు ప్రౌఢమైన
    విష్ణుచిత్తీయ కావ్యమ్ము వెలయఁ జేసె
    మేటి భక్తుఁడు నీకు కోనేటిరాయ!

*     *     *     *     *
౩. పండిత నేమాని
    వేంకటేశునివోలె దేవేరులిద్ద
    రిరుగడల నుండ నలరారు కృష్ణరాయ!
    తిరుమలేశుని సేవించి దేవళమును
    వృద్ధిజేసిన నిన్ను గీర్తింతు నధిప!

*     *     *     *     *
౪. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    కత్తి బట్టిన చేతను కలము బట్టి
    అటునిటు పటుతరముగ నాడుకొన్న
    రమ్య దేవేర పౌగండ రసికరాయ!
    కీర్తికాంత మాల్యద నీకు కృష్ణరాయ!
*     *     *     *     *
౫. లక్ష్మీదేవి
    శక్తి, భక్తియును గలిగి, రక్తి, యుక్తి
    తోడ నలరారుచుండెడు ఱేఁడు; వాని
    గనగ రండు వేంకటనాథు ఘనతరమగు
    నాలయమునందు, భూపతి నదిగొ గనుడు.
*     *     *     *     *
౬. సుబ్బారావు
    విష్ణు చిత్తీయ కావ్యమ్ము వీను లలర
    రచన గావించి మేటిగ రాణ కెక్కు
    ఆంధ్రభోజ! యశము తగునయ్య నీకు !నీకు
    దీవనల నిమ్ము శ్రీ కృష్ణదేవ రాయ !
*     *     *     *     *
౭. కమనీయం
    పటు వాక్శుద్ధి రచించి యుంటివి మహా ప్రౌఢార్థ కావ్యమ్ములన్
    చటులోద్దండ పరాక్రమమ్మున మహోత్సాహమ్మునన్ వైరులన్
    మటుమాయంబుగజేసి ,భక్తిని ప్రణామమ్ముల్ నిగర్వమ్ముగా
    నట శ్రీవేంకట నాథుకున్ సతులతో నర్పించు చున్నావహో.
*     *     *     *     *
౮. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    ఎవ్వాని లేఖిని నింపైన కావ్యాల
              సౌరభంబులు జాలువారుచుండు
    ఎవ్వాని యసిధార నిమ్మహీపతులందు
              శాత్రవులెదిరించ జంకుచుందు
    రెవ్వాడు చూడంగ నీయిలాతలినెప్పు
              డర్థిసంఘంబుల కాత్మబంధు
    వెవ్వాని గళములో నీశ్వరాంశజులైన
              కవివరేణ్యులపట్ల గౌరవంబు
    కానవచ్చుచుండు క్రమముగా నెల్లప్పు
    డాత డఖిలజగతి నాంధ్రభోజు
    డనగ నందియుండె నమితమౌ సత్కీర్తి
    కృష్ణరాయవిభుడు విష్ణుసముడు.

    అష్టదిగ్గజములై యతులిత పాండితీ
              వైభవంబందిన వారి కచట
    భువనవిజయమందు పూజల నొనరించి
              సాహిత్య సభలను జరుపుచుండి
    గండపెండేరాది ఘనమైన సత్కార
              సేవల నవ్వారి సేదదీర్చి
    తెలుగుభాషయె లెస్స దీనివంటిది లేదు
              భాషలఁ జూడంగ భరతభువిని
    అనుచు బలుకుచు దశదిశ లందు నతడు
    తెలుగు భాషను మేటిగా వెలుగ జేసి
    ఆంధ్ర కర్నాట రాజ్యాల కధిపు డగుచు
    కీర్తినందెను నరసింహ కృష్ణవిభుడు.

    ఇరువురు దేవేరులతో
    సరసుండై కూడియుండి సద్భక్తుండై
    హరిసేవాతత్పరుడై
    వరలిన నరసింహ కృష్ణ ప్రభునకు జేజే.

    అవుర! యాముక్త మాల్యద నద్భుతముగ
    తీర్చి దిద్దిన శ్రీకృష్ణ దేవరాయ!
    ధరణి నీకీర్తి యాచంద్ర తారకముగ
    నిలిచి యుండును రాజేంద్ర! నీకు నతులు.

*     *     *     *     *
౯. సంపత్ కుమార్ శాస్త్రి
    తిరుమలదేవదేవునియధీనమునందున నిల్చి భక్తిత
    త్పరత విశిష్టభావముల ధన్యతనొంది,జనానుమోదమై
    పరగుచునున్న విష్ణుకథ పద్యములన్ విరచించి కృష్ణదే
    వరు శుభకీర్తి నొందె, ఘనవైభవమొప్పగ భారతావనిన్.
*     *     *     *     *
౧౧. గుండు మధుసూదన్
    సీ.
    అష్ట దిగ్గజ కవు లాహ్లాదమును గూర్చ
              భువన విజయ మేలు భూపుఁ డెవఁడు?
    ఆముక్త మాల్యద నలవోకగా రచి
              యించి, యాంధ్ర కవుల మించె నెవఁడు?
    జాంబవ త్యుద్వాహ సత్యావధూ ప్రీణ
              నముల సంస్కృతమున నడపె నెవఁడు?
    దేశ భాషల యందుఁ దెలుఁగు లెస్స యటంచు
              నెలుఁ గెత్తి చాటిన నేత యెవఁడు?
    గీ.
    అతఁడె మూఱు రాయర గండ; యాంధ్ర భోజ;
    సాహితీ సమరాంగణ సార్వభౌమ
    బిరుదు లందియు, వెలిఁగిన వీర వరుఁడు;
    నతఁడె శ్రీకృష్ణదేవరాయలు ఘనుండు!
    కం.
    ఇరు ప్రక్కల దేవేరులు
    మురిపెముఁ దీర్చంగ నడుమ మోదము తోడన్
    వర విగ్రహ రూప మెత్తెను
    దిరుమల వేంకట నగేశు దేవళ మందున్!
    తే.గీ.
    తెలుఁగు భాషను సత్కావ్యములును వెలయఁ
    గవులఁ బోషించి, మించి, సత్కార మెలమిఁ
    జేసి, సభలోనఁ బ్రజల రంజింపఁ జేసి,
    కృష్ణ రాయఁడు స్వర్ణ యుగేంద్రుఁ డయ్యె!

*     *     *     *     *
౧౨. రాజేశ్వరి నేదునూరి
    రాజ నీతిజ్ను డీతడు రాయ లనగ
    సార్వ భౌముడు సాహిత్య సమర మందు
    రాయ లేలిన సీమలో రత్న రాశి
    తెనుగు తల్లికి సాహితీ తేజ మలరె !
 

24 కామెంట్‌లు:

  1. తిరుమలేశుని సేవలో త్రికరణములు
    నిల్పి దేవేరులంగూడి నిల్చినావు
    తెలుగు వారికి బంధువా! ధీర తేజ!
    కృష్ణ రాయ భూపాలకా! కేలు మోడ్తు.

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారూ,
    వేగంగా స్పందించి చక్కని పద్యం చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. అతఁడె శ్రీకృష్ణ దేవ రాయలు, తెలుంగు
    రాయఁ డని కీర్తిఁ బడసియు ప్రౌఢమైన
    విష్ణుచిత్తీయ కావ్యమ్ము వెలయఁ జేసె
    మేటి భక్తుఁడు నీకు కోనేటిరాయ!

    రిప్లయితొలగించండి
  4. కత్తి బట్టిన చేతను కలము బట్టి
    అటునిటు పటుతరముగ నాడుకొన్న
    రమ్య దేవేర పౌగండ రసికరాయ!
    కీర్తికాంత నీ మాల్యద కృష్ణరాయ!

    రిప్లయితొలగించండి
  5. వేంకటేశునివోలె దేవేరులిద్ద
    లిరుగడల నుండ నలరారు కృష్ణరాయ!
    తిరుమలేశుని సేవించి దేవళమును
    వృద్ధిజేసిన నిన్ను గీర్తింతు నధిప!

    రిప్లయితొలగించండి
  6. చంద్రశేఖర్ గారూ,
    మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘మాల్యద’ అని అసంపూర్ణంగా చెప్పరాదు కదా!
    ‘కీర్తికాంత నీ కావ్యము కృష్ణరాయ!’ అంటే?

    రిప్లయితొలగించండి
  7. కీర్తికాంత నీకు మాలనిస్తుంది(మాల్యద) అనే అర్థంలో వాడాను. పరోక్షంగా ఆముక్త మాల్యదని స్ఫురింపజేస్తుందనికూడా. మీ సవరణ కూడా బాగుంది.

    రిప్లయితొలగించండి
  8. శక్తి, భక్తియును గలిగి, రక్తి, యుక్తి
    తోడ నలరారుచుండెడు ఱేఁడు; వాని
    గనగ రండు వేంకటనాథు ఘనతరమగు
    నాలయమునందు, భూపతి నదిగొ గనుడు.

    రిప్లయితొలగించండి
  9. విష్ణు చిత్తీ య కావ్యమ్ము వీ ను లలర
    రచన గావించి మేటిగ రాణ కెక్కు
    ఆంద్ర భోజుడ ! యది తగు నయ్య !నీ కు
    దీ వన ల నిమ్ము శ్రీ కృష్ణ దేవ రాయ !

    రిప్లయితొలగించండి
  10. పటు వాక్శుద్ధి రచించి యుంటివి మహా ప్రౌఢార్థ కావ్యమ్ములన్
    చటులోద్దండ పరాక్రమమ్మున మహోత్సాహమ్మునన్ వైరులన్
    మటుమాయంబుగజేసి ,భక్తిని ప్రణామమ్ముల్ నిగర్వమ్ముగా
    నట శ్రీవేంకట నాథుకున్ సతులతో నర్పించు చున్నావహో.

    రిప్లయితొలగించండి
  11. ఎవ్వాని లేఖిని నింపైన కావ్యాల
    సౌరభంబులు జాలువారుచుండు
    ఎవ్వాని యసిధార నిమ్మహీపతులందు
    శాత్రవులెదిరించ జంకుచుందు
    ఎవ్వాడు చూడంగ నీయిలాతలినెప్పు
    డర్థిసంఘంబుల కాత్మబంధు
    వెవ్వాని గళములో నీశ్వరాంశజులైన
    కవివరేణ్యులపట్ల గౌరవంబు
    కానవచ్చుచుండు క్రమముగా నెల్లప్పు
    డాత డఖిలజగతి నాంధ్రభోజు
    డనగ నందియుండె నమితమౌ సత్కీర్తి
    కృష్ణరాయవిభుడు విష్ణుసముడు.

    అష్టదిగ్గజములై యతులిత పాండితీ
    వైభవంబందిన వారి కచట
    భువనవిజయమందు పూజల నొనరించి
    సాహిత్య సభలను జరుపుచుండి
    గండపెండేరాది ఘనమైన సత్కార
    సేవల నవ్వారి సేదదీర్చి
    తెలుగుభాషయె లెస్స దీనివంటిది లేదు
    భాషలఁ జూడంగ భరతభువిని
    అనుచు బలుకుచు దశదిశ లందు నతడు
    తెలుగు భాషను మేటిగా వెలుగ జేసి
    ఆంధ్ర కర్నాట రాజ్యాల కధిపు డగుచు
    కీర్తినందెను నరసింహ కృష్ణవిభుడు.

    ఇరువురు దేవేరులతో
    సరసుండై కూడియుండి సద్భక్తుండై
    హరిసేవాతత్పరుడై
    వరలిన నరసింహ కృష్ణ ప్రభునకు జేజే.

    అవుర! యాముక్త మాల్యద నద్భుతముగ
    తీర్చి దిద్దిన శ్రీకృష్ణ దేవరాయ!
    ధరణి నీకీర్తి యాచంద్ర తారకముగ
    నిలిచి యుండును రాజేంద్ర! నీకు నతులు.

    రిప్లయితొలగించండి
  12. చంద్రశేఖర్ గారూ,
    మీ అభిప్రాయం సమర్థమే. అయితే ఆ పాదాన్ని ఇలా సవరిస్తే బాగుంటుందని నా సలహా....
    “కీర్తికాంత మాల్యద నీకు కృష్ణరాయ!”
    *
    పండిత నేమాని వారూ,
    చిత్రానికి సరిగా సరిపోయే చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.
    నేనెప్పుడు తిరుమల వెళ్ళినా ఆ విగ్రహాల ముందు కాసేపు నిలిచి (“నడవండి... నడవండి” అని నెట్టివేసేవాళ్ళు అక్కడ ఉండరు కదా!) నమస్కరించి ముందుకు సాగుతాను.

    రిప్లయితొలగించండి
  13. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘అది తగునయ్య’ అన్వయానికి అనుకూలంగా లేనట్టు అనిపిస్తోంది. ‘ఆంధ్రభోజ! యశము తగునయ్య నీకు’ అంటె ఎలా ఉంటుంది?
    *
    కమనీయం గారూ,
    మీ మత్తేభపద్యం ధారాశుద్ధితో బాగుంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    శ్రీకృష్ణదేవ రాయల సంపూర్ణ మూర్తిమత్వాన్ని దర్శింపజేసిన మీ ఖండిక అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. ఆర్యా!
    నా వ్యాఖ్యలోని మొదటి సీసపద్యం మూడవ పాదంలో మొదటి పదాన్ని"రెవ్వాడు" గా సవరించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  15. తిరుమలదేవదేవునియధీనమునందున నిల్చి భక్తిత
    త్పరత విశిష్ఠభావముల ధన్యతనొంది,జనానుమోదమై
    పరగుచునున్న విష్ణుకథ పద్యములన్ విరచించి కృష్ణదే
    వరు శుభకీర్తి నొందె, ఘనవైభవమొప్పగ భారతావనిన్.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    కోనేటి రాయుని సంబోధించుచూ మీరు చెప్పిన పద్యము ప్రశస్తముగా నున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. మాస్టారూ, చిన్నసవరణతో వన్నె తెచ్చారు. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  18. గుండు మధుసూదన్ గారి పద్యములు....

    సీ.
    అష్ట దిగ్గజ కవు లాహ్లాదమును గూర్చ
    భువన విజయ మేలు భూపుఁ డెవఁడు?
    ఆముక్త మాల్యద నలవోకగా రచి
    యించి, యాంధ్ర కవుల మించె నెవఁడు?
    జాంబవ త్యుద్వాహ సత్యావధూ ప్రీణ
    నముల సంస్కృతమున నడపె నెవఁడు?
    దేశ భాషల యందుఁ దెలుఁగు లెస్స యటంచు
    నెలుఁ గెత్తి చాటిన నేత యెవఁడు?

    గీ.
    అతఁడె మూఱు రాయర గండ; యాంధ్ర భోజ;
    సాహితీ సమరాంగణ సార్వభౌమ
    బిరుదు లందియు, వెలిఁగిన వీర వరుఁడు;
    నతఁడె శ్రీకృష్ణదేవరాయలు ఘనుండు!

    కం.
    ఇరు ప్రక్కల దేవేరులు
    మురిపెముఁ దీర్చంగ నడుమ మోదము తోడన్
    వర విగ్రహ రూప మెత్తెను
    దిరుమల వేంకట నగేశు దేవళ మందున్!

    తే.గీ.
    తెలుఁగు భాషను సత్కావ్యములును వెలయఁ
    గవులఁ బోషించి, మించి, సత్కార మెలమిఁ
    జేసి, సభలోనఁ బ్రజల రంజింపఁ జేసి,
    కృష్ణ రాయఁడు స్వర్ణ యుగేంద్రుఁ డయ్యె!

    రిప్లయితొలగించండి
  19. అందరూ చక్కటి పద్యాలు వ్రాశారు. ఇప్పటి యువతరంలో చాలామందికి కృష్ణదేవరాయలు గానీ, వేరు తెలుగు కవులు గానీ తెలియక పోవటమే గాక, వారి గురించి చెబితే వినటానికి ఓపిక, సహనమూ కూడా ఉండటం లేదనేది నాబాధ. మీలో పెద్దలూ, ఉపాధ్యులున్నారు. సోదాహరణంగా నా అభిప్రాయం తప్పని చెబితే, నేను చాలా ఆనందిస్తాను.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా శ్రీ శంకరయ్య గారూ!
    ఈ నాటి పూరణలన్నీ ఎంతో రసవత్తరముగా నున్నవి. అందరికీ శుభాభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. మాస్టారూ, మీరు ఇవ్వబోయే సమస్యల ఖాతాలో వేసుకోండి: చిన్నిసవరణ తెచ్చెను వన్నె లెన్నొ

    రిప్లయితొలగించండి
  22. రాజ నీతిజ్ను డీతడు రాయ లనగ
    సార్వ భౌముడు సాహిత్య సమర మందు
    రాయ లేలిన సీమను రత్న రాశి
    తెనుగు తల్లికి పండిత తేజ మలరె !

    రిప్లయితొలగించండి