11, జులై 2012, బుధవారం

పద్య రచన - 47


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. శతమానం భవతీతి వైదిక వచస్సార ప్రకారంబుగా
    క్షితి లక్ష్మీ పురుషోత్తమ ద్వయము పోల్కిన్ సర్వమాంగళ్య జీ
    వితమున్ లక్ష్య మొనర్చి పొందు డటులే ప్రేమానురాగాలతో
    నతులానందముతో వధూవరులు దీవ్యన్మానసాబ్జాతులై

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    వేగంగా స్పందించి చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు, ధన్యవాదాలు.
    ‘మానసాబ్జాతులై’ అన్నచోట అర్థసందిగ్ధం...?

    రిప్లయితొలగించండి
  3. నీ తలపులు నావే యిక
    నా తలలో పుట్టు కలలు నారీ నీవే
    నాతి చరామీ యనుచును
    నాతీ ఒట్టే యుమింక నావలె నీవున్!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ సరస్వత్యై నమః:

    అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! నమస్కారములు.
    నేను సులభమైన సమాసమునే వేసేను అనుకొనినాను. మానస (మనస్సు అనెడి), అబ్జాతులై (తామరపూవు కలవారై) అని నా భావము. మీరు యేమైన సవరణలు సూచించితే సంతోషమే. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. నేమాని వారూ,
    ఓహో... మీరు ‘అప్ + జాత’ శబ్దాన్ని తీసుకున్నారా? నేను ‘అప్ + జ + ...’ అని ఆలోచించాను. ‘అబ్జ’మే తప్ప ‘అబ్జాతము’ నా మట్టిబుర్రకు తట్టలేదు. మన్నించండి.
    ‘మానసాంభోజులై’ అంటే ...?

    రిప్లయితొలగించండి
  6. అయ్యా శ్రీ శంకరయా గారూ!
    మీ సూచన నిర్దోషమే. కాని "మానసాబ్జాతులై" అనే పదము చాల సరళముగా ఉంది. మానసాంభోజులై అంటే గంభీరముగ నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. మూడుముళ్ళు కొంగుముడు లేడడుగులున్ను
    శిరము లందు గుడము జీల కర్ర
    తాళి కుత్తికంటు తలపైన సేసలు
    భావి జీవితంపు బాట లగును.

    రిప్లయితొలగించండి
  8. నేమాని వారూ,
    మీ మాట శిరోధార్యం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘నా తలలో పుట్టు’ను ‘నా తలఁపులఁ బుట్టు’ అంటే...?
    *
    మిస్సన్న గారూ,
    చిన్న పద్యం వివాహాన్ని చక్కగా వివరించారు. అభినందనలు.
    ‘కుత్తికంటు’....?

    రిప్లయితొలగించండి
  10. జీ ల కర్రయు బెల్లము చిదు ము ముద్ద
    యొ కరి శిరసున మఱి యొక రుంచు కొనగ
    పెండ్లి యైనట్లు తలతురు పెండ్లి వారు
    భోజనంబులు దరువాయి భూ జనులకు

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! శంకరయ్య గారూ!
    కుత్తికంటు అనే మాట మా ప్రాంతములో వాడుకలో నున్నదే - కుత్తికంటు, తాళిబొట్టు, మంగళసూత్రములు సమానార్థకములు. కుత్తుకకు (గొంతునకు) దగ్గరగా నుండునది కుత్తుకంటు లేక కుత్తికంటు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. యుక్తవయస్కులందరకు యోరిమిఁ దప్పక మున్నె జోడుగా
    భక్తినిఁ బంచయజ్ఞములఁ బాలన జేయుమటంచు, వారలన్
    ముక్తినిఁ జేర యోగ్యులను ముందుగ జేయు మహోత్సవమ్మిదే!
    వ్యక్తముఁ జేయవచ్చితి, వివాహపు తంతు శుభాశయమ్ములన్.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారికి నమస్కారములతో

    నేడు నయవంచకుల ఆలోచనలు ఈ విధముగా
    -------
    చేత జిక్కె జింక యొకటి జిత్రముగను
    భర్త మదిని దలచె నా వివాహమందు,
    నా కరము భర్త శిరముపై నైన దనియు
    మంత్ర బంధువుల్ సాక్షిగా మగువ మురిసె .

    రిప్లయితొలగించండి
  14. మన సంప్రదాయమ్మునను వివాహమ్మతి
    ముఖ్యమ్ము జీవితమ్మున జనులకు
    అతిపవిత్రమ్మైన యదియె దాంపత్య సం
    బంధమ్ము సకల శోభాప్రదమ్ము
    అగ్నిహోత్రుడు సాక్షియగు పెండ్లి సంబర
    మ్ములకు బంధులు హితుల్ మోదమలర
    శతవత్సరముల జీవితముల బహు యోగ
    ములగాంచుడని దీవెనల నిడుదురు
    చొక్కు బాజా బజంత్రీల సుస్వరములు
    విందు భోజనములు చాల వేడుకలును
    మానసమ్ములు పులకించి మరులు గొల్పి
    యాలుమగలను జేర్చి యుయ్యాల లూపు

    రిప్లయితొలగించండి
  15. సుబ్బారావు గారూ,
    చిత్రానికి తగినట్లుగా చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
    *
    నేమాని వారూ,
    మీ రెండవ పద్యం మమ్మల్ని కవితాడోలికలో ఉయ్యాలలూపింది. మంచి పద్యం. అభినందనలు.
    కుత్తుకంటు శబ్దం నాకైతే కొత్తదే. అందువల్లనే సందేహనివృత్తికోసం ప్రశ్నార్థకం పెట్టాను. ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    వివాహపు తంతును వివరించిన మీ పద్యం ధారాశుద్ధితో అలరారుతున్నది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యంలోని చమత్కారం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. వివాహబంధం బది విశ్వమందున్
    నవీనసౌఖ్యంబు లనంత దీప్తుల్
    భువిన్ బ్రసాదించును భోగదంబై
    భవంబునం బూర్ణత పంచుచుండున్.

    అతీవసంతుష్టిదమౌచు నిత్యం
    బితోధికానందము లిచ్చుచుండున్
    చతుర్విధార్థంబుల సాధకంబై
    సుతాదిసంపత్తులు చూపుచుండున్.

    ఈవైవాహికబంధనంబు దివిలో నేనాడొ సర్వేశ్వరుం
    డావిశ్వాత్ముడు నిర్ణయించి కృపతో నాశీస్సులందించి తా
    నీవేళన్ సుముహూర్తమేర్పరచినా డీ యిద్దరెల్లప్పుడున్
    శ్రీవైభోగములందుచుండ వలయున్ సిద్ధించి సత్సంతతుల్.

    వేదవిదులు మరియు విద్వాంసు లీరీతి
    బ్రాహ్మణోత్తములును, బంధుజనులు
    పలికి కూర్మితోడ భవ్యమౌ దీవెన
    లందజేయుచుందు రచట చేరి.

    రిప్లయితొలగించండి
  17. సత్యనారాయణ మూర్తి గారూ,
    అద్భుతంగా ఉన్నాయి మీ పద్యాలు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. పెండ్లి పీట పైన ప్రియతము లిద్దరూ
    మూడు నిద్ర లవగ మోవి విఱఛి
    కన్న కలలు కరిగె కుదరదు మనకింక
    నీటు గాను జెప్పెనీర జాక్షి !

    రిప్లయితొలగించండి
  19. శుభముహూర్తమందు జుట్టపక్కాలెల్ల
    చూసి సంతసింప శోభ గూర్ప
    గుడము,జీలకర్ర నిడ శిరమందున
    పెండ్లి వేడుకలవి పెంపు మీరు.

    వరుడు,వధువును,నొక్కటై వరలమనుచు
    మంగళాక్షతల్ చేగొని మానితముగ
    బంధుమిత్రులు దీవించు భారతీయ
    పరిణయ విధాన మది యెంతొ పావనమ్ము.

    రిప్లయితొలగించండి
  20. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    కాని అందరూ జంటను కలిపితే మీరు విడదీయ జూసారు.
    మొదటి పాదం చివర ‘ఇద్దరూ’ అని వ్యావహారికం వాడారు. ‘అందరు’ అంటే సరి!
    *
    కమనీయం గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గురువులకు ధన్య వాదములు .
    అందరూ అన్ని విధాలుగా వ్రాసేసారు .ఇక మిగిలింది ఆధునిక మెగా ? అదన్నమాట అసలు సంగతి
    " ఇద్దరు " అన్నమాట వ్యావహారిక మని తెలియదు .అసలు ఏవి గ్రాంధికమో , ఏవి వ్యావ హారికమో తెలిస్తేగా ?

    రిప్లయితొలగించండి
  22. గురువుగారూ ధన్యవాదాలు. నేమాని పండితార్యులు సెలవిచ్చినట్లు కుత్తికంటు అనేది ఈ ప్రాంతపు వాడుక పదం. నల్లపూసలను చిన్న దండగా గ్రుచ్చి మెడకు చాలా దగ్గరగా చుట్టుకొనేలా చేసి పెండ్లి తంతులో భాగంగా వధువుకు పెడతారు. దాన్ని కుత్తికంటు అంటారు.
    నేను అనుకోవడం అది కుత్తుకకు అంటుకొని ఉండడం వలన అలా అంటారేమోనని.

    రిప్లయితొలగించండి
  23. మిస్సన్న గారూ,
    సంతోషం! మీ కారణంగా క్రొత్త శబ్దం, క్రొత్త విషయం తెలిసాయి.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి