12, జులై 2012, గురువారం

పద్య రచన - 48


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. బంగారు వన్నెలీను కు
    రంగము కనుమోయి స్వామి రమణీయ మగున్
    చెంగున నాడెడు దానిని
    రంగుగ నాకిమ్ము దెచ్చి రయమున పోవే.

    అన్నా వినుమిది యసురుల
    పన్నాగము గాగ నోపు వసుధను గలదా
    విన్నామా బంగరు మృగ
    మెన్నగ జనబోకు మయ్య యియ్యెడ బట్టన్.

    తమ్ముడ పోనీ కోరెను
    తెమ్మని వదినమ్మ పట్టి తెత్తును దానిన్
    గమ్మున చంపుదు విడువక
    నమ్మృగమును రక్కసైన నమ్మున పోదున్.

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారూ! ముగ్గురితో 'సమ భాషణ' చేయించారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. పసిడి వనచరమ్ము పట్టి తెచ్చిన చూడ
    పచ్చ నౌను మనదు భవిత నిజము
    నాదు మనసు తెలిసి నాథుడా వెడలుము
    తరుణ మిదియె వేగ తరలుమింక.

    రిప్లయితొలగించండి
  4. రావణుడు బంప మారీచ రాక్షసుండు
    కాదనగలేక శ్రీరాము కరములందె
    మరణ మొందుటె మేలంచు మాయ గొలుపు
    పసిడి లేడిగా తిరుగాడె వనములందు

    కనక మృగంబు ముచ్చటగ గన్పడు చున్నది ప్రాణనాథ! వే
    జని కొనితెమ్ము దానినని జానకి కోరగ రామమూర్తి చ
    య్యన జనె దాని వెన్కనె శరాసన మూనుచు లక్ష్మణుండు వ
    ద్దనినను లెక్క చేయక ధరాత్మజకున్ బహుమాన మీయగా

    అయ్యెడను రావణుండు మాయలను పన్ని
    అపహరించెను జానకి నయ్యొ రామ!
    కోరికలె తెచ్చు చిక్కు లెవ్వారికేని
    హా విధీ! సీత యవ్విధి నార్తి నొందె

    రిప్లయితొలగించండి
  5. కనుల ముందర యందాల కదలి యుండ
    అందరానట్టి బంగారు హరిణమేల?
    పతివియోగము నుదుటను వ్రాసియుండ
    ధరణిసుతకైన విధిరాత తప్ప తరమె?

    రిప్లయితొలగించండి
  6. రామ ! బంగరు మృగ మది రమ్య మలరె
    తెచ్చి యీ య వ ! నా క ది యిచ్చ య య్యె
    యనిన సోదరు గాపుంచి యను స రించె
    మాయ లేడిని దేవం గ మాయ కొఱ కు

    ( మాయ కొఱకు అనగా మాయా సీ త కొఱకు )

    రిప్లయితొలగించండి
  7. మురిపించు లేడిని గనిన
    ధరణీసుత తన పతి నెడ దగ మురిపెముగా
    వరముగ నడుగగ రాముఁడు
    పరువెత్తెడు జింక తోడ పరుగులు దీసెన్.

    సౌమిత్రియు నాపంగను
    రాముని, దెలిపె నిది మాయ, రాక్షసులదనెన్.
    శ్రీమతి కోరిక దీర్చుటె
    నా మది లోని తలపనుచు నగ్రజుడనియెన్.

    రిప్లయితొలగించండి
  8. రంగారు వర్ణాల రమ్యమై వెలుగొందు
    సుందర హరిణమ్ముఁ జూడు డార్య!
    బంగారుమేనుతో సింగారములు నిండి
    యిందు నందును వేగ మేగుచుండె
    చంచలాక్షులతోడ సయ్యాటలాడుచు
    నందకుండగ దూర మరుగుచుండె
    ఎట్టులైనను దీనిఁ బట్టుకోవలెనంచు
    మానసంబున వాంఛలూనుచుండె
    కోరబోవను వేలాది కోర్కెలెపుడు
    జగతి ననుపమమైన యీ మృగము నిపుడు
    రయమునను దెచ్చి నా మనోరథము దీర్చ
    గోరుచుంటిని మిమునాథ! కూర్మిమీర.

    మునుపేనాడును జూడలేదు మిగులన్ మోదంబు నందించుచున్
    వనభూమిన్ దిరుగాడుచున్నది మహద్భాగ్యంబు నేడీ మృగం
    బినవంశోద్భవు డందజేసినను నాకెంతేని చేకూరు తా
    ననుచున్ జానకి కాంక్ష చేసినది దివ్యానందసంపూర్ణయై.

    అసురు లెవ్వారలో కసితోడ నీరీతి
    మాయను కల్పించి మనకు నిట్లు
    భ్రమగల్గునట్లుగా పసిడిజింకను జేసి
    యుందురు గాని వేరొండు గాదు
    దీనినందుటయన్న హాని పొందుటె గాదె
    నామాట నమ్ముము రామచంద్ర!
    దనుజుల కృత్యాలు మనమెరుగనట్టివా
    కోరుచు నద్దాని జేరు కొరకు
    యత్న మొనరింప వద్దంచు నగ్రజునకు
    చెప్పి వారింప జూచిన నప్పుడతడు
    లక్ష్మణా! విను జానకీ రమణి కొరకు
    సంత సంబున నేగి సాధింతు నిదిగొ.

    ఇట్టె కొనివచ్చి యద్దాని నింపుమీర
    హర్షమొదవంగ సీతకు నందజేతు
    నసురుడైనచొ వానిని యముని కడకు
    పంపె దనటంచు రాముడు పలికె నపుడు.

    రిప్లయితొలగించండి
  9. బంగరు జింకను చూడుము
    చెంగున నెగురంగ నెంత చక్కదన మ్మో
    రంగుల చక్కలు మెరయుచు
    పొం గారెడు ముదము జెంద పొమ్మిక వెంటన్ !

    రిప్లయితొలగించండి
  10. గుండు మధుసూదన్ గారి పద్యములు....

    కం.
    సురుచిరమగు జొంపమ్ముల
    నురు గతితోఁ దినుచు మఱల నుఱుకుచుఁ దమితోఁ
    దిరిగి వెనుఁజూచుఁ జుఱుకునఁ
    జిఱు మోడుపుఁ గనులఁ బసిఁడి జింకను గాంచన్.

    తే.గీ.
    సీత మనమునఁ బ్రేమయుఁ జివురు లెత్త,
    "నాథ!బంగారు జింకయ నాకు వలయుఁ
    బెంచుకో మనసాయెను బ్రియము తోడఁ
    దెచ్చి యీయుఁడు మన ప్రేమ తిరము గాఁగ!"

    ఆ.వె.
    అనిన సీత పల్కు లాలించి సౌమిత్రి
    "వద్దు వదిన! యీ సువర్ణ హరిణ;
    మిట్టి వింతఁ గంటె, యీరేడు లోకాల?
    నిది ప్రమాదకరము! హితము కాదు!!"

    తే.గీ.
    అన్న లక్ష్మణు మాటల నాలకించి,
    రాముఁ డనె, "తమ్ముఁడా! నన్ను రమణి సీత
    కోరు తొలి కోర్కి తప్పక తీర వలయుఁ;
    బోయి వైళమ దెచ్చెద మాయ లేడి!

    కం.
    మాయయినఁ బటాపంచలు
    సేయుదు; లేకున్న దాని సీతకు నిత్తున్;
    వేయును మాట లిఁకేలా?
    పోయియు నేఁ దెత్తు" నంచుఁ బోయె త్వర గతిన్.

    ఆ.వె.
    సీత సంతసించె శ్రీ రాముఁ డా జింకఁ
    బట్టి తెచ్చు నంచుఁ బరవశించి;
    లక్ష్మణుండు కన్నులందున సంశయ
    మొలుక, ధీరుఁ డౌట నులుక కుండె!

    తే.గీ.
    అంత "హా సీత!హా లక్ష్మణా!" యటంచు
    నొక్క పెనుఁ గేక వినఁ బడ, "నక్కట! యది
    రాముఁ డాపద నుండెనో యేమొ? నీవు
    సత్వరమ్ముగఁ బొమ్ము లక్ష్మణ!యటకు"

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పద్యములు....
    (2)


    కం.
    అని సీత వల్క లక్ష్మణుఁ
    డనెఁ "దల్లీ! రాముఁ డెట్టి యాపద కెఱగాఁ,
    డనితర సాధ్యుఁడు, వీరుఁడు,
    విను, కారణ జన్ముఁ డతఁడు; భీతిల్లకుమీ!"

    ఆ.వె.
    మఱది మాట వినిన మానిని సీత తా
    నెంతొ వగచి యతని నింద సేయ;
    హృదయ శల్యుఁ డయ్యు, హ్రీ మనస్కుండయి,
    "గీత దాట" కనుచు, గీసి వెడలె!

    తే.గీ.
    రావణుఁడు యోగి వేషాన రమణి సీత
    కడకు నేతెంచి, భిక్షను నడిగి, రేఖ
    దాట రాకున్కి, సీతయె దాటి రాఁగ,
    నపహరించెను హతవిధీ, యా రమణిని!

    (ఇది సీతాపహరణ ఘట్టము. స్వస్తి.)

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులందరికి వందనాలు.
    నిన్న ఉదయం దత్తపది, పద్యరచనలను పోస్ట్ చేసి అత్యవసరంగా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. రోజంతా ఎక్కడా బ్లాగు చేసే అవకాశం దొరకలేదు. మళ్ళీ ఇల్లు చేరేసరికి రాత్రి 2 గం. అయింది. ప్రయాణపు టలసట వల్ల మీమీ పూరణలను, పద్యాలను చూడలేక పోయాను. ఈరోజు సాయంత్రం లోగా వాటిని పరిశీలించి నా వ్యాఖ్యలను పెడతాను. ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  13. మాయ బంగరు లేడిపై మనసు పడుచు
    తెచ్చి యిమ్మనె జానకీ దేవి నాథు
    కర్మఫల మెట్టి వారల కైన ననుభ
    వింపకయె తప్ప దక్కటా విధివశాన.

    తలచి రాక్షస మాయగా ,వలదటంచు
    లక్ష్మణుండు వారించినన్ లలన మాట
    కాదనక ,స్వర్ణ మృగమునకై వెడలెను
    రామచంద్రుండు విధిదాట రాదెవరికి.

    రిప్లయితొలగించండి