14, జులై 2012, శనివారం

పద్య రచన - 50


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. పన్నగ శయనా! వినుమా
    విన్నపములివే! మొఱ విని వేడుక తీర్చే
    పెన్నిధి నీవే! సతతము
    సన్నిధి నుంచవె, యనంత శయనా! నన్నే.

    రిప్లయితొలగించండి
  2. అడిగిన కోర్కెలు దీర్చుచు
    సడి సేయక దా పరుగున చనుదెంచు, సదా
    పడగల వానిపై శయనిం
    చెడువానిం గొలువ సిరులు చేకుఱు మనకున్.


    పూరణ చేసిన పద్యము ఇక్కడ కూడా.......:)

    రిప్లయితొలగించండి
  3. శ్రీకళ్యాణ గుణాకర!
    లోకత్రయ పాలకా! సరోరుహ నాభా!
    నీకిదె మ్రొక్కెద దేవా!
    శ్రీకాంతా! శేషశయన! శ్రీగోవిందా!

    పరమానందము నీ స్వరూప మనుచున్ భావించుచో సమ్మతిన్
    పరమానందమె నాదు మానసమున్ భాసిల్లగాజేయు స
    త్వర మీ జన్మ వినాశ రూప జలధిన్ దాటించు నారాయణా!
    వరయోగీశ్వర మానసాంబురుహ సంవాసా! కృపాసాగరా!

    క్షీరసాగర కన్యకా సేవిత పద!
    వారిజాసన ముఖ్య దేవగణ వినుత!
    కమలనేత్ర! శాంతాకార! గగన సదృశ!
    వందనమ్ములు నీకు నో పరమపురుష!

    రిప్లయితొలగించండి
  4. దరిజేరగనీయగదే
    సిరినేలెడు దేవర! కరి జేసిన పుణ్య
    మ్మెఱుగని దానను, శీఘ్రమె
    కరుణింపవె నన్నిక, నలుకలు మానగదే!

    రిప్లయితొలగించండి
  5. దేవా! నీ స్మరణంబు జేయుటకు నాదేశంబు లియ్యంగదే!
    నా వారెవ్వరు యీ జగమ్మునను నా నాథుండవీవే, సదా!
    సేవాభావము బెంపు జేసి నిను నే జేరంగ నిమ్మా ప్రభూ!
    పూవై నీ కడ నిల్తునయ్య! కృపతో పొంగారు నారాయణా!

    రిప్లయితొలగించండి
  6. అమ్మా లక్ష్మీదేవీ,
    ఆడవాళ్ళకు బంగారం పైన ప్రీతి ఎక్కవ అంటారు. అనంత శయనుని స్వర్ణమూర్తిని చూడగానే మీలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్లుంది. సంతోషం!
    చక్కని పద్యాలు వ్రాస్తున్నారు. అభినందనలు.
    రెండవ పద్యం మూడవ పాదంలో ‘వానిపై’ అన్నచోట గణదోషం. సవరించండి.
    శార్దూలంలో ‘నావారెవ్వరు + ఈ జగమ్మున’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. ‘నావారెవ్వరొకో జగమ్మునను...’ అందామా? ‘నావారెవ్వరొ యీ జగమ్మునను..’ అని కూడా అనవచ్చు.
    *
    పండిత నేమాని వారూ,
    అద్భుతమైన పద్యాలను వ్రాసారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. దయ నాపైఁ జూపిన నా
    భయములు దొలగున్ననంత పాపహరణమౌ
    రయమున నినునే జేరెద
    నియమము తప్పక గొలిచెద నిను నే నికపై.

    గురువు గారు,
    నారాయణుని జేరవలెనని ఉత్సాహము ఉరకలు వేస్తున్నది గానీ, బంగారముపై మోహము లేదండి. ధరించనని కాదు. మోహము లేదంతే.
    మీరు చెప్పిన సవరణలు బహుచక్కగా ఉన్నాయి.
    నా వారెవ్వరొకొ బాగుంటుంది.
    పడగల దొరపై శయనించెడు వానింగొలువ సిరులు చేకుఱు మనకున్.

    రిప్లయితొలగించండి
  8. పన్న గాధిప ! మురహర !పద్మ నాభ !
    భాను తేజుడ ! భ వ హర ! ధరణి రక్ష!
    కలుష ము ల ద్రుంచి నన్నిక కావ రమ్ము
    కోటి దండాలు బెట్టుదు కృష్ణ నీ కు

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! శ్రీ సుబ్బారావు గారూ! మీరు మరేదో ఆలోచనలో ఉండి పద్యము వ్రాసేరేమో. పన్నగాధిప అంటే ఆదిశేషుడు కదా. పన్నగశయన అనండి. భాను తేజుడ! అంటే చెవికి ఇంపుగా లేదు. పద్మ హిత తేజ అంటే బాగుంటుంది. 4వ పాదములో యతి సరిపోదు. కోటి దండాలు నీకు ముకుంద కృష్ణ అనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. అమ్మా లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు. ఈ మధ్య మీ కలము వేగముగా సాగుచున్నది. వెంటవెంటనే ఎన్నెన్నో పద్యములు వ్రాయుచున్నారు. బాగున్నది. శుభం భూయాత్. పద్యములు బాగుగా వచ్చుచున్నవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. నారాయణ! పీతాంబర!
    క్షీరోదధి విశ్రమించు చిన్మయరూపా!
    ఈరేడు జగములేలెడు
    వీరా! మముగావుమయ్య వేవేలనతుల్.

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారి పద్యములు....

    కం.
    ఇలఁ దిరువనంత పురమున
    తుళు వంశ బ్రాహ్మణుండు తులలేని తప
    మ్మెలమిని జేయఁగ రెండేఁ
    డుల బాలుండయ్యువిష్ణుఁ డుల్ల మెలర్పన్;

    కం.
    కనఁ బడఁగ, దివాకరముని
    మనమెంతయుఁ బ్రేమ నిండ మన్నన తోడన్
    దన యింట నుండు మనఁగా,
    "విను! ప్రేమను ననుఁ గను; కన వేనిన్ బోదున్"

    ఆ.వె.
    అనిన సమ్మతించి యా బాలు నెంతయుఁ
    బ్రేమతోడఁ దానుఁ బెంచు చుండ;
    నొక దినమున మునియు నకలంకుఁడై పూజ
    సలుపు చుండె మిగులఁ దలను వంచి;

    తే.గీ.
    బాలుఁ డంత సాలగ్రామ మేలొకొ కొని
    చనుచు నుండఁగ ముని చూచి, సాగ్రహుఁ డయె;
    వెంటనే బాలుఁ డప్పుడు "విను మునీంద్ర!
    మున్ను నా యాంక్షఁ దప్పితి; నిన్ను విడుతు!"

    ఆ.వె.
    అనుచు మాయ మయ్యె; మునియును గుములుచు
    'హరియె బాలకునిగ నవతరించి,
    ననుఁ గృతార్థుఁ జేయ నా గృహమ్మున నుండ;
    గుర్తు పట్ట నైతి; గ్రుడ్డి నైతి!'

    తే.గీ.
    అనియు వగచుచు ముని యంత నడవి కేగ;
    నెదుర నొక పెద్ద వృక్షమ్ము నేల వంగి,
    క్రోశ విస్తార విలసిత గోచరమయి,
    శేష శయనుని రూపెత్తె చిత్రముగను!

    ఆ.వె.
    కన నశక్యమైన ఘను, శేష శయనుని
    సన్నుతించఁగాఁ బ్రసన్నుఁ డయ్యి,
    వచ్చి, యా యనంత పద్మనాభ స్వామి
    పద్మ తీర్థ మందుఁ బరిఢవిల్లె!

    ఉత్సాహవృత్తము:
    ముని యనంత పద్మనాభు మ్రోలఁ బొంగి పోవుచున్
    వినుతరీతి దేవళమ్ము విగ్రహ ప్రతిష్ఠచేఁ
    గనుల విందు సేయఁ గాను గామితమ్ముఁ దీర్చు దే
    వునిగఁ బూజఁ గొనఁగ నిట్లు పూర్ణ రూపమెత్తెగా!

    (శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయ నిర్మాణ గాథ సమాప్తం)

    రిప్లయితొలగించండి
  13. సుబ్బారావు గారి పద్యము...
    (నేమాని వారి సూచనల ప్రకారము సవరణలతో...)

    పన్నగశయన! మురహర!పద్మనాభ!
    భానుహితతేజ! భవహర! ధరణిరక్ష!
    కలుషముల ద్రుంచి నన్నిక కావ రమ్ము
    కోటి దండాలు నీకు ముకుంద! కృష్ణ!

    రిప్లయితొలగించండి
  14. అయ్యా,
    మీ వంటి పెద్దలందరి ఆశీస్సులే నా బలము.
    మధుసూదన్ గారు,
    అనంత పద్మనాభ స్వామి కథ వినిపించి మమ్ము తరింప జేశారు.ధన్యవాదాలు.
    గురువు గారు,
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  15. లక్ష్మీదేవి గారూ,
    ఏదో హాస్యానికి అన్నమాట అది! పట్టించుకోకండి.
    మీ లేటెస్ట్ పద్యం కూడా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    నేమాని వారి సూచనలను అనుసరించి మీ పద్యాన్ని సవరించాను. చూడండి.
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మధుసూదన్ గారూ,

    గుండు మధుసూదనా! ధ
    న్యుండ నయితి చదివి నీ మృదూక్తుల కథ; నే
    మెండుగ నభినందనముల
    నిండగు హృదయమ్ముతోడ నిప్పు డొసఁగితిన్.

    రిప్లయితొలగించండి
  16. జగదాధారక! శేషతల్పశయనా! సర్వాత్మకా! కేశవా!
    ఖగరాజేంద్రుడు వాహనంబగు జగత్కళ్యాణ నిర్వాహకా!
    నిగమాంతర్గత! భక్తపోషక! సదా నిర్వాణసంధాయకా!
    భగవంతా కృపజూపు వేడెద నినున్ భక్తిప్రపత్తిన్ సదా.

    రిప్లయితొలగించండి
  17. వనధి శయను వృత్తాంతం
    బును నొక ఖండికగ వ్రాసి మోదమొసగితో
    యనఘా! సత్కవి మధుసూ
    దన! గుండు కులాబ్ధి చంద్ర! ధన్యుడవు సఖా!

    రిప్లయితొలగించండి
  18. అతులిత సంపద వెలువడె
    శతలక్షల కోట్లు మించి సర్వజనులు వి
    స్తృతవిభ్రాంతిని జెందుచు
    స్తుతియింపంగా ననంత సుందరమూర్తిన్.

    దేవళమ్ములోని దివ్యశిలామూర్తి
    బోలియున్న స్వర్ణ పుణ్యమూర్తి
    అన్నిదేశములును అచ్చెరువొందగ
    నేలమాళిగలను నిధుల నుండె.

    స్వర్ణకారు శిల్ప చాతుర్యమేమియో
    అబ్జనాభు మూర్తి యందమేమొ
    బ్రహ్మ,శివుని ,తోడ బ్రత్యక్ష మాయెను
    ఒక్క మూర్తి యందె ,అక్కజముగ .
    నేను అనంత పద్మనాభుని కొంతకాలం క్రిందట దర్శించుకొన్నాను.
    కాని,అప్పటికి నేలమాళిగలలోని నిధుల గురించి ప్రపంచానికి తెలియదు.

    రిప్లయితొలగించండి
  19. గురు తుల్యులు ,నేమానివారికి, శంకరయ్య గారికి నమస్కారములతో
    పద్యముల లోని దోషములను సవరించి సరి చేసినందులకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  20. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మిత్రులు గుండు మధుసూదన్ గారిని సంబోధిస్తూ మీరు వ్రాసిన పద్యం బాగుంది. ధన్యవాదాలు.
    *
    కమనీయం గారూ,
    ఆ స్వర్ణమూర్తిని గురించిన వాస్తవాలను చక్కని పద్యాల్లో వివరించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. సిరికిన్ జెప్పక పొయిన
    సరగున యేతెంతు వనుట సర్వజ్ఞుడ వై !
    శరణాగతి యన్న వాని
    సుర లోకము వదలి వచ్చు సంరక్షిం పన్ !

    రిప్లయితొలగించండి
  22. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

    శ్రీ కంది శంకరయ్య గారూ, నేఁడు గురుతుల్యులు పండిత నేమాని వారి
    యభినందనలు లభించుట నా మహద్భాగ్యము. వారికి నా కృతజ్ఞతలు తెలుపగలరు.
    అట్లే, సోదరి లక్ష్మీదేవి గారికిని, మీకును నా ధన్యవాదములు. మీరు, పండిత
    నేమానివారు నాపై రాసిన పద్యములు నాకెంతయు సంతోషకారకములు,
    ప్రోత్సాహకములును! ధన్యుఁడను. స్వస్తి.

    గుండు మధుసూదనున్ నను
    మెండగు శంకరులు, లక్ష్మి మితవచన ఘనుల్,
    నిండుమనమ్మున గురువులు
    పండిత నేమాని వారు బాగనిరి; నతుల్!

    రిప్లయితొలగించండి
  23. రూపము శాంతమున్ పఱపు రూఢిగ సర్పము నాభి పద్మమున్
    ప్రాపగు రాజు వేల్పులకు ప్రాణము సృష్టికి బోలు మింటినిన్
    చూపుకు మేఘ వర్ణమును శోభిలు గాత్రము నబ్జ నేత్రముల్
    శ్రీపతి యోగి గమ్యుడగు చేయు భవ మ్మభయమ్ము విష్ణువే.

    రిప్లయితొలగించండి
  24. కొలువైన రంగశాయిని
    తలచినయంతట మనమున , దయతో పుణ్యం
    బుల ఫలమై కనిపించగ
    నిలలో ననుఁ బోలు భాగ్యమేరికి కలుగున్?

    రిప్లయితొలగించండి