24, జులై 2012, మంగళవారం

పద్య రచన - 60


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. భక్తిలేని తెలివి వ్యర్థమ్ము, రామ స
    న్నిధియె సుఖము నిచ్చు, నిధులు గావ
    టంచుఁ గృతులఁ జెప్పి యందఱ మెప్పించె
    త్యాగరాజు కిడుదు దండములను.

    రిప్లయితొలగించండి
  2. నాదోపాసన నెల్లెడ
    మోదంబున జేసి ప్రభుని మోహనరూపున్
    శ్రీదుని ధశరథనందను
    వేదాత్ముని గొల్చినట్టి విజ్ఞునకు నతుల్.

    నిరతము రాముని దలచుచు
    కరమరుదగు కీర్తనాళి ఘనచరితుండై
    యరుసంబున రచియించుచు
    ధర బంచిన త్యాగరాజ ధన్యునకు నతుల్.

    రిప్లయితొలగించండి
  3. శ్రీరాముని పై కృతులను
    నారూఢిగ సకల జనులు నౌరా యనగా
    పేరొందగ రచియించిన
    శ్రీ రాజా త్యాగయార్య చేతును ప్రణతుల్!

    రిప్లయితొలగించండి
  4. వివిధ రకముల గృ తు ల ను వేల కొలది
    భక్తి పరముగ నుడివిన భక్త వర్య !
    త్యాగ పురుషుడ వీ వయ్య ! త్యాగ రాజ !
    అందు కొనుమయ్య ! సాదర వంద నాలు .

    రిప్లయితొలగించండి
  5. గీతమ్ములకు స్వరసం
    గీతమ్మును మేళవించి కీర్తనలెన్నో
    ప్రీతిగవ్రాసిన కృతివి
    ఖ్యాతుడు శ్రీత్యాగరాజు గాంచినశుభమౌ !!!

    రిప్లయితొలగించండి
  6. శాంతము లేనిచో సుఖమసాధ్యము ; శ్రీ రఘురాము సేవయే
    భ్రాంతి దొలంగజేయునని వాకొని సార సరస్వతీ పదో
    పాంత నిరంతరార్చన శుభ ప్రతిపాదిత గాన సత్కళా
    క్రాంత విరాడ్స్వరూపమును గాంచిన త్యాగయ సన్నుతించెదన్ !

    నిధి మేలా ? శ్రిత భక్త బృంద కరుణా స్నిగ్ధాబ్ధి శ్రీరాము స
    న్నిధి మేలా ? యని పారమార్థికము వర్ణింపంగ దీవ్యత్కళా
    నిధియై నాదమయ ప్రపంచమును - వాణీ సత్కృపా లబ్ధ వా
    గ్సుధలన్ గొల్చిన త్యాగరాజునకివే స్తుత్యంజలుల్ గూర్చెదన్ !!!

    రిప్లయితొలగించండి
  7. పరదేశమ్మునఁ దా వసించియు మహా భాషాభిమానమ్ముతో
    ధరణీ జాతకు భర్తగా నలరు నా ధర్మాత్ము,నా రామునిన్,
    నిరతమ్మీతడె పాడి గొల్చెనని, దానేనాడు ధర్మమ్మునే
    పరదైవమ్ముగ నమ్మియుండెనని, నే భావింతు సత్యమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  8. ఏ పూర్వజన్మ సుకృతమో సరస్వతి
    మూర్తీభవించి యీ పుడమి నలరె
    యనురీతి సంగీతమను సత్కళాపూర్ణ
    వైభవుండై గాంచె ప్రథిత కీర్తి
    తన జీవితంబునంతను సంప్రదాయ సం
    గీత సాధనకు నంకిత మొనర్చి
    సరిగమ ముఖ్య సుస్వరములే సర్వకా
    లావస్థలందొప్పు నాత్మలోన
    రామ భక్తుడై కీర్తనలను రచించె
    విత్తమందాశ లేక పవిత్రమైన
    జీవితమ్మును గడపుచు చెలగె నతుల
    ధన్యుడగు యోగిరాజు శ్రీత్యాగరాజు

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారి పద్యములు.....

    ఘనతరాంచితమైన కర్ణాట సంగీత
    వాగ్గేయకార సత్ప్రణతుఁ డయ్యె;
    చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటి నాఁడు
    రాఘవోత్తమ కృతి ప్రవరుఁ డయ్యె;
    నిధికన్న రాము సన్నిధి చాల సుఖమంచు
    శరభోజి ధన తిరస్కారుఁ డయ్యె;
    వేన వేలుగఁ గృతు ల్వెలయించి దేశాన
    సంగీత లోక ప్రశస్తుఁ డయ్యె;
    ఆతఁడే 'జగదానంద' జాతకుండు;
    'కనకనరుచిరా' కృతి దివ్యకారకుండు;
    రఘు కులాన్వయు సద్భక్తి లబ్ధ యశుఁడు;
    ధన్య సంగీత సమ్రాట్టు "త్యాగరాజు"!

    సుగంధి:
    'ఎందఱో, మహానుభావు లెందఱో' యటంచుఁ దా
    విందుగన్ గృతుల్ రచించి విన్నవించి, రామునిన్
    డెందమందు నిల్పు భక్తుఁడే స్వరాట్టు గాను ని
    ల్చెం దగ న్మహోన్నతి న్వరించెఁ ద్యాగరాజిలన్!

    రిప్లయితొలగించండి
  10. నంద కారక జగదా నంద యనుచు
    నూట ఎనిమిది పేర్లను నుడివి పాడి
    నిధులు వలదని రాముస న్నిధిని కోరి
    తెరను తొలగించ మనివేడ తెరలు దొలగె !

    రిప్లయితొలగించండి
  11. సత్యనారాయణ మూర్తి గారూ,
    నాదోపాసన చేసిన త్యాగరాజుపై మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘శ్రీరాముని దయచేతను...’ పద్యానికి పేరడీగ" వ్రాసిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    సుందరమైన పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    వృత్యనుప్రాసతో మీ పద్యం శోభిస్తున్నది. అభినందనలు..
    మొదటి పాదంలో గణదోషం.. ‘గీతమ్ములకున్ స్వరసం....’ అంటే సరి!
    *
    డా. విష్ణునందన్ గారూ,
    త్యాగరాజును సన్నుతించిన మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    ఈ పద్యాలను మీ బ్లాగులోను ప్రకటించడం ముదావహం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    త్యాగరాజును గురించిన సమగ్రచిత్రాన్ని కళ్ళముందుంచారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యాలు అద్భుతంగా మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. అయ్యో అక్కయ్యా!
    బాగా లేకపోవడమా? చాలా బాగుంది.
    నేను ‘పద్యరచన’ తెరిచి వ్యాఖ్యలు టైప్ చేస్తున్న సమయంలో మీ మీ వ్యాఖ్య వచ్చి ఉండాలి. అందువల్ల అది నాకు కనిపించలేదు. తెరిచి ఉన్న పేజీని మూసి మళ్ళి తెరిస్తే కనిపించేది.. అదీ సంగతి...

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్య గారూ , ధన్యవాదాలు ! నిజానికి ఈ మధ్య ఆ ధర్మదండానికి - ఈ శంకరాభరణమే చోదక శక్తిలా పని చేస్తోందంటే అతిశయోక్తి కాదు . ఏమి వ్రాయాలో పాలుపోనప్పుడు శంకరాభరణమందించే అంశానికి స్పందించడం పరిపాటి అయింది .
    అందుకే ఈ మధ్య అడపాదడపా ఇవే విషయాలే ఇవే పద్యాలే అక్కడా చోటు చేసుకుంటున్నాయి - అందుకుగానూ మీకు , మరియు శంకరాభరణానికి నా కృతజ్ఞతలు !

    రిప్లయితొలగించండి
  14. స్వరరాగ సుధాయుత సద్భక్తియున్ గల
    సన్మార్గమే మోక్ష సాధనమ్ము
    నగుమోము గనలేని నా జాలినిదలంచి
    నన్ను పాలింపగా నడచి రమ్ము
    నిధి చాల సుఖమ ,యా నీరజాతాక్షు స
    న్నిధి సుఖమ యని ప్రశ్నించి నావు
    శాంతము లేకయే సౌఖ్యము లేదంచు
    పరమ సత్యమ్మును బాడినావు
    తెలుగువారి పుణ్యఫలమ్ము ,లలితరాగ
    తాళ సుస్వర సంగీత మేళనమ్ము,
    నీకృతులు ,యాధ్యాత్మిక నిధులు ,తరత
    రాల సంపద ,యో త్యాగరాజ ,విబుధ .

    రిప్లయితొలగించండి
  15. కమనీయం గారూ,
    ఆలస్యమైనా అమృతం వంటి పద్యాన్ని అందించి ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
    మొదటి పాదంలో ‘సుధాయుత’ అన్నప్పుడు గణదోషం. దానిని ‘సుధలొల్కు’ అని సవరిస్తే..?

    రిప్లయితొలగించండి