29, జులై 2012, ఆదివారం

పద్య రచన - 65


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. నా రచన (అముద్రితము) మనోమందిరి కృష్ణశతకమునుండి:

    రమణుల్ వెన్నెల వేళ నిన్ను హృదయాలన్ నిల్పి నీ వేణుగా
    నమునన్ దేలుచునుండ వారలకు నానందమ్ము పెంపొంద కృ
    ష్ణమయంబు బొనరించి సల్పితివి రాసక్రీడ బృందావనిన్
    యమునాతీర విహార! వేణుధర! కృష్ణా మన్మోమందిరా!

    లలనారత్నము లిద్దరుండ నడుమన్ రాజిల్లు గోపాలుడున్
    జలజాతేక్షణు లిద్దరుండ నడుమన్ భాసిల్లు వామాక్షినాన్
    వలయంబేర్పడ నైక గోపికలతో నందాత్మజశ్రేణితో
    దలపన్ తద్విభవమ్ము భద్రమగు కృష్ణా మన్మోమందిరా!

    మురళీగాన రసప్రసారముల నింపుల్ సొంపులన్ దేలి సం
    బరమున్ జెందిన గోపగోపికలు గోవత్సమ్ములున్ గోవులున్
    మరచెన్ బాహ్య జగమ్ము నావిధము నా మాధుర్య వైశిష్ట్యమున్
    దరమా మాదృశులున్ మదిం దలప కృష్ణా మన్మోమందిరా!

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    వేగంగా స్పదించి చిత్రానికి తగిన పద్యాలను మీ శతకంనుండి ఉటంకించినందుకు ధన్యవాదాలు. అన్నీ అద్భుతంగా ఉన్నాయి.
    మకుటంలో టైపాటు జరిగింది.‘మన్మనోమందిరా’ అని ఉండాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  3. సురనర్తకీ వృత్తము:
    వారిజేక్షణకు వారిజేక్షణకు వారిజేక్షణుడు మధ్యగా
    నీరజాక్షునకు నీరజాక్షునకు నీరజాక్షియును మధ్యగా
    చేరి వృత్తముగ నొప్పుచుండునెడ శ్రీవిభుం డలరి మధ్య నిం
    పార వేణురవ మాలపించె హృదయంగమంబయిన రీతిలో

    రిప్లయితొలగించండి
  4. అవునండీ! మకుటము: మనోమందిర కృష్ణ శతకము అనే ఉండాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    నే నన్నది పద్యాల చివర తప్పుగా టైపైన ‘మన్మోమందిరా’ అన్నదాన్ని గురించి. ాక్కద ‘మన్మనోమందిరా’ అని ఉండాలి కదా!

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! నమస్కృతులు. తప్పుకి మరొక తప్పు చెయ్యడము బాగుంటుంది కదా. అలాగే జరిగినది. శీర్షిక: మనోమందిర కృష్ణ శతకము. మకుటము: కృష్ణా మన్మనోమందిరా!. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. రామాయణ కాలంబున
    ప్రేమారగఁ గౌగిలించవేడిన వారే!
    భామామణులై కృష్ణుని
    తామెల్లరుఁగౌగిలించి ధన్యులుఁగారే?

    రిప్లయితొలగించండి
  8. నిబిడీకృతానంద నిశ్చలుండవు నీవు
    గొల్లపిల్లలతోటి యల్లరేమి?
    సర్వభూతమ్ములనుర్వి నిల్పిననీకు
    వేణుగానమునందు వేడుకెద్ది?
    ఆధ్యాత్మతత్వంబులతిశయించిన నీకు
    ఆడపిల్లలతోటి యాటలేల?
    జ్ఞానపూర్ణుడవైన మౌనితత్వమునీది
    సంసారబంధ సంచారమేల?

    సకలలోకాలధర్మసంస్థాపనార్యు
    ముజ్జగంబులు గొల్చెడి మూర్తివీవు
    లీలకరణిని కార్యముల్ హేలగతిని
    సల్పితివిదేవ, నా నమస్కారములివె.

    ( నిశ్చలానందుడై కూడ గొల్లపిల్లలతో, అన్నీ తనలో ఉంచుకొన్నవాడు వేణుగానము తో .... గాలిని బయటికి ఊదాలి కదా .... ఆధ్యాత్మ తత్వుడై కూడా ఆడపిల్లలతో, జ్ఞానము కలిగి కూడా సంసారములో ............ ప్రతివరుసలో నూ వ్యతిరేకార్థముతో చెప్పినాను

    తప్పులు సరిచేయవలసినదిగా గురువుగారిని ప్రార్థిస్తున్నాను ).

    రిప్లయితొలగించండి
  9. రమ్య బృందావనీ సీమ రమణు లలర
    నారి నారికి నడుమ మురారి మెరసె
    జలజలా పారు యమునలో జలములాగి
    చూచి పులకించి తరియించె చోద్యముగను.

    నిండు పున్నమి రేయెండ వెండి వోలె
    యిసుక తిన్నెల మెరయింప మిసమిసనవి
    గోపికల గూడి యాడెడు గోపబాలు
    గనుచు పులకించి తరియించె తనివి దీర.

    దట్టముగ నిల్చి యమున లోతట్టు పైన
    జట్లు గట్టిన చీకటి చెట్లు గూడ
    యింతులను గూడి క్రీడించు నిందు వదను
    నరసి పులకించి తరియించె నదె గనుండు.

    యెంత ధన్యులో గోపికా యింతు లహహ !
    యెంత ధన్యమొ యమునయు నిసుక తిన్నె
    లెంత ధన్యమో వృక్షము లెంచి చూడ
    రాస లీలను గని జన్మ రహితు లాయె

    రిప్లయితొలగించండి
  10. గోపాలుడు యమునాతటి
    గోపెమ్మలతోడనాడి గ్రోలెనుప్రేమన్
    తాపసులటమునువారలు
    గోపికలైరట తరింపగోవిందుదయన్ !!!

    రిప్లయితొలగించండి
  11. ఏమితపంబునన్ వనిత లీయమునాతటి నాట్యమాడిరో
    శ్యాముడు వారితోడ మనసారగ నొక్కొక గోపికమ్మతో
    యేమనిచెప్పగావలయు నీయదుపుంగవుడాడిపాడగా
    కోమలులందరున్ హృదయకోవెలలోగలకృష్ణుమ్రొక్కిరిన్!!

    రిప్లయితొలగించండి
  12. గగన మంతయు కుంకుమ కాంతు లీను
    రాస క్రీడల రాయంచ రమణు లంత
    యమున తటమున నుప్పొంగు మాధ వుండు
    సందె వేళల సరదాల సౌరు కురిసె !

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    హృదయంగమమైన నడకగల సురనర్తకీ వృత్తంలో మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ సీసపద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
    మీ పద్యాన్ని చదువుతుంటే కాసుల పురుషోత్తమ కవి ‘ఆంధ్రనాయక శతకం’ గుర్తుకు వచ్చింది.
    *
    మిస్సన్న గారూ,
    మనోహరంగా ఉంది మీ వర్ణన. అందమైన ఖండిక నందించారు. ధన్యవాదాలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ ఇంటి పేరు మంద యైనా మీ పద్యాలు అమందానందాన్ని కలిగించాయి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది. ‘మాధవుండు’ను ‘యదువిభుండు’ అందాం.

    రిప్లయితొలగించండి
  14. నా రెండవ పద్యము నాల్గవ పాదములో పొరపాటు దొర్లినది
    "హృదయ కోవెల " కు బదులు "తమదు కోవెల " గా చదువవలసిందిగా ప్రార్థన.
    శ్రీ పండిత నేమాని గారికి నమస్కారములు మరియు ధన్యవాదములు . భాషపై ,వ్యాకరణం పై తగినపట్టు ,అవగాహన లేక తెలియకుండా దొర్లుతున్న తప్పులు . మీలాంటి పెద్దలసహాహకారంతో కొన్ని తెలుస్తున్నా తెలుసుకోవలసినవి చాల ఉంటున్నాయి .వ్రాయాలని ఉన్నఉత్సాహమే అప్పుడప్పుడు పద్యాలను వ్రాయిస్తుంది

    రిప్లయితొలగించండి