16, జులై 2012, సోమవారం

సమస్యాపూరణం -764 (ఈతాకుల గుడిసెలోన)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్.

(`తెలుగులో సమస్యాపూరణములు’ గ్రంధంనుండి)

19 కామెంట్‌లు:

  1. ఈ సమస్యకు పూర్వపు పూరణ ఈ విధముగా నున్నది:
    సీతాపతి పూదోటనె
    ఏతామెత్తంగవలె గదేకువ వేళన్
    తాతా తొంగున్నావా
    ఈతాకుల గుడిసెలోన? ఇనుడుదయించెన్

    నా ప్రయత్నము ఈ విధముగ నున్నది:

    ఆతండొక రవి భక్తుడు
    ప్రాతఃకాలమున గొలువ భాస్కర దేవున్
    ప్రీతిన్ రవి దర్శనమిడె
    నీతాకుల గుడిసెలోన, నినుడుదయించెన్

    రిప్లయితొలగించండి
  2. నేతల తోటలు పెంచుతు
    జీతమునకు పనులు జేసి జీవిం చంగా !
    ప్రీతిగ కులికెడి జంటకు
    ఈ తాకుల గుడిసె లోన నినుఁ డుదయిం చెన్ !

    రిప్లయితొలగించండి
  3. నేతలు బండని బాటని
    చేతురు యాత్రలను బాస చేతురు నొసటన్
    వ్రాతను మార్తురె కంతల
    నీతాకుల గుడిసె లోన నినుఁ డుదయిం చెన్ !

    రిప్లయితొలగించండి
  4. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    ఆ తఱి యిన నిభ తనుఁడై
    సీతా లక్ష్మణుల తోడ శ్రీ రాముఁడు నా
    రాతి రట విడిది సేయఁగ
    నీఁతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్!

    రిప్లయితొలగించండి
  5. తాతా ! యేమని జెప్పుదు
    నీ తాకుల గుడిసె లోన నిను డుద యించెన్
    మీ తాతల నాటి మొదలు
    యీ తాకుల యిల్లు లేన ? యిప్పటి వరకున్

    రిప్లయితొలగించండి
  6. ఈతి జరా మరణఁబను
    నా తాకులవెట్లు తప్పునని వేడంగా
    ఆతురముగ మోక్షఁబొసఁగ
    నీ--తాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్
    మనవి: గుడిసె=శరీరము

    రిప్లయితొలగించండి
  7. నేమాని వారు ఇచ్చిన పూర్వపు పూరణ ఎవరిదో తెలియదు. కానీ చాలా చక్కని పూరణ. మూడవ పాదం తాతా తొంగున్నావా అనేది అద్బుతంగా కుదిరింది.ఇటువంటి చాటువుల్లో మనం గ్రామ్యమనో వ్యావహారికమనో వాటిని పరిహరిస్తే పద్యం అందం చెడుతుంది.చాటువులు పదికాలాల పాటు జనం నోళ్ళలో నానడానికి జీవలక్షణం-- ఇటువంటి వ్యావహారిక పదాల ప్రయోగమే .

    రిప్లయితొలగించండి
  8. ప్రీతిన్ శివగురు వార్యాం
    బాతల్లియుగొలువ జ్ఞాన భాస్కరుతాన
    ద్వైతాచార్యజననమది
    ఈతాకుల గుడిసెలోన, ఇనుడుదయించెన్

    రిప్లయితొలగించండి
  9. ఏ తావైనను నొకటే
    ప్రాతహ్ కాలమున లోకబాంధవునకు నా
    ''తాతా ''మందిరమైనను
    నీతాకుల గుడిసె లోన నిను డుదయించెన్.
    ఇనుడుదయింపన్ అంటే ఇంకా బాగుంటుంది కదా.

    రిప్లయితొలగించండి
  10. గుండా సహదేవుడు గారి పూరణ....

    కోతల కరెంటు బంపెను
    మా తోటకు, నీరు బెట్ట మాపటి వేళన్
    రాతిరి కునుకుగ నటనే
    ఈతాకుల గుడిసెలోన నిను డుదయించెన్.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    మీరు ప్రస్తావించిన పూర్వకవి పూరణ బాగుంది. ధన్యవాదాలు.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘పెంచుతు’ అనకుండా ‘పెంచుచు’ అంటే బాగుంటుంది.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదం అర్థం కాలేదు. ‘కంతల/ యీతాకులగుడిసె’ అనాలనుకుంటా.
    *
    మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ‘ఈ - తాకుల’తో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    మొదటి పాదాన్ని ‘ఈతి జరా మరణములను’ అనీ, మూడవ పాదాన్ని ‘ఆతురతను మోక్ష మొసగ’ అని మార్చండి.
    మీకింకా అరసున్నాల గురించిన అవగాహన రాలేదనుకుంటా. అర్ధానుస్వారాలను అసలే ఉపయోగించకున్నా ఏ దోషం లేదు. కాని వాటిని తప్పుగా ప్రయోగించరాదు. మీరు గమనించండి... నేమాని వారు అర్ధానుస్వారాలను ఉపయోగించరు.
    *
    పంతుల గోపాల కృష్ణారావు గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. చాలా సంతోషం. నేమానివారు ప్రస్తావించిన పూర్వపూరణను పరిశీలించి సముచితమైన వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు. శంకరాభరణం బ్లాగు కాని, బ్లాగు మిత్రులు కాని ఎప్పుడూ వ్యావహారికాన్ని కాని, గ్రామ్యాన్ని కాని కించపరచలేదు. కొన్ని సందర్భాలలో, అనుకరణలో, హాస్యోక్తిలో అటువంటి పదాలను పద్యాల్లో ప్రయోగించవచ్చునని నా అభిప్రాయం. మిత్రుల పూరణలలో అటువంటి పదాలు దొర్లినప్పుడు కొన్నింటిని చూసీ చూడనట్లు వదిలేస్తుంటాను.
    *
    చంద్రమౌళి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘ఆర్యాంబా తల్లి’ అనరాదు కదా!
    ‘....ఆర్యా
    మాతను గొలువంగ జ్ఞాన మార్తాండుడు న
    ద్వైతాచార్య....’ అని నా సవరణ....
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    విసర్గ టైపు చేయడంలో ఇబ్బంది పడ్డట్టున్నారు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పాతకముల పోగొట్టగ
    బాధితులను గావ యేసు పశువుల శాలన్
    ప్రీతిగ తా జన్మించెను
    ఈతాకుల గుడిసెలోన నిను డుదయించెన్.

    రిప్లయితొలగించండి
  13. ఆర్యా,

    ఆర్యాంబా అన్నది శంకరభగవత్పాదుల మాతృమూర్తినామముగదా. సీతమ్మ తల్లి అనుప్రయోగంలా ఇది.

    రిప్లయితొలగించండి
  14. ఈ తావున, నా తావున
    సైతము గాలికి నెగిరిన సందుల యందున్
    నా తోట లోని సొబగుల
    నీతాకుల గుడిసెలోన నిను డుదయించెన్.

    రిప్లయితొలగించండి
  15. చంద్రమౌళి గారూ,
    సీతమ్మ తల్లి వరకూ సరియైనదే. ఆర్యాంబ తల్లి అనవచ్చు. ‘ఆర్యాంబామాత’ అని సమాసం చేయవచ్చు. కాని ‘ఆర్యాంబాతల్లి’ అని సమాసం చేయరాదు.
    అంబ అంటే మాత కదా. ఆర్యాంబను ఆర్యామాత అనవచ్చు.
    *
    ఫణిప్రసన్న కుమార్ గారూ,
    ఈ బ్లాగులో యేసు ప్రస్తావన ఇదే మొదటి సారి అనుకుంటాను.
    చాలా మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. మాస్టారూ, మంచి సూచనలు చేసినందులకు ధన్యవాదాలు. ఒక్కొక్కసారి తప్పని తెలిసినా ఇంకా కొత్తవి నేర్చుకోవాలనే కుతూహలంతో ప్రయోగం చేస్తుంటాము. అందులో భాగమే అరసున్నాల ప్రయోగము. అసలవి వాడకుండా వ్రాయటం కష్టమని నేను అనుకొను. ఇంకా అవగాహన బలపడాలన్న విషయం తెలిసింది. ఆదిశగానే నేర్చుకొందామని ఆశ.

    రిప్లయితొలగించండి
  17. మా బండి చాలా లేటు.
    గురువుగారూ ధన్యవాదాలు.
    నా పూరణలోని మొదటి పాదానికి నా భావం:
    నాయకులు బండని, బాటనీ అంటే రచ్చ బండ అనీ, ఇందిరమ్మ బాట అనీ
    ఏవోవో పేర్లు పెట్టి జనం దగ్గరికి యాత్రలు చేస్తుంటారు. అని.
    ఇక కంతలన్ అంటే కంతలలోనుంచి అనుకున్నాను.
    అయితే మీరన్నట్లు కంతల యీతాకుల అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  18. గీతాచార్యుని గుడిలో
    నీతాకుల గుడిసెలోన, నినుఁ డుదయించెన్
    లేతగ దూరెను కిరణపు
    జ్యోతులు, భేదాలు లేవు సూర్యుని కిలలో .

    రిప్లయితొలగించండి
  19. తాతల కుగ్రామమునన్
    ప్రీతిగ తొంగొనగ రాత్రి ప్రేయసి తోడన్
    కోతులు చిల్లులు కొట్టిన
    నీతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్

    రిప్లయితొలగించండి