17, జులై 2012, మంగళవారం

సమస్యాపూరణం -765 (భాష రానివాఁడె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...


భాష రానివాఁడె పండితుండు.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. పరుష భాష రానివాడె పండితుండు భవ్యమౌ
    సరస భాషయందు మేటి సాహితీ జగత్తులో
    కరము కీర్తితో జెలంగు జ్ఞాన భాసురాత్ముడై
    వరమతిన్ ప్రశంస గూర్తు పండితోత్తమాళికిన్

    రిప్లయితొలగించండి
  2. గుండు మధుసూదన్ గారి పూరణం....

    సకల శాస్త్ర విదిత సద్ జ్ఞాన యుక్తుండు,
    సకల కావ్య సుపరిచయ యుతుండు,
    సకల జనులకును దొసఁగుఁ గూర్చునట్టి దు
    ర్భాష రాని వాఁడు, పండితుండు!

    రిప్లయితొలగించండి
  3. వచన మందలేదు వాచ్యము గాదది
    యాత్మ వస్తు నిర్గుణాత్మతత్త్వ
    మెట్లు తెలుప గలరు యేభాష లొచ్చిన
    భాష రాని వాఁడు, పండితుండు!

    రిప్లయితొలగించండి
  4. గురువు గారికి జన్మ దిన శుభాకాంక్షలు ,గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ

    నేమాని వారి వృత్తములో హాస్యముగా
    రచయిత తస్లిమా , సల్మాన్ రష్డిల పై దాడులను
    -------------
    కలము నుండి జారి పడ్డ కఠిన మైన పదములే
    బలము నిచ్చు మత ఖలులకు, ఫలము గాదు సత్యమున్
    కలియుగమున దెలుప దలచ, కలుగు లోని యెలుకలా
    బలుక బాష రాని వాడె పండితుండు పుడమిపై |

    రిప్లయితొలగించండి
  5. పరి తపించు చుండ పద్య రచన జేయ
    భాష రాని వా డె, పండి తుండు
    మౌన ముద్ర ధర ణ మొదటికే మోసము
    కలుగు నయ్య ! పండి తులకు నిలను

    రిప్లయితొలగించండి
  6. గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    ఆశువు నందుగాని, ఆధ్యాత్మికోపదే
    శమున గాని, కవన సభన గాని
    వాక్ప్రవాహమునను, వాకొన,పరదేశ
    బాష రాని వాడె పండితుండు

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    మీరు ‘ఉత్సాహం’గా చేసిన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మధుసూదన్ గారూ,
    మధురభావ శోభితమై ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    ఏమిటో? ఈ మధ్య మీ పూరణల్లో తాత్త్వికత అధికంగా కనిపిస్తున్నది! మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘ఒచ్చిన’ అనే పదం గ్రామ్యమే కదా! ‘ఏ భాష లెఱిగిన’ అందామా?
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఆశువు’ అంటే గణదోషం. ‘అశువు’ అనే పదం లేదు. అక్కడ ‘ఆశు వందు గాని’ అనాలనుకుంటా...

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్యగారూ,

    జన్మదిన శుభాకాంక్షలు. అభిరుచులలొ తాత్త్వికత నా మూలభావనేయైనా, పూరణాల్లో, సాందర్భికంగా, క్రొత్తగా చెప్పి మీబోంట్లకు అప్పగించాలనే కుప్పిగంతులేగాని, విశేష కారణాలేమీలేవు.
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  9. ఉచితమైన భాష,ఒప్పైన పదజాల
    సంపదలను రసిక జనులు మెచ్చ ,
    సభల మాటలాడి సరసమ్ము కానట్టి
    భాష రానివాడె పండితుండు.

    రిప్లయితొలగించండి
  10. తనదు రంగ మందు తర్ఫీదుఁబొందియు
    నేర్చుకొన్నవిషయనిర్వచనము
    పదుగుఱెదుటనర్థవంతమైబల్కుదు
    ర్భాషరానిఁవాడె పండితుండు!

    రిప్లయితొలగించండి
  11. తెలుప లేని మదిని మెండు తేనె లొలుకు సంపద ల్
    కలము నందు గుమ్మ రించి కవన మల్లు సొగసు గాన్
    చిలుక పలుకు లొలుకు వాని చింత లేదు భాష పై
    పలుక భాష రాని వాడె పండి తుం డె యౌని లన్ !

    రిప్లయితొలగించండి
  12. అమ్మ చూపు సోక నిమ్మైన కావ్యముల్
    వ్రాసె కాళిదాసు వాక్కు లబ్బి
    భాష రానివాఁడె పండితుండయె వింత
    యేమి జనని కరుణ కేది హద్దు?

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా!మీకు జన్మ దిన శుభాకాంక్షలు.


    నాటకమ్ము లోన నాకు వేషము నీయ
    నగదు నిత్తు చాల ననుచు బలుక
    మురిసి కవిని జేసె ముత్తయ్య నానాడు
    భాష రానివాడె పండితుండు.

    రిప్లయితొలగించండి
  14. మూక పంచ శతిని ముదముగా రచియించి
    మూక కవిగ నుండి ముక్తి పొందె
    దేవి వరము వలన దేదీప్య మానమై
    భాష రాని వాడె పండి తుండు !

    ఇక్కడ భాష = మాట

    రిప్లయితొలగించండి
  15. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘తర్ఫీదు’అనే అన్యభాషాపదాన్ని ప్రయోగించారు. అక్కడ ‘తా నేర్పుతోడను/ నేర్చుకొన్న...’ అంటే ఎలా ఉంటుంది?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    విశేషచ్ఛందాలను కూడా ధారాశుద్ధితో వ్రాస్తున్నారు. సంతోషం!
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. గురువుగారికి నమస్సులతో పద్య సవరణ :

    తనదు రంగ మందు ‘తా నేర్పుతోడను
    నేర్చుకొన్నవిషయనిర్వచనము
    పదుగుఱెదుటనర్థవంతమైబల్కుదు
    ర్భాషరానిఁవాడె పండితుండు!

    రిప్లయితొలగించండి