20, జులై 2012, శుక్రవారం

సమస్యాపూరణం -768 (కపిని వలచి గిరిజ)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

కపిని వలచి గిరిజ తపము సేసె.

(కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో)

11 కామెంట్‌లు:

  1. దక్ష యజ్ఞ మందు దహనంబు తానాయె
    సతిగ నున్న చ రిత సమసి పోయె
    తిరిగి జేర దలచి మరు రూపుగా వృషా
    కపిని వలచి గిరిజ తపము సేసె.

    రిప్లయితొలగించండి
  2. పరమ శివుడె తనకు పతియును, గతియును,
    ధృతియుననుచు నతుల దీక్ష బూని
    యా మహేశు కరుణ నర్థించుచును వృషా
    కపిని వలచి గిరిజ తపము సేసె

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ

    వరంగల్ లో ఒక గ్యాంగ్ స్టార్ విజటింగ్ కార్డు ప్రింటింగ్ జేసి పంచుతుండెను.
    అటు వంటి వారు కష్టములలో కాపాడగలరని భావించిన యువతి గిరిజ
    ----
    కలియుగమున ఖలులు కీర్తి గాంచ , దలచె
    సజ్జనుల సాంగత్యము 'జగతి ' నందు
    పాడి గాదని దనను గాపాడి నట్టి
    కపట గపిని వలచి గిరిజ తపము సేసె |

    రిప్లయితొలగించండి
  4. తీవ్ర తపము జేయు దేవితో పలికె"నే
    కపిని వలచి గిరిజ తపము సేసె"
    నంచు శివుడు దానె యచటికి ముదుసలి
    వేషమునను, చూచి బేల నచట.

    రిప్లయితొలగించండి
  5. ప్రీ తి కలిగి లక్ష్మి పెండ్లి యాడెను గద !
    కపిని వలచి , గిరిజ తపము సేసె
    శివుని దాను పెండ్లి చేసి కొనంగను
    ఆదు కొం ద్రు మనల నాలు మగలు

    రిప్లయితొలగించండి
  6. శివుని నమ్మి గొలిచి చిత్తమ్మునున్ జేర్చి
    పశుపతీశునందు భక్తి యనెడు
    త్రాటితోడ గట్టి తగ మానసమ్మను
    కపిని, వలచి గిరిజ తపము సేసె

    రిప్లయితొలగించండి
  7. విశ్వ మంత నేలు విశ్వరూపు డతడు
    మసన మందు దిరుగు మహిమ గలిగి
    పునుక ధారియైన పూజనీయ డనగ
    కపిని వలచి గిరిజ తపము సేసె !
    --------------------------------------------
    నిండు చంద మామ మెండు కాంతులు విరిసె
    ముదము గలిగె సుదతి వదన మందు
    మదన రూప మనుచు మనమున పొంగార
    కపిని వలచి గిరిజ తపము సేసె !

    రిప్లయితొలగించండి
  8. కత్తి పిచ్చి రాజు కపియని పేరొంది
    సాఫ్టువేరు పోస్టుచక్కబెట్ట
    పేరు పిచ్చి గాని జోరైన వాడని
    కపిని వలచి గిరిజ తపము సేసె!
    (ఇక్కడ గిరిజ పార్వతీ మాత కాదు)

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారి పూరణ....

    సీ.
    హరుని నర్చించియు నత్యనురాగాన,
    బహురూపు నెడఁదలో భక్తిఁ దలఁచె;
    త్ర్యంబకుఁ గొలువంగ దాసియుఁ దానయ్యు,
    నపరాజితు సఖిగ నతివ నిలిచె;
    నాత్మనివేదన మ్మది శర్వునకు నిడి
    యును, గపర్దికిని వందనము నిడియె;
    శంభుని గుణగణ శ్రవణ యయ్యును దాను,
    రైవతుఁ గీర్తించె రమ్యముగను;

    గీ.
    పాద సేవనముఁ గపాలికిఁ జేయంగ,
    దిన దినమ్ము ప్రేమ దీప్తమయ్యె!
    కడఁకఁ బూని, తా, మృగవ్యాధుని, వృషా
    కపిని వలచి గిరిజ తపము సేసె!!

    రిప్లయితొలగించండి
  10. హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ------
    పండిత నేమాని వారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    -----
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    -----
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    -----
    సుబ్బారావు గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    కాని లక్ష్మి కపిని వలచుటలోని ఔచిచ్యం తెలియలేదు.
    -----
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    -----
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    -----
    మధుసూదన్ గారూ,
    నవవిధ భక్తి మార్గాలతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    మీ భావన సరి యైనదే. లక్ష్మీదేవి గారు చెప్పేదాక నాకు తట్టలేదు. మన్నించండి.

    రిప్లయితొలగించండి