22, జులై 2012, ఆదివారం

సమస్యాపూరణం -770 (రాముని వెంట రాముఁ గని)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

రాముని వెంట రాముఁ గని రాముని సంఘము సంతసించుచున్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

  1. రాముడు లోకరక్షకుడు రాక్షస బాధలనుండి బ్రోచుచున్
    క్షేమము గూర్చు నెల్లరకు శ్రీహరి యాతడటంచు గోరి యా
    స్వామిని గాధినందనుడు సానుజుగా గొని తెచ్చె నంచు నౌ
    రా! ముని వెంట రాముగనిరా ముని సంఘము సంతసించుచున్

    రిప్లయితొలగించండి
  2. మాస్టారూ, సమస్య పాద నిర్మాణంలో చిన్న సందేహం. రాముని-వెంట-రాముని-గని-రాముని-సంఘము- సంతసించుచున్ అన్న రకంగా ఇవ్వటం వల్ల అసంపూర్తిగా ఉంది కదా! అలా టైపు చేసి సమస్యనివ్వవచ్చునా? పదములను విరచి రాముని-వెంట-రాముని-గనిరా-మునిసంఘము సంతసించుచున్ అన్నచో అర్థవంతంగా ఉన్నది. అది పూరకుని ఊహా జనితము కదా! మరి సమస్యని రెండవరకంగా టైపు చేసి ఇవ్వవలెనా?

    రిప్లయితొలగించండి
  3. మన తెలుగు వారి వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను . అంతే కాక , మునిసంఘము అన్నప్పుడు ప్రథమైక వచనము - దాని క్రియాపదము కనెను , చూచెను అని ఉండవలసినది. పండిత నేమాని గారి పూరణ ప్రకారం చూస్తే , ' ముని సంఘము రాముని గనిరి ' అనడం కొరుకుడుపడని విషయం . ' మునిసంఘము రాముని గనెను ' అన్నదే అసలైన క్రియారూపాన్ని సూచిస్తుందని భావన !

    రిప్లయితొలగించండి
  4. సమస్యను ఇచ్చిన విధానంలోనైతే పెద్ద ఇబ్బంది లేదు. అన్వయం పూర్తిగా సమస్యాపూరకుని బాధ్యతే , కనుక పద విభాగం ఎలా చేసి ఇచ్చినా తప్పేమీ లేదు. కాని వ్యాకరణ సంబంధిత విషయమే ఇబ్బంది పెడుతున్నది.

    "జానేదో సినిమాకు లాలు బహు పూజ్యంబౌ మునీశాళికిన్" ( సమస్యను చదివిన / పలికిన / వ్రాసిన విధానంలో ,పదవిభాగం ప్రకారం అన్వయం / అర్థం లేకపోవడం గమనించదగినది) అని ఇస్తే , రాజా ! నే దోసిని ; మా కులాలు బహు పూజ్యంబౌ మునీశాళికిన్ అని పూర్తి చేసిన సందర్భం కూడా ఉదహరించదగినదే !

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పూరణ....

    ఓమగ జన్నమా; యసుర యూధముఁ గూల్చఁగఁ; దాటకన్మహో
    ద్దామతరాశుగమ్మున యథార్థను యక్షిణిగా నొనర్చ; నా
    రామ గతార్త సుప్తశిల, రమ్య నహల్యగ మార్చఁ; గన్నులా
    రా, మునివెంట రాముఁ గని రా మునిసంఘము సంతసించుచున్!

    రిప్లయితొలగించండి
  6. డా. విష్ణునందన్ గారూ,
    మీ అభిప్రాయం సహేతుకం. కవిమిత్రుడు పంపిన సమస్యను లోతుగా పరిశీలించకుండా కాపీ - పేస్ట్ చేయడం జరిగింది. మీరు చెప్పే వరకూ ఆ దోషం నా దృష్టికి రాలేదు. ధన్యవాదాలు.
    ‘రాముని వెంట రాముఁ గని రా మునిరాజులు సంతసించుచున్’ అని సవరిస్తే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  7. అయ్యా!
    మునిరాజులు అనే కన్నా మునివర్యులు అంటే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. శంకరయ్య గారూ !ఈ సమస్య లోని క్లిష్టత ' రాముని ' , ' రాము ' , ' రాముని ' ( రాముని సంఘము అనేప్పుడు వచ్చే ఆ షష్ఠీ విభక్తి గమనింపదగినది ) అనే పదాల పౌనఃపున్యం తో వచ్చే గందరగోళం మీద ఆధారపడి నిర్మింపబడినది.

    రాముని వెంట రాముగనిరా మునిరాజులు సంతసించుచున్ అనడంలో ఆ అసందిగ్ధత తొలగిపోయి సమస్య సరళమైపోతుంది . కానీ మార్గాంతరం లేదు కాబట్టి అదే శరణ్యం.

    రిప్లయితొలగించండి
  9. డా.విష్ణునందన్ గారూ, సమస్య పాదాన్ని మొదట చూడగానే ఏదో పొసగలేదని అనిపించింది. మీ వివరణతో నామనసులోని మాట వెలివడింది. మబ్బులు తొలిగాయి. ఇప్పుడు "రాముని వెంట రామునిగని రాముని రాట్టులు సంతసించుచున్" యెలా వుంది?

    రిప్లయితొలగించండి
  10. గురువుగారికి నమస్సులు.
    సమస్య గురించిన తప్పొప్పుల మధ్య నా ప్రయత్నము:

    రాముని సీతగన్ నటుడు రాముడు వేషము గట్టియాడగన్/రామవివాహఘట్టజనరంజకమౌ నటనమ్ముజూచి,మా/రాముడె పాత జన్మమున రామయె నంచును భ్రాంతినొంది రా/రాముని వెంటరాముఁగని రాముని సంఘము సంతసించుచున్!

    రిప్లయితొలగించండి
  11. ఏమదికోరెనోమునిని యేనది రామునిజూడనెంచెనో
    ఆ మునియాన రాఘవుడు యంతటితాటకినేలగూల్చగా
    రా మునివెంటరాముగని రా మునిసంఘముసంతసించుచున్
    ఆమని సాక్షిగా గొలిచె నారఘు వీరునికీర్తిచంద్రికల్ !!!

    (ముని, రా ముని = రాచముని విశ్వామిత్రుడు )

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ ప్రశ్న చిన్న చర్చకు దారితీసి సందేహనివృత్తికి దోహదపడింది. అభినందనలు.
    *
    డా. విష్ణువందన్ గారూ,
    మీరు చెప్పిన ‘జానేదో సినిమాకు...’ సమస్య , దాని పూరణ ఆసక్తికరంగా ఉంది.
    ధన్యవాదాలు.
    *
    మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ ప్రయత్నం. అభినందనలు.
    *
    పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురువు గారు,
    మీరేమన్నా మార్చబోతున్నారేమో అని ఊరుకున్నా, చర్చ చూసి.
    ఇక ఇప్పుడు నా పూరణ.
    కోమలయైన జానకిని కూరిమి పత్నిగ స్వీకరించె, నా
    భామను వెంట బెట్టుకొని భర్తగ నాతడయోధ్య కేగు, శ్రీ
    రాముడె, విష్ణువై పరశు రాముని దాక; జయమ్ము బల్కె, లే
    రా! ముని వెంట రాము!! గని రాముని, సంఘము సంతసించుచున్.

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీదేవి గారూ,
    చర్చ తరువాత ‘మునిరాజులు’ అని మార్చాలనుకుని మరిచిపోయాను.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. రాముడు: "అగ్గి" రామునకు రాముడు వచ్చెను "తోట" రాముడా
    రాముని వెంట రాగనిక రాముడు శీఘ్రమె "దొంగ" రాముడా
    రాముని వెంట వచ్చెనుగ రమ్యపు రీతి భళా భళా "భలే"
    రాముని వెంట రాముఁ గని రాముని సంఘము సంతసించుచున్

    రిప్లయితొలగించండి