8, జులై 2011, శుక్రవారం

సమస్యా పూరణం -386 (అచ్చతెనుంగు పద్యమున)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అచ్చతెనుంగు పద్యమున
నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. అచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె? శోభఁ గూర్చురా?
    వచ్చియుఁగోరవేలనిక వారిజ నేత్రుఁడ! బాగుబాగురా!
    ఇచ్చకలుంగగా తెనుఁగు నిప్పుడె పద్యమునే లిఖింపగా,
    నిచ్చట, నేను నిచ్చటనె నేర్పుదు నీకుతెనుంగుపద్యమున్.

    (అచ్చతెనుంగున ఆంగ్లపదములా? శోభగూర్చునా? నావద్దకు వచ్చీఅడగవేం? భలే వాడివే, ఇప్పుడే నీకు నేర్పుతాను అచ్చతెనుంగున వ్రాయుట.)

    రిప్లయితొలగించండి
  2. ముచ్చట గొల్పు తెల్గు యిది మోముకు శోభయె మాటలాడ,నీ
    కిచ్చిన లడ్డు మీద గన కిస్మిసు కాజు పసందు గూర్చుగా!
    మెచ్చగ వచ్చు దాని రుచి మిన్నగ జేసెడు వర్ద్స్ వాడగన్
    అచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా !!

    రిప్లయితొలగించండి
  3. పచ్చని బైరు మధ్యమున బన్నుగ నొప్పిన బందికొక్కులున్
    వెచ్చని వెల్లువందుటను వెల్గిన జచ్చిన జీకురాయిలున్
    ముచ్చట ముద్దుగుమ్మటల ముగ్గులఁ గూడిన నింటి చెత్తయున్
    అచ్చ తెనుంగు పద్యమున నాంగ్ల పదంబులు శోభఁగూర్చునే ???

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    మూర్తీజీ ! మీ బాట లోనే నేనూనూ !
    01)
    ______________________________________________

    పిచ్చిగ పేలినంత , యది - పెద్దన జెప్పిన పద్య మౌ నటోయ్ !
    అచ్చెర మచ్చెకంటి బలె - యద్భుత మైనది తెల్గు భాష ! యే
    మ్రుచ్చులు పల్కిరట్లు ? విన ,- మోసము వచ్చును మాతృభాషకున్ !
    అచ్చతెనుంగు పద్యమున - నాంగ్ల పదంబులె శోభఁ గూర్చురా ?!?!
    ______________________________________________

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జులై 08, 2011 10:09:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    ముచ్చట గొల్పుదత్తపది మోదము నొందగ నాంగ్లభాషలో
    నిచ్చిన నేమి తా విరచెనే యవధాని మనోహరంబుగా
    మెచ్చగ తెల్గులో నిమిడె మేటిగ, భాషలు సాటిరావు యీ
    అచ్చ తెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభ గూర్చురా

    రిప్లయితొలగించండి
  6. 02)
    ______________________________________________

    గొచ్చెపు సూదుల న్మిగుల - గుండెల లోతుల గుచ్చినట్లుగా
    చిచ్చును కంటిలోన, నిడ - చిందిన వెచ్చటి నీటి ధారగా
    పచ్చని లడ్లు తిన్నపుడు - పంటికి దొర్లిన రాయి కైవడిన్
    అచ్చతెనుంగు పద్యమున - నాంగ్ల పదంబులె శోభఁ గూర్చురా !!!
    ______________________________________________
    గొచ్చెము = గుత్తి, సమూహము

    రిప్లయితొలగించండి
  7. పచ్చల హారమందు పొలుపై పలు రత్నములద్దినట్లు,వి
    వ్వచ్చుడనంగ నాంగ్లమును వాడుచు తెన్గున పద్యమల్లి,క
    మ్మచ్చునదీర్చుగోలిహనుమంతుని పద్యముహృద్యమైచనన్
    అచ్చతెనుంగుపద్యమున నాంగ్లపదంబులెశోభగూర్చురా

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    --- బ్లాగు:సుజన సృజన

    రిప్లయితొలగించండి
  8. అచ్చతెనుంగుపద్యమున నాంగ్లపదంబులె శోభ? గూర్చురా,
    మెచ్చ,జనంబులెల్లెడను మేలుఁదెనుంగున పద్యమింక; నే
    చిచ్చరకంటివాని వలె జీరలుఁ గన్నుల నెఱ్ఱఁబాఱగాఁ
    వచ్చితి, నిన్నుఁజూడుమిక భస్మముఁజేసెద, కంటిచూపుతోన్.

    రిప్లయితొలగించండి
  9. అచ్చపు చీకటింబడుచు నాంగ్లమె సర్వమటంచు సొక్కుచున్
    సొచ్చెపు మాతృభాషనది ప్రక్కన బెట్టి పరాయి భాషలన్
    మెచ్చెడి మేకవన్నియల మేటిపులుల్బలు మచ్చమవ్వారికిన్
    అచ్చతెనుంగు పద్యమున నాంగ్ల పదంబులె శోభఁ గూర్చురా!
    మనవి: పద్యం ఎత్తుగడ మనపోతనగారిదే. కావున ఈపద్యం వారికంకితము.
    సొచ్చెము=స్వచ్ఛము; మచ్చము=గుఱుతు

    రిప్లయితొలగించండి
  10. రెండవ పాదంలో యతి మైత్రి గూర్చి:
    అచ్చపు చీకటింబడుచు నాంగ్లమె సర్వమటంచు సొక్కుచున్
    సొచ్చెపు మాతృభాషనది సొంపుగ గానక రాతి భాషలన్
    మెచ్చెడి మేకవన్నియల మేటిపులుల్బలు మచ్చమవ్వారికిన్
    అచ్చతెనుంగు పద్యమున నాంగ్ల పదంబులె శోభఁ గూర్చురా!

    రిప్లయితొలగించండి
  11. అచ్చ తెనుంగు కావ్యమున కర్థము చెప్పగ నేడు శక్యమే?
    అచ్చ తెనుంగు తీపి నుడు లాడుచు ముచ్చట తీర్చు వారలున్
    మచ్చున కేని కానరు సుమా ! మరి యిత్తరి నెట్టి తీరునన్
    అచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా?

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందరి పూరణలు ముచ్చటగా నున్నవి !

    02 అ)
    ______________________________________________

    గొచ్చెపు సూదుల న్మిగుల - గుండెల లోతుల గుచ్చినట్లుగా
    చిచ్చును కంటిలోన, నిడ - చిందెడు వెచ్చటి నీటి రీతిగా
    పచ్చని లడ్లు తిన్నపుడు - పంటికి దొర్లిన రాయి కైవడిన్
    అచ్చతెనుంగు పద్యమున - నాంగ్ల పదంబులె శోభఁ గూర్చురా !!!
    ______________________________________________
    గొచ్చెము = గుత్తి, సమూహము
    చిచ్చు = నెరుసు =నిప్పురవ్వ

    రిప్లయితొలగించండి
  13. మందాకిని గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
    ‘కంటిచూపుతోఁ జంపెడి ఘనులు గలరు’ అని నేను ఇంతకు ముందు సమస్య ఇచ్చినట్లు గుర్తు!

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘.. జీకురాయిలున్’ అన్నచోట ‘ .. జీకురాలు బల్’ అందాం.

    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    గోలి వారిని సవ్యసాచిని చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    ‘రాతి భాషలు’ లాతిబాసలు అయితే ? మూడవపాదాంతంలో గణదోషం దొర్లింది.

    మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా ! ధన్యవాదములు.
    రాజా రావు గారూ ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారూ ధన్యవాదములు. మీ సవరణ బాగుంది. రాయి + లు = రాలు గదా !

    రిప్లయితొలగించండి
  18. మాస్టారూ, "లాతి" చక్కగాసరిపోయింది. మెరుగు దిద్దినందుకు ధన్యవాదాలు. గణదోషం సవరించాను.

    రిప్లయితొలగించండి
  19. "రంగరాయ వాస్తవ శతకం"


    వచ్చియు రాని యాంధ్రమున వ్రాయగ బోవగ కైతలందునన్
    పిచ్చివి పద్యముల్ శతము పిండుచు హాస్యము పాలిటిక్సునన్
    ముచ్చట లెన్నియో తెలుప మూఢుల చేష్టలు రంగరావుకు
    న్నచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా!

    రిప్లయితొలగించండి