10, జులై 2011, ఆదివారం

సమస్యా పూరణం -388 (అరయంగా ద్రుపదసుతకు )

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్.
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. పొరబాటని తా జెప్పడు
    మరి భారతమున్ జదువడు మా సుబ్బారావ్
    సరి నేనని వాదించును
    "అరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్."

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణ తో..

    పొరబాటని తా జెప్పడు
    మరి భారతమున్ జదువడు మా సుబ్బారావ్
    సరి సగము దెలిసి చెప్పును
    "అరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్."

    రిప్లయితొలగించండి
  3. మరి, సుతులభిమన్యుడితో
    అరయంగా ద్రుపద సుతకు నార్గురు; భర్తల్
    మురియగ పెంచెను నెల్లర
    ను,రమణి ప్రేమను ;సపత్ని నొప్పెను ప్రీతిన్.

    సపత్ని+ ఒప్పెను

    రిప్లయితొలగించండి
  4. సురపతి రూపము లైదుగ
    ధర కృష్ణకు భర్త లాయె, తానా కర్ణున్
    పరిణయ మాడదు, ఎవరని-
    రరయంగా, ద్రుపద! సుతకు నార్గురు భర్తల్ ?

    రిప్లయితొలగించండి
  5. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, జులై 10, 2011 9:10:00 AM

    విరివిగ జదివితి భారత
    మరయంగా,ద్రుపద సుతకు నార్గురు భర్తల్
    సరికాదని వాకృచ్చితి,
    హరిరక్షణమందువారికశుభము గలదే.

    రిప్లయితొలగించండి
  6. వరసుత,నామాట వినిన
    ధరనేలగవచ్చు కుంతిదనయుడవై,దా
    మరనేత్రియుబట్టు కరము
    నరయంగాద్రుపద సుతకు నార్గురు భర్తల్ !!!
    (దాన వీర శూర కర్ణ లో కృష్ణుడు కర్ణునితో తన జన్మ రహస్యమును దెలిపి పాండవ పక్షము వచ్చిన కలుగు సుఖములను గూర్చి చెప్పిన సందర్భము దృష్టిలో బెట్టి చేసిన పూరణ .)

    రిప్లయితొలగించండి
  7. శ్రీపతిశాస్త్రిఆదివారం, జులై 10, 2011 2:58:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    సరిచేయుడు తప్పులనున్
    ఇరువది ప్రశ్నలకు ననుచు నిచ్చిరి గురువుల్
    పరికించగ నందొక్కటి
    'అరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్

    గురువుగారు, నిన్నటి మీ సూచనలకు ధన్యవాదములు.ఈరోజు సమస్య క్లిష్టంగా ఉన్నది. పూరించలేక సమస్యగానె ఉంచాను. మన్నింపప్రార్థన.

    రిప్లయితొలగించండి
  8. తరుణిని గెలువగనె శకుని
    మురియుచు దుర్యోధను గని ముదమున ననియెన్
    ధరణీశా ! నీతో నిక
    నరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్

    హరియడుగగ మదిదెలిపెడు
    తరి-గర్ణుని బెండ్లియాడు దల పెరిగించెన్
    మరి యామె తలపు మేరకు
    నరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్

    --- వెంకట రాజారావు . లక్కాకుల
    --- బ్లాగు: సుజన సృజన

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సుబ్బారావు పూరణ బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    వాహ్! అద్భుతమైన పూరణ. అభినందనలు.
    కాకుంటే చివరి పాదం కొద్దిగా గందరగోళంగా ఉంది.
    ‘తరుణియె పెంచెను సపత్ని తనను పొగడగా’ అంటే ఎలా ఉంటుంది?

    మిస్సన్న గారూ,
    మీ ప్రశ్నార్థకమైన పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. గురువుగారూ, ధన్యురాలను.
    మీరు చెప్పినది బాగుంది."పెంచెను" పునరుక్తి దోషనివారణకై తరుణీ మణిఁదన అందాం.


    మరి, సుతులభిమన్యుడితో
    అరయంగా ద్రుపద సుతకు నార్గురు; భర్తల్
    మురియగ పెంచెను నెల్లర
    తరుణీ మణిఁదన సపత్ని తనను పొగడగాన్.




    అలాగే పెద్దలు మన్నిస్తారని ఆశిస్తూ ఒక చిన్న మనవి. ఇక్కడ సమస్యాపూరణానికై కొన్ని పూరణల్లో ద్రౌపది ఆరువ భర్తగా ఎవరినైనా గాని తలచిందని పూరణ చేసినా, సౌశీల్యవతి ద్రౌపది నిజానికి అలా తలచేది కాదని చదువరులు గమనించాల్సిందిగా నా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  11. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    సమస్య పాదాన్ని చక్కగా సమర్థించారు. బాగుంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ తప్పొప్పుల పూరణ శ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
    ‘తప్పులనున్ + ఇరువది’ అనడమే కొద్దిగా బాగా లేదు.‘సరియో కాదో తెలుపుం/ డిరువది ప్రశ్నలకు ..’ అంటే?

    రిప్లయితొలగించండి
  12. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మొదటి పూరణ చాలా బాగుంది.
    లోకంలో ప్రచారంలో ఉన్న పుక్కిటి (సినిమా)కథను రెండవ పూరణకు ఆలంబన చేసుకున్నారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    కాని మనవంటి విద్యావంతులు ఇటువంటి కథలను ప్రచారం
    చేయవద్దు. ద్రౌపది పతివ్రత. కర్ణుని ద్వేషించిందే కాని ఎప్పుడూ
    కోరుకోలేదు.

    మందాకిని గారూ,
    నేను చెప్పాలనుకున్న విషయాన్ని మీరే ముందుగా చెప్పారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతిశాస్త్రిఆదివారం, జులై 10, 2011 9:34:00 PM

    గురువుగారు ప్రశ్నపత్ర్తాలను ఉపాధ్యాయులు తయారుచేస్తెనే అందంగా ఉంటంది.చక్కని సవరణ చేసినారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. పెద్దలు మన్నించాలి .నాపూరణ మీకు తప్పు గా అని పించి యుండవచ్చు. కాని యిది వ్యాస విరచిత భారతం లో అరణ్య పర్వం లో ద్రౌపది కోరగా బంగారు మామిడి పండు నర్జునుడు తెగ వేయడం - మళ్ళీ దానినతికించే సంఘటనలో విఫలమవడం- మీ మీ మనసుల్లో ఉన్నది చెబితే అతుక్కుంటుందని హరిచెప్పగా ద్రౌపది తనకు కర్ణుని వివాహమాడాలని ఉందనీ అంటూ "యోనిర్ ద్రవతి కేశవా" అన్న మాట కాదంటారా? వ్యాస భారతం పుక్కిటి పురాణమైతే మన్నించండి . --- రాజారావు

    రిప్లయితొలగించండి
  15. రాజారావు గారూ,
    నాకు తెలిసినంత వరకు ఆ ఘట్టం వ్యాసభారతంలో గాని, కవిత్రయ భారతంలో గాని లేదు. కృష్ణునితో ద్రౌపది ఆ మాట అన్నది వాస్తవమే. కాని అది వేరే సందర్భంలో.

    రిప్లయితొలగించండి
  16. మందాకిని గారూ,
    మీ పద్యాలు చూసిన వారెవరూ, మీరు ఈ మధ్యనే పద్యాలు వ్రాయటం మొదలు పెట్టారంటే నమ్మరు.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. వూకదంపుడు గారూ,
    మీ ప్రశంసలకు పాత్రురాలయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. విరివిగ మేకల కుమ్ముచు
    బరువున నిద్దరికి సాటి భండన భీముం
    డరచుచు ప్రేమను చాటగ
    నరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్


    రిప్లయితొలగించండి