16, అక్టోబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 125

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
కాంక్ష లుండవు ప్రజలకుఁ గలి యుగమున.

15 కామెంట్‌లు:

 1. శ్రీ శంకరయ్య గారు మీకు దసరా శుభాకాంక్షలు
  శంకరాభరణమే సాహిత్య మణి రత్న
  మాలయై శోభాయమాన మయ్యె ,
  పూర్వ కవీంద్రుల భూరికావ్యము లోని
  పద్యచమత్కృతి ప్రాభవాలు
  పదపదంబున దాగి పరికించు మనిగోరు
  ఆ ప్రహేళికలపై ఆశలూరు
  పూరణ చరణాల పూరణల్ సవరించి
  పూర్ణత జేకూర్చు పూజ్య గురువు
  దత్తపదు లెన్నొ మాలలో దాగియుండు
  గళ్ళనుడి కట్టు పదరీతి గతులదెలుపు
  ఎన్నగా జూడ భాషకు వన్నె గూర్చ
  సఫల మయ్యారు గురువు శ్రీ శంకరయ్య !.

  గన్నవరపు మూర్తి మిన్నగా జెప్పును
  చంద్ర గారు జెప్పు చక్క గాను ,
  నేదునూరి వారు నేర్పుగా చెబుతారు,
  అంద రికిని దసర వంద నములు .

  యీ బ్లాగులో పాల్గొంటున్న , వీక్షిస్తున్న మిత్రు లందరికి
  వి జ య ద శ మి శుభాకాంక్షలు .

  రిప్లయితొలగించండి
 2. నృపుల కనులార గాంచిరి కృతము లోన
  ప్రీతి గొలిచిరి శ్రీరాము త్రేత మందు
  నేటి నేతల దలుపగా ఏటి కంచు
  కాంక్ష లుండవు ప్రజలకు కలి యుగమున!

  రిప్లయితొలగించండి
 3. ఒంటి కాలిపై ధర్మము గుంటి సేయ
  కరుణ హీనతఁ దన్నెను కలిపురుషుడు
  తనువు దనరగఁ దనలోన ధర్మ మందు
  కాంక్ష లుండవు ప్రజలకుఁ గలియుగమున

  రిప్లయితొలగించండి
 4. శంకరయ్య గురువరేణ్యులకు, మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
  మంద పీతాంబర్ గారూ దంచిపడేసారు.

  రిప్లయితొలగించండి
 5. రావణు పరదార వాంఛయె లంక గూల్చె
  చీకురాజు పుత్రేచ్ఛయె చేటు జేసె
  నమ్మదగునెనీ మాటలు నవ్వి పోర
  కాంక్ష లుండవు ప్రజలకుఁ గలియు గమున.

  మనవి: చీకురాజు=ధృతరాష్ట్రుడు

  రిప్లయితొలగించండి
 6. ధన్య వాదములు. పీతాంబర్ గారు." మీ వందనములకు అభినందనములు.' అందరికి విజయ దశమి శుభా కాంక్షలు.గురువులు,బహుముఖ ప్రజ్ఞాశాలి ' శంకరయ్య గారికి ప్రత్యేకాభి నందనలు.

  రిప్లయితొలగించండి
 7. ప్రీతి తోడ జెపును పీతాంబరు గారు
  గన్నవరపు జెప్పు గగన మెరుపు
  చంద్ర గారు జెప్పు చంద్రుని వెలుగంత
  సరస గతిని నేర్పు శంకర గురువర్య.
  వందనమ్ము లివియె యందుకొను మందరు
  దోస మెంచ వలదు దశమి గనుక

  రిప్లయితొలగించండి
 8. మరొక పురణండీ :

  మదిరపానము ద్యూతము మదనకేళి
  పసిడిరాశులు నందుట బరిధి లేక
  నింద్రియేచ్చల మసలుదు రితర మైన
  కాంక్షలుండవు ప్రజలకుఁ గలి యుగమున

  రిప్లయితొలగించండి
 9. శంకరాభరణముకు మణిమాల కట్టారు, పీతాంబర్ గారూ, శంకరయ్య గారికి మంచి విజదశమి కానుక సమర్పించినందులకు మీకు కృతజ్ఞతలు,అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. రాక్ష సాగ్రజు లందరు రాజు లైరి
  పాంచ జన్యులు పాలించు పాప జగతి
  కామ్య మెక్కడి దిలలోన కాక బతుకు.
  కాంక్ష లుండవు ప్రజలకు గలియు గమున

  కాక = శాపము,కాని,తక్కువ,కలుగక,వికల్పము

  రిప్లయితొలగించండి
 11. రాజేశ్వరిగారూ
  మీకు కృతజ్ఞతలు. దశరాకి మీకు ప్రత్యేక అభినందనలు. దుర్గని మేము రాజరాజేశ్వరి నామధేయం తోనే కొలుస్తాము. శంకరాభరణంలో మీది ప్రత్యేక స్థానం. కారణం మీ పద్యాల ప్రత్యేకతే. చంద్రశేఖర్ గారూ మనం ఎలాగా మాట్లాడుకొంటాము, మీకు,మిస్సన్నగారికి మిగిలిన మిత్రులకు కూడా అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. ఆలస్యంగా పంపుతున్నందుకు క్షమించాలి-
  నింగికెగురుట, జలముల నిగిడి యుంట
  గాలి నెదిరింప, గ్రహముల గతులు మార్చ
  నేమి ఫలమొ? ఐనను, కన నిట్లు లేని
  కాంక్షలుండవు ప్రజలకు కలియుగమున.

  రిప్లయితొలగించండి
 13. శంకరాభరణప్రభలందరికీ విజయదశమి పవిత్రశుభాకాంక్షలు!
  శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ కృతఙ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 14. ధర్మమున కంత దూరము దయయు నరుదు
  ధనమె సర్వము పడదులే దానమసలు
  పరుల కుపకార మన్నను పరుగు మోక్ష
  కాంక్ష లుండవు ప్రజలకు గలియు గమున

  రిప్లయితొలగించండి
 15. మంద పీతాంబర్ గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  చంద్రశేఖర్ గారూ,
  నేదునూరి రాజేశ్వరి గారూ,
  నారాయణ గారూ,
  మిస్సన్న గారూ,
  అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
  పండుగ సంబరాల్లో, పనుల్లో తీరిక చిక్కక ఈ రోజు మీ సమస్యా పూరణలకు వ్యాఖ్యలు వ్రాయలేక పోతున్నాను. అలాగే సమస్యాపూరణం, ప్రహేళిక ఇవ్వలేకపోయాను. మన్నించండి.
  పునర్దర్శనం యథావిధిగా రేపు.

  రిప్లయితొలగించండి